
సాక్షి, హైదరాబాద్: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై రాజకీయాలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ఉల్మా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ ఫారూక్ హెచ్చరించారు. నిందితులకు బెయిల్ ఇప్పించిన టీడీపీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని విమర్శించారు. టీడీపీ కార్యదర్శిగా ఉన్న న్యాయవాది నిందితులకు బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు. ముస్లిం సంఘాల పేరుతో టీడీపీ, కొన్ని రాజకీయ పక్షాలు నంద్యాలకు బస్సు యాత్ర చేపట్టటాన్ని ఖండించారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడాన్ని స్వాగతించారు. అధికారంలో ఉండగా ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని ముఫ్తీ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రాజమండ్రిలో ఒక మసీదు మౌజమ్ హత్యకు గురైతే ఆ కుటుంబానికి కనీసం న్యాయం చేయలేక పోయారని మండిపడ్డారు. ముస్లిం యువతపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయటాన్ని మరవబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment