సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో భూ సేకరణపై పిల్ కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సేకరణకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ధి చేకూరనుందని అన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు.
భూ సేకరణతో 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం దక్కుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్యానికి వైఎస్‌ఆర్‌సీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.
ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏపీ అప్పుల గురించి పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. కేంద్రం అప్పులు చేయడం లేదా.. విభజన హామీల అమలుపై బీజేపీ నాయకులు, ఆమె చేసున్న కృషి ఏమిటి..? స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే సీఎం రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారు. పురంధేశ్వరికి చిత్త శుద్ది ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి. పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిజంగా పవన్ కల్యాణ్‌కు ఏపీపై శ్రద్ధ ఉంటే కేంద్రంపై స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయవచ్చు కదా’ అని అవంతి సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment