సాక్షి, గుంటూరు జిల్లా: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి రాగా.. వీరిలో దాదాపు లక్ష మందికి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యానికి డాక్టర్లు రిఫరల్‌కు పంపించారని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. కేవలం రిఫరల్‌తో ఆగిపోకుండా చికిత్స అనంతరం తిరిగి గ్రామాలకొచ్చాక కూడా ఆయా పేషంట్ లు ఏమేరకు సంతృప్తి పొందారో ఫీడ్ బ్యాక్ తీసుకుని, బాగుందని సంతృప్తి చెందే వరకు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు. ఆ దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మార్కండేయ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆరోగ్య శ్రీ సీఈవో ఎం.యన్.హరీందర ప్రసాద్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ బాబు పాల్గొన్నారు.
గతంలో ఒక యుపిహెచ్‌సీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నామని తెలిపిన ఎం. టీ. కృష్ణబాబు.. ప్రతి వార్డు సచివాలయంలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ యాప్‌లను వాలంటీర్ల ద్వారా డౌన్‌లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తద్వారా సమీపంలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు,ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు వంటి సమాచారం యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఆరోగ్య శ్రీకి సంబంధించి పూర్తి సమాచారంతో ముద్రించిన బ్రోచర్లను కూడా ఇంటింటికి పంపిణీ చేశామన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 వేలకు పైగా శిబిరాల్ని నిర్వహించామని, సరాసరి 450 ఓపీలు నమోదయ్యాయని కృష్ణ బాబు పేర్కొన్నారు. వీరందరికీ పరీక్షలు, మందులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని ఉచితంగా అందించామన్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ కూడా చేశారన్నారు. ఆరోగ్య శ్రీ పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. పేద ప్రజలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా.. ప్రభుత్వం నుండి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఆరోగ్య శ్రీపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేసేందుకు ఎఎన్ ఎం/సిహెచ్వోలు, వాలంటీర్లతో కలిసి పనిచేస్తారని కృష్ణ బాబు తెలిపారు.
గ్రామాల్లో అక్కడికక్కడే పూర్తి స్థాయి షుగర్ టెస్టులు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కృష్ణబాబు తెలిపారు. తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయాలని కమీషనర్ నివాస్, ఆరోగ్య శ్రీ సీఈవో హరీంధరప్రసాద్‌లకు ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా ఆరోగ్య శ్రీ బ్రోచర్ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు.ఆరోగ్యశ్రీ బ్రోచర్లోని సమాచారాన్ని చదివారా? అని రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. శిబిరానికొచ్చిన రోగులు , వృద్ధులు, గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ యాప్ ను ఎఎన్ఎంలు డౌన్లోడ్ చేయిస్తున్నారా అని ఆరా తీశారు. జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులు , ఫోల్డర్లు సరిపడా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకన్నారు.
ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment