
సాక్షి, అమరావతి: శాసనసభలో గురువారం రోడ్ల నిర్మాణం, నీటి పారుదల, వ్యవసాయం, పశుసంవర్థక, పౌరసరఫరాలు తదితర శాఖల పద్దులపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు.
బాబు ఒక్క ఫ్లైఓవర్‌నూ కట్టలేకపోయారు
చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయారు. అలాంటి వ్యక్తి అమరావతి నిర్మిస్తానని ప్రగల్భాలు పలకడం విడ్డూరం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడేళ్లలో 1,943 కిలోమీటర్లను అభివృద్ధి చేసింది. మరో 365 కిలోమీటర్లకు సంబంధించి కేంద్రాన్ని ఒప్పించి రూ.2,305 కోట్లు మంజూరు చేయించాం. గతంలో టీడీపీ నుంచి కేంద్ర మంత్రులున్నా కూడా.. వారు చేయలేని పనిని మూడేళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు.
– కొఠారు అబ్బయ్య చౌదరి
సీమలో సమృద్ధిగా నీళ్లు..
రాయలసీమలో నీళ్లు పారించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుంది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో సీమ నుంచి వేల కుటుంబాలు వలసపోయాయి. చంద్రబాబు ఇకనైనా కోర్టుల ద్వారా దొంగ యుద్ధం చేయడం మానుకోవాలి.
– శ్రీధర్‌రెడ్డి
రైతులకు ఉత్తమ సేవలు..
ప్రభుత్వం నుంచి రైతులు కోరుకునేది జాలి కాదు.. ఉత్తమ సేవలు. సీఎం జగన్ మొక్కవోని దీక్షతో రైతులకు అత్యుత్తమ సేవలందిస్తున్నారు. వ్యవసాయంలో ఏపీ దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్రమే వెల్లడించింది. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ అందించే ఫీడర్లు, లైన్ల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది.
– సామినేని ఉదయభాను
ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులపై ప్రేమ తగ్గలేదు..
కరోనా వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా సీఎం జగన్‌కు రైతులపై ఉన్న ప్రేమ తగ్గలేదు. వారికి మేలు చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. 2014లో రైతు రుణ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వారిని వంచించారు. నీరు–చెట్టు, రెయిన్ గన్‌లు.. ఇలా ప్రతి దాంట్లో దోపిడీ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపైనా బాబుకు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రాజెక్టులనూ పూర్తి చేస్తున్నారు.
– తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
వేగంగా భైరవానితిప్ప ప్రాజెక్టు..
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. 1,406 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చాలా గ్రామాలకు సాగునీటి అవసరాలు తీరుతాయి.
– ఉషశ్రీ చరణ్
శంకుస్థాపన చేసి.. ప్రాజెక్టు పూర్తయినంత ప్రచారం
భైరవానితిప్ప ప్రాజెక్టుకు కేవలం శంకుస్థాపన చేసి.. నీళ్లు తెచ్చేశామంటూ గతంలో టీడీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సీఎం జగన్ అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
– కాపు రామచంద్రారెడ్డి
వైఎస్ జగన్‌ది గొప్ప సంకల్పం
ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప సంకల్పం సీఎం వైఎస్ జగన్‌ది. వైఎస్సార్ తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment