ఎటు చూసినా పచ్చని పొలాలు.. పొడవాటి కొబ్బరి చెట్లు.. అరటి తోటలు.. ఇంకొంచెం ముందుకెళ్తే విశాలమైన బీచ్.. ఎగిసిఎగిసి పడే అలల సవ్వడులు.. మధ్యలో ఆధ్యాత్మికత పరిఢవిల్లే జ్యోతిర్లింగాల క్షేత్రం. అటు ఆహ్లాదం.. ఇటు ఆధ్యాత్మికం ఉట్టిపడే మైపాడు. అలసిన మనస్సులను మైమరిపిస్తోంది.. సేద తీరుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు నేటి తరం ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమాలు ఇక్కడ నిర్మించారు. చిన్నచిన్న సినిమాల అవుట్ డోర్ షూటింగ్‌లకు ఇక్కడి ప్రకృతి రా..రమ్మని పిలుస్తోంది.
ఇందుకూరుపేట:(పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా నిలుస్తోంది. మైపాడు సముద్ర తీరం ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు కొదవ లేదు. క్షణం తీరిక లేకుండా ఉరుకుల పరుగుల జీవితాలు గడిపే ఈ ఆధునిక కాలంలో కాసింత సమయం దొరికితే ఆహ్లాదంగా గడిపేందుకు గుర్తుచ్చేది ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు, ఎగిసి ఎగిసి పడే అలల ఆహ్లాదం, ఆధ్యాత్మికత పరవశించే దివ్యక్షేత్రం పర్యాటకులను అలరిస్తోంది.. మళ్లీ మళ్లీ రా..రమ్మని ఆహ్వానిస్తోంది. జిల్లా వాసులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా గడిపి సేద తీరుతారు.
నెల్లూరుకు 22 కి.మీ. దూరంలో మైపాడు సముద్ర తీరం ఉంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి ప్రతి గంటకు మైపాడు వరకు, ప్రతి గంటకు బీచ్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. నెల్లూరు రూరల్ మండలం దాటుకొని ఇందుకూరుపేట మండలంలోకి అడుగు పెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. సరిహద్దు గ్రామం డేవిస్‌పేట రాగానే దశాబ్దాల కాలం నాటి మహావృక్షాలు దర్శనమిస్తాయి.
అక్కడ నుంచి ముందుకు సాగితే.. జగదేవిపేట, రావూరు, మొత్తలు, నరసాపురం గ్రామాల్లో రోడ్డు వెంబడి పొడవాటి కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, అరటి తోటలు చల్లని గాలులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. మైపాడు బీచ్‌కు చేరుకుంటే.. ఎగిసి పడుతున్న సముద్రపు అలలు, ఇసుక తిన్నెలను చూడగానే తారతామ్యలు మరిచి సంతోషంగా గడపాల్సిందే. ముఖ్యంగా యువత చిన్న పిల్లలు, ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు అయిష్టతే చూపుతారు. ప్రేమికులకు సైతం ఈ సాగర తీరం స్వర్గధామంగా నిలుస్తోంది.
జ్యోతిర్లింగాల క్షేత్రం
మైపాడు తీరంలో ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి తీరంలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలయం దేశాన్ని చుట్టి వచ్చిన అనుభూతిని కలిగిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయంభుగా కొలువైన జ్యోతిర్లింగాలను దర్శించిన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఇక్కడ అమర్‌నాథ్ (జమ్మూ–కశ్మీర్) సోమేశ్వరుడు (గుజరాత్), మల్లికార్జునస్వామి (ఆంధ్రప్రదేశ్), మహా కాళేశ్వరుడు (మధ్యప్రదేశ్), కేధారేశ్వరుడు(ఉత్తరాంచల్), ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్) భీమేశ్వరుడు (పూణే, మహారాష్ట్ర), కాశీవిశ్వేశ్వరుడు(వారణాశి, ఉత్తరప్రదేశ్), త్రయంబకేశ్వరుడు (నాసిక్, మహారాష్ట్ర), వైద్యనాథేశ్వరుడు (దేవనగర్, జార్ఖండ్), నాగేశ్వరుడు (ద్వారకా, గుజరాత్), రామలింగేశ్వరుడు (రామేశ్వరం, తమిళనాడు)తో పాటు శ్రీఘ్రషోశ్వరుడు (ఔరంగాబాద్, మహారాష్ట్ర) సుబ్రహ్మణ్యం స్వామి (తమిళనాడు), గోకర్ణ గణేష్ (కర్ణాటక), పళని సుబ్రహ్మణ్యం స్వామి వళ్లీ దేవసేన సమేత సూర్య, చంద్ర పార్వతీ దుర్గాదేవిలు ఈ సాగర తీరంలోని ఒకే ఆలయంలో కొలువైన ఏకైక ఆధ్మాత్మిక క్షేత్రమిది.
స్వామివార్ల మూలవిరాట్‌కు ఎదురుగా భారీ రాతి నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆలయ ఆవరణలో ఉన్న 25 అడుగుల కైలాసనాథుడు, 24 అడుగుల పొడవు పార్వతీదేవి భక్తులను ఆలయం వెలుపల నుంచి భక్తులను కటాక్షిస్తున్నారు. పక్కనే ఉన్న భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆధ్యాత్మికతకు కొదువలేదు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎత్తైన మహా శివలింగం తన్మయత్వం చెందేలా చేస్తోంది. మైపాడు సముద్ర తీరం అటు ఆహ్లాదాన్ని, ఇటు ఆధ్మాత్మికతో పరవశింప చేస్తోంది.
షూటింగ్‌లకు అనువు
జగదేవిపేట, ఇందుకూరుపేట, కొత్తూరు, డేవిస్‌పేట, మొత్తలు గ్రామాల్లో తోటలు, చెట్లు పచ్చగా ఆహ్లాదకంగా ఉంటాయి. మైపాడు బీచ్ ఆనంద పరవశం చేస్తోంది. దీంతో ఫొటోలు తీసేందుకు అనువుగా ఉంటుంది. ఫొటో షూట్ కోసం ఎంతో మంది ఇక్కడి వస్తుంటారు. షార్ట్ ఫిల్మ్‌లు కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారు.
– బోయళ్ల శివప్రవీణ్‌కుమార్, నెల్లూరు, పీజే ఫొటోగ్రఫీ
బీచ్‌లో గడపడమంటే ఇష్టం
ఎప్పుడు సమయం దొరికిన స్నేహితులతో కలిసి మైపాడు బీచ్‌కు వస్తుంటాం. ఈ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ సేద తీరేందుకు బాగా ఇçష్టపడుతాం. జిల్లా కేంద్రానికి దగ్గరి దూరంలో ఉండడంతో పాటు బీచ్‌కు వచ్చేందుకు అనువుగా ఉంటుంది.
– సీహెచ్ వెంకటేష్, నెల్లూరు
ప్రకృతి బాగుంటుంది
ఇందుకూరుపేట మండలంలో ప్రకృతి బాగుంటుంది. పచ్చని పొలాలు, చెట్లు, సాగర తీరం ఇక్కడ ఉన్నాయి. దీంతో కొత్తగా పెళ్లయిన వారి ఫొట్ అల్బ్‌మ్ తయారీ కోసం ఈ ప్రాంంతం బ్యాక్‌గ్రౌండ్‌ను ఫొటోలు, వీడియోలు తీస్తోంటాం. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఇష్టపడుతూ ఉంటారు.
– గోడ విష్ణు, ఫొటో గ్రాఫర్, నెల్లూరు
చిత్రసీమకు షూటింగ్ స్పాట్
మైమరిపించే ప్రకృతి అందాలకు నెలవైన మండలంలోని పరిసర ప్రాంతాలు చిత్రసీమకు షూటింగ్ స్పాట్‌గా మారింది. అలనాటి తర కథనాయకుల నుంచి నేటి యువతరం సినీ హీరోల సినిమాలతో పాటు చిన్నచిన్న సినిమాలు, షార్ట్ ఫీల్మ్ షూటింగ్స్, ఫొటో షూట్‌లకు ఈ ప్రదేశం చిరునామాగా మారింది. పెళ్లి అల్బ్‌మ్‌ల కోసం కొత్త జంటలు, కుటుంబ సభ్యులు ఇక్కడి బ్యాక్‌గ్రౌండ్ అందాలతో ఫొటోలు తీసుకుని మధుర జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటున్నారు. సీనియర్ ఎన్టీయార్, చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ఇక్కడే షూటింగ్ చేయడం విశేషం.
విడిది.. విందులకు రిసార్ట్స్
మైపాడు బీచ్ ప్రాంతం పర్యాటకుల ఆనందాలకు నెలవుగా ఉంటుంది. విడిది.. విందులకు అనువుగా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. పర్యాటకశాఖ (ఏపీ టూరిజం) బీచ్ వద్ద హరితా రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. తీరం సమీపాన తాటిచెట్ల మధ్యలో ఉన్న ఈ రిసార్ట్స్‌లో విడిదితో పాటు, రెస్టారెంట్‌ను అందుబాటులో ఉంది. పర్యాటకులు ఇక్కడ పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, విందులు, వినోదాలు చేసుకొని కాలాన్ని మైమరిచి పోతుంటారు. ఇక్కడి గదులను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయం ఏపీ టూరిజం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment