దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..! | Mudragada Padmanabam Mocks Over Chandrababu Naidu Breakdown Episode | Sakshi
Sakshi News home page

దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..!

Published Wed, Nov 24 2021 1:28 AM | Last Updated on Wed, Nov 24 2021 1:59 AM

Mudragada Padmanabam Mocks Over Chandrababu Naidu Breakdown Episode - Sakshi

భార్యకు అవమానం జరిగిందంటూ చంద్రబాబునాయుడు చాలా బాధ పడుతూ వెక్కివెక్కి కన్నీరు కార్చడం టీవీల్లో చూసి చాలా ఆశ్చర్యపోయానని కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. గతంలో కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా తన భార్యను, కోడలిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రాక్షసానందం పొందారని పేర్కొంటూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. లేఖలోని అంశాలివీ...

‘‘చంద్రబాబునాయుడు గారికి...
మీ ఉక్కుపాదాలతో అణచివేయబడ్డ మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారాలు.
మా జాతికి మీరిచ్చిన హామీ కోసం నేను దీక్ష మొదలు పెట్టిన మొదటి రోజునే తమ పుత్రరత్నం సాగించిన కార్యకలాపాలు మరిచిపోయారా? మా ఇంటి ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్లు చేస్తూ, నన్ను బండబూతులతో సంబోధిస్తూ, బయటకు లాగారా లేదా అని వాకబు చేసిన మాట వాస్తవం కాదా? తలుపులు బద్దలుగొట్టి నా భార్యను, కోడలిని ‘లెగవే’ అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించి, బూటు కాళ్లతో తన్నించి ఈడ్చుకెళ్లడం గుర్తు లేదా?

కొడితే మీకు ఇక్కడ దిక్కెవరని తిట్టించి, నా కుమారుడిని లాఠీలతో కొట్టుకుని తీసుకువెళ్లింది గుర్తు లేదా? ఇప్పుడు మీ నోటి వెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. తమరి దృష్టిలో మాది ఏ కుటుంబమనుకుంటున్నారు? మీరు, మీ భార్య దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి? మా కొంపలు ఏమిటి?

దీక్షలప్పుడు ఒకసారి హెలికాప్టర్‌ను, మరోసారి సుమారు 6 వేల మంది పోలీసులను ప్రయోగించి తీహార్‌ జైలుకు పంపాలని, డ్రోన్‌ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టి, కార్గిల్‌ యుద్ధ భూమిని తలపించేలా నా ఇంటి వద్ద భయోత్పాతం సృష్టించింది వాస్తవం కాదా? ఆ సంఘటనలు గుర్తు చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని, మీ భార్యను అవమానించడం కోసం ఈ లేఖ రాయలేదు. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవు. నా గదిలో ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌ల వంటి విలువైన వస్తువులను ఆ రోజు దొంగి లించారు.

హాస్పిటల్‌ అనే జైలులో దుస్తులు మార్చుకోవడానికి, స్నానాలు చేయడానికి వీలు లేకుండా 14 రోజులు ఏ కారణంతో ఉంచారు? ఆ చిన్న గదిలో మా నలుగురితో పాటు మరో ఆరుగురు పోలీసులను పగలు, రాత్రుళ్లు కాపలాగా ఉంచారు. రేకు కుర్చీలతో శబ్దాలు చేయిస్తూ, ప్రతి రోజూ రాత్రి మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫొటోలు తీయించి పంపించమని పోలీసు అధికారులను మీరు ఆదేశించింది రాక్షసానందం కోసం కాదా?

తమరు చేయించిన హింస, అవమానాలు భరించలేక వాటిని తలచుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. నాలుగేళ్ల నా మనవరాలు అర్ధరాత్రి గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలడం లేదు. భూమి గుండ్రంగా ఉన్న సంగతి మరవద్దు బాబూ. నన్ను, నా కుటుంబాన్ని అంత దారుణంగా అణచివేయాలని ఎందుకు అని పించింది? ఆ రోజున మీ పదవికి అడ్డు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. నేనైతే కాదు.

అయినా నాపై కట్టలు తెంచుకునే కోపాన్ని, క్రూరత్వాన్ని ఎందుకు చూపారు? నాటి అణచివేత చర్యల వెనుక మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలనే ప్రయత్నం దాగి లేదా? మీరనుకున్నట్టే నేను కూడా ఆలోచన చేశాను. కానీ మనసులో ఏదో మూల నా కుటుంబాన్ని అవమానపరచిన తమరి పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాను.

కొద్దోగొప్పో మీ కన్నా మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. మా తాత పేరుకే కిర్లంపూడి మునసబుగా ఉన్నా జిల్లా మునసబుగా పేరు గడించారు. నా తండ్రిని ప్రజలు ప్రేమతో రెండు దఫాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా అసెంబ్లీకి పంపారు. మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. మీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు వద్ద, తరువాత మీ పిలుపుతో మీ వద్ద చాలా సంవత్సరాలు పని చేశాను. మీతో ఉన్న రోజుల్లో ఏ ఒక్క రోజూ మీకు వెన్నుపోటు పొడవాలనే ప్రయత్నం వీసమెత్తు కూడా చేయలేదు.

కార్యకర్తలు, బంధువుల సానుభూతిని మీడియా ద్వారా పొందే అవకాశం తమరికి మాత్రమే వచ్చింది. ఈ రోజు తమరు పొందుతున్న సానుభూతి ఆనాడు నేను పొందకుండా ఉండడం కోసం మీడియాను కూడా నియంత్రించడం వాస్తవం కాదా? ఆ రోజు నుంచి నన్ను అనాథను చేయడం కూడా తమరి భిక్షే కదా! చంద్రబాబూ! తమరు శపథాలు చేయవద్దు. తమరికి, నాకు అవి నీటి మీద రాతలు.

అటువంటి శపథం చేసిన, చేసే నైతికత అప్పటి ప్రధాని,æ సీఎంలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, తమిళనాడు సీఎం జయలలిత, ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకే సొంతం. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించాలి.  ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో తమకు ఓట్లు వేయలేదన్నది గ్రహించండి.’’ 
ఇట్లు
మీ ముద్రగడ పద్మనాభం, మాజీ శాసనసభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement