
సాక్షి, విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వార్థ ప్రయోజనాలతో వెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పదవి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారని, కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలిచే స్థితి టీడీపీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కోర్టు తీర్పుపై తమకు గౌరవం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. చదవండి: బుల్లెట్ ప్రూఫ్ లేకుంటే ఎంపీ సాయిరెడ్డికి ఏమయ్యేదో
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం: విశ్వరూప్
ప్రకాశం: కోర్టులపై తమకు ఎప్పుడూ గౌరవం ఉందని.. ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి సమర్థించారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తాము సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. ఎన్నికలంటే తమకు భయం లేదని, ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం తమకు ముఖ్యమని వివరించారు. సచివాలయాలు ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలనం సృష్టించడంతో పాటు, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని విశ్వరూప్ అన్నారు. చదవండి: రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
చంద్రబాబు మెప్పు కోసమే..: గుడివాడ అమర్‌నాథ్
విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మెప్పు కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినట్లు నిమ్మగడ్డ నడుచుకుంటున్నారని మండిపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని కోరామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్సార్‌సీపీదేనని అమర్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.