సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిలో పలు బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా విడుదల చేసింది.
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్త, ప్రాథమిక వైద్యాధికారులు వివిధ పర్యవేక్షణ బాధ్యతల్లో పాల్గొంటారని పేర్కొంది. వారు తమ పరిధిలోని స్కూల్‌ను సందర్శిస్తూ బోధనేతర కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి.
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలోని పాఠశాలను కనీసం వారానికొకసారి సందర్శించి పిల్లల హాజరును పరిశీలించాలి. హాజరు తక్కువగా ఉన్న పిల్లల తలిదండ్రులతో మాట్లాడి.. వంద శాతం హాజరుకు అవసరమైన కృషి చేయాలి. పాఠశాలలోని పరిస్థితులే కారణమైతే.. వాటిని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి.
పౌష్టికాహారం అందేలా..
మధ్యాహ్న భోజన రికార్డులను కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలే పరిశీలించాల్సి ఉంటుంది. వారానికొకసారి స్కూల్‌ను సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజన రికార్డుల పరిశీలనతో పాటు మెనూ ప్రకారం భోజనం రుచిగా, శుచిగా ఉందా అనే వివరాలను సేకరించాలి.
ఏదైనా సమస్య ఉంటే పేరెంట్స్ కమిటీతో కలిసి పరిష్కారానికి కృషి చేయాలి. ఏఎన్‌ఎంలు ప్రతి నెలా తమ పరిధిలోని స్కూళ్లను సందర్శించి.. పిల్లల పౌష్టికాహార పరిస్థితులు అంచనా వేయాలి. వ్యాధి నిరోధక టీకాలతో పాటు స్థానిక వైద్యాధికారి, ఆశా వర్కర్‌తో కలిసి పిల్లలకు వైద్య సహాయం అందించాలి.
భద్రతపై విద్యార్థినులకు అవగాహన..
ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు ఏర్పాటు చేసి.. దానిని సచివాలయ మహిళా పోలీస్ పర్యవేక్షించాలి. అలాగే విద్యార్థినులకు తరుచూ సమావేశాలు నిర్వహించి.. వారి భద్రతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అవగాహన కల్పించాలి. అలాగే నాడు–నేడు పనులను సంబంధిత పాఠశాల పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తారు.
పిల్లల అభిప్రాయాల మేరకు పాఠశాలలో అవసరమైన మరమ్మతులను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు గుర్తించి.. పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల భాగస్వామ్యంతో నాడు–నేడులో ఆ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్‌లోని మరుగుదొడ్ల పరిశుభ్రతపై నెలవారీ సమీక్ష బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు. వీరు ఉన్నతాధికారుల సహాయంతో నీటి సరఫరాకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
సచివాలయ సిబ్బందికి ‘బోధనేతర’ బాధ్యతలు
Published Mon, Dec 19 2022 3:46 AM | Last Updated on Mon, Dec 19 2022 8:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment