సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ వినోదం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమా టికెట్ల రేట్లను పరిశీలించేందుకు హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని వెల్లడించారు. ఈ కమిటీ త్వరలో సమావేశమై అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని టికెట్ రేట్లను నిర్ణయిస్తుందన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో సినిమా పంపిణీదారుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. రెండు నెలల క్రితం సినీ పరిశ్రమ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాలతో జరిగిన సమావేశంలో థియేటర్ల లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ పొందాలని సూచించినప్పటికీ అలసత్వం వహించారన్నారు. ఇప్పడు థియేటర్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది జిల్లాల్లో 83 థియేటర్లను సీజ్ చేయగా, 25 సినిమా హాళ్లకు జరిమానా విధించినట్టు చెప్పారు. మరో 22 థియేటర్లకు లైసెన్సులు లేకపోవడంతో యజమానులే వాటిని మూసివేశారన్నారు.
చదవండి: (ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?)
సినిమాల మధ్య వ్యత్యాసం చూడం
‘ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకుంటుంది. వ్యక్తులను బట్టి వ్యత్యాసం చూపించదు. గతంలో అయితే చారిత్రాత్మక సినిమా అంటూ బామ్మర్ది తీసిన సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. చిరంజీవి అడిగితే ఇవ్వలేదు’ అంటూ పెద్ద సినిమాలకు మినహాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాని సమాధానమిచ్చారు. హైకోర్టు సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ల ద్వారా అవసరం అయితే టికెట్ రేట్లను పెంచుకుంటారన్నారు. ‘సినీ నటుడు నాని ఏ థియేటర్ పక్కన కిరాణా షాపు కౌంటర్‌ను లెక్కించారో నాకు తెలీదు. హీరో సిద్ధార్థ తమిళనాడులో ఉంటూ అక్కడే ట్యాక్సు కడుతున్నారు. బహుశ ఆయన స్టాలిన్ ప్రభుత్వంలోని మంత్రుల విలాసాల గురించి మాట్లాడి ఉంటారు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
రాష్ట్రంలోని సినిమా పంపిణీదారుల సంఘాల ప్రతినిధులు కార్పొరేషన్ పరిధిలోని ఏసీ థియేటర్లలో హయర్ రూ.150, లోయర్ రూ.50, నాన్ ఏసీ థియేటర్లలో హయర్ రూ.100, లోయర్ రూ.40, ఇతర ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో హయర్ రూ.100, లోయర్ రూ.40, నాన్ ఏసీ థియేటర్లలో హయర్ రూ.80, లోయర్ రూ.30గా టికెట్ రేట్లు పెట్టాలని కోరారు. దీంతోపాటు థియేటర్ల లైసెన్సుల రెన్యువల్‌కు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.విజయమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment