విరాళాన్ని ఈవోకి అందజేస్తున్న దాతలు
తిరుమల: చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు.
శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేశారు. ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు చేపట్టారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు.
సర్వ దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 24 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 67,276 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.71 కోట్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment