పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): వర్షాకాలం మొదలైంది. పాములు ఎక్కడపడితే కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకుని ఉంటాడు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో గత మూడు రోజుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు.
అన్ని పాములు ప్రమాదకరం కాదు
మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
రక్తపింజర
ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి.
నాగుపాము
నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
కట్లపాము
కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు పాటించాలి
► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి.
► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు.
అన్ని ఆస్పత్రుల్లో యాంటివీనమ్
పాముల నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తత అవసరం. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
– జె. సురేష్, వైద్యుడు, పులిరామన్నగూడెం
Comments
Please login to add a commentAdd a comment