సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘మార్గదర్శి యాజమాన్యం నన్ను నిలువునా ముంచేసింది. నా నుంచి 18 నెలల పాటు నెలకు రూ. లక్ష వాయిదాలుగా వసూలు చేసి పాట పాడిన డబ్బు ఇవ్వకుండా 4 నెలలు నరకయాతన చూపించారు.’ అంటూ ట్యాక్స్ కన్సల్టెంట్, న్యాయవాది, మార్గదర్శి బాధితుడు ముష్టి శ్రీనివాస్ వాపోయారు. ఆయన గురువారం విజయవాడలోని జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో విలేకరులతో.. “మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ కె.శ్రీనివాసులు 2021 ఆగస్టులో నా దగ్గరకు వచ్చి మార్గదర్శిలో చిట్ వేయాలని కోరారు.
అప్పటికే నా ఆస్తిని బ్యాంక్‌లో తనఖా పెట్టానని, చీటీ డబ్బులు ఇవ్వాలంటే సెకండ్ చార్జ్ తనఖా ద్వారా ఇస్తారా అని అడిగాను. ఓటీఎస్ తెచ్చుకుంటే హెడ్ ఆఫీస్‌తో మాట్లాడి చిట్ పాడుకునే అవకాశం కల్పిస్తామని ఇద్దరూ నమ్మబలికారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 నెలలు క్రమం తప్పకుండా వాయిదా డబ్బులు కట్టాను. 2022 డిసెంబర్ 29న బ్యాంకుతో ఓటీఎస్ ఒప్పందం చేసుకున్నాను. ఓటీఎస్ వచ్చిన వెంటనే మార్గదర్శి మేనేజర్‌కు తెలియజేసి చీటీ పాడాలని కోరాను. ఓటీఎస్ లెటర్, షూరిటీ, బ్యాంకు రసీదు, టైటిల్‌డీడ్ ఫారాలు మార్గదర్శికి అందించాను. ఫిబ్రవరి నెలలో చిట్ పాడతానంటే ఆ నెల వాయిదా కట్టించుకున్నారు.
ఫిబ్రవరిలో పాట ఇవ్వకుండా మోసం చేశారు. మార్చిలో పాట ఇస్తామని, పాటలో పాల్గొనే అర్హత కోసం ముందే రూ. లక్ష వాయిదాగా చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బుల కోసం మా ఇంటికొచ్చారు. బార్బర్ షాపు వద్ద ఉన్నానని తెలుసుకుని అక్కడకొచ్చి మరీ డబ్బు వసూలు చేశారు. ఆ తరువాత పాట జరిగిందా.. లేదా అని అడిగినా ఎవరూ చెప్పలేదు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ ఫోన్ చేసి మీకే పాట వచ్చిందని, రూ. 11.50 లక్షలకు పాడారని చెప్పారు. పాట ఇంత మొత్తానికి పాడమని వాళ్లకు నేను లెటర్ ఇవ్వలేదు. వాళ్లే పాట నిర్ణయించేశారు.
నా డబ్బులు నాకివ్వమని పలుమార్లు కోరినా ఇవ్వలేదు. షూరిటీ ఫారాలు ఇవ్వలేదని ఏప్రిల్ 14న, సెంకడ్ చార్‌్జపైనా అభిప్రాయం కోసం హెడ్ ఆఫీసుకు పంపామని 24వ తేదీన, సరైన షూరిటీలు సమర్పించ లేదని జూన్ 8న లెటర్లు పంపారు. వాటని్నంటికీ వెంటనే సమాధానం ఇచ్చాను. బ్రాంచి చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తి తుదకు నేను కట్టిన డబ్బులనైనా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు’ అని వివరించారు. రిజిస్ట్రార్‌ను మేనేజ్ చేసి 50 మందికి బదులు 30 మందినే గ్రూపులో రిజిస్టర్ చేశారని తెలిపారు.
ఈనాడు వితండవాదం
విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఈనాడు బృందం బాధితుడు ముష్టి శ్రీనివాస్‌తో వితండ వాదానికి దిగింది. మార్గదర్శి తప్పేమీ లేదని, తప్పందా బాధితుడు ముష్టి శ్రీనివాస్‌దేనని చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది.
ఎన్‌పీఏపై ఈనాడు సంధించిన ప్రశ్నలకు ఏ మాత్రం జంకకుండా బాధితుడు సమాధానమిచ్చారు.. తాను డిఫాల్టర్‌ని అయితే, సరిగా వాయిదాలు కట్టకపోతే నేను పాట పాడేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. సెకండ్ చార్జ్ ద్వారా షూరిటీ తీసుకోకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. దాదాపు అరగంట పాటు ప్రశ్నించినా బాధితుడు దీటుగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక ఈనాడు బృందం అక్కడి నుంచి నిష్క్రమించింది.
రామోజీరావుపై చీటింగ్ కేసు
♦ మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచి మేనేజర్, మరికొందరిపైనా కేసు
♦ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై విజయవాడ న్యాయవాది ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్‌లో మోసాలపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్‌తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్‌లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్‌గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్‌లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్‌లో పాల్గొన్నారు.
19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్‌లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment