
సాక్షి, విజయవాడ: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఉదయం చంద్రబాబునాయుడు చేసిన హంగామాపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఎయిర్ పోర్టు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. సోమవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదని, ఏదో ఒక హడావిడి చేసి వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు డ్రామాలను కవర్ చేసేందుకు పచ్చ మీడియా ఉండనే ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న నాలుగు ఛానల్లు ఇలాంటి చెత్త వార్తలను ప్రసారం చేసేందుకే పని చేస్తాయన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ కొట్టడంతో చంద్రబాబుకు మతి భ్రమించిందని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయనే భయంతోనే చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిరసన చేయకూడదన్న కనీస పరిజ్ఞానం లేని చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తన డప్పు తానే వాయించుకునే చంద్రబాబుకు నియమ నిబంధనలను పట్టవా అని నిలదీశారు. నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందన్నారు.
మంగళగిరిలో కొడుకును, సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోలేని చంద్రబాబు ఇక రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో పచ్చ పార్టీ మద్దతుదారులకు బుద్ది చెప్పిన అక్కడి ప్రజానికం, తదుపరి ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నుంచి తరిమికొడతారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment