
సాక్షి, కర్నూలు: తాను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీలోకి వస్తే రూ.50 కోట్లు ఇస్తామని తనకు చంద్రబాబే ఆఫర్ చేశారని తెలిపారు. ఆ పదవి వద్దు, నాకు డబ్బు వద్దని వదిలేశానని ఆయన వివరించారు. అమరావతిలో భూ కబ్జాలకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్ జనంలోకి రావాలన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు. (చదవండి: ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి)
అయ్యన్న పాత్రుడిలా అమ్మాయిలతో స్టేజీలపై డ్యాన్స్‌లు చేసే వ్యక్తిని కాదని, తనపై సీబీఐకి ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను తప్పు చేయనని, విమర్శలకు భయపడనని తెలిపారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని మంత్రి జయరాం వివరించారు.