ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసిన భగీరథరెడ్డి, ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, కళ్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ ఆర్వో సుబ్బారెడ్డికి వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు.
మే నాటికి మండలిలో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం
వైఎస్సార్‌సీపీలో కష్టించి పని చేసే వారికి మంచి గుర్తింపు, హోదా లభిస్తుందని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ అనంతరం ఆయన వారితో కలిసి శాసనమండలి వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని, పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి, సమపాళ్లలో సముచిత స్థానాలు కల్పించటం జరుగుతోందన్నారు. ఇది సీఎం జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని తెలుగు ప్రజలంతా గమనించారని చెప్పారు. వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారన్నారు. వచ్చే మే నెలలో వైఎస్సార్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుందన్నారు. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ తీసుకునే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ఊపందుకుంటాయని తెలిపారు.
బాలయ్య ధ్యాస సినిమాలపైనే : ఇక్బాల్
వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నానని, అడగకుండానే తనకు రెండోసారి ఎమ్మెల్సీగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లెజెండ్, రూలర్ అనుకుంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ప్రజాసేవను గాలికి వదిలేశారని పేర్కొన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు : సి.రామచంద్రయ్య
ఇచ్చిన మాటను ఈ స్థాయిలో నిలబెట్టుకునే సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని సీనియర్ రాజకీయ వేత్త, ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరుతో విశ్వసనీయత కోల్పోయారని తెలిపారు. టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదని.. చంద్రబాబు, లోకేష్ ఉన్నంత వరకు టీడీపీకి మనుగడ ఉండదని జోస్యం చెప్పారు.
అచ్చెన్న ప్రజాద్రోహి : దువ్వాడ శ్రీనివాస్
వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అచ్చెన్నాయుడు ప్రజా ద్రోహి అని ధ్వజమెత్తారు. తనపై అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై అమరావతిలో బహిరంగ చర్చ పెడతానని, ఈ చర్చకు ఆయన రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని చెప్పారు.
మండలిలో ప్రజా సమస్యలు వినిపిస్తాం
సీఎం జగన్ ఎంతో నమ్మకంతో తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని అభ్యర్థులు కళ్యాణ్ చక్రవర్తి, భగీరథరెడ్డి, కరీమున్నీసా తెలిపారు. ప్రజా సమస్యలు మండలిలో ప్రస్తావించి, మండలి ప్రతిష్ట పెరిగేలా పని చేస్తామన్నారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌కు జన్మజన్మలా రుణపడి ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment