సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది యువత వైరస్ బారిన పడుతున్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31వతేదీ వరకూ 20,647 కేసులు నమోదు కాగా 19 నుంచి 40 ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నారు. 19 నుంచి 30 ఏళ్ల లోపు వారు 21 శాతం మంది ఉండటం గమనార్హం. బయట ఎక్కువగా తిరుగుతున్న వారిలో వీరే అధికం. సెకండ్ వేవ్‌లో వృద్ధులు జాగ్రత్తలు వహిస్తున్నట్లు తేలింది. ఈ దఫా పెద్ద వయసు వారిలో తక్కువ మందికి కరోనా సోకినట్లు తేలింది. రోజువారీ కేసులను బట్టి వృద్ధుల్లో 1.5 శాతం మంది కూడా లేరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మహిళల్లో తక్కువ..
గత మూడు నెలల్లో నమోదైన కోవిడ్ కేసుల్లో పురుషులే అత్యధికంగా 12 వేల మందికిపైగా ఉన్నారు. 19 నుంచి 30 ఏళ్ల వయసు మహిళల్లో 1,710 మంది బాధితులున్నారు. బాల బాలికల్లో పదేళ్ల లోపు వారు 647 మంది ఉన్నారు. చిన్నారుల్లో ఎక్కువగా సెకండరీ కాంటాక్ట్ ద్వారా అంటే తల్లిదండ్రులు, బంధువుల నుంచి సోకినట్లు వెల్లడైంది.
మాస్కులు.. దూరం.. సబ్బు
విధిలేని పరిస్థితుల్లోనే బయటకు రావాలని, ఒకవేళ వచ్చినా మాస్కు లేకుండా సంచరిస్తే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది జన సమర్థ ప్రాంతాలకు యథేచ్ఛగా వస్తున్నారు. వీరిలో చాలామంది మాస్కులు ధరించడం లేదు. దీనివల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం.. ఈ మూడు మార్గాలే కరోనా నియంత్రణకు కీలకమని స్పష్టం చేస్తున్నారు. జీవనశైలి జబ్బులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు దాటిన వారు వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండాలని, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
యువతపై కరోనా పంజా
Published Wed, Apr 14 2021 2:19 AM | Last Updated on Wed, Apr 14 2021 9:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment