మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు | Nadu Nedu Phase 2 Works On Bussy Day At Vizianagaram | Sakshi
Sakshi News home page

మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు

Published Mon, Jun 20 2022 10:47 AM | Last Updated on Mon, Jun 20 2022 10:47 AM

Nadu Nedu Phase 2 Works On Bussy Day At Vizianagaram - Sakshi

విజయనగరం పూల్‌బాగ్‌: జిల్లాలో మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చురుగ్గా సాగుతున్నాయి. అనుకున్న సమయానికే పనులు పూర్తిచేసి పాఠశాల అదనపు తరగతి గదులను వినియోగంలోనికి తెచ్చేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లాలో నాడు–నేడు మొదటి విడతలో రూ.238 కోట్లుతో 1,060 పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిచేయడం జరిగింది.  

ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో.. 
రాష్ట్ర పభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రెండో విడిత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాఠశాల తల్లిదండ్రులకు కమిటీలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతో కూడిన బ్యాంకు అకౌంటులో నాడు–నేడు రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల చేస్తున్నారు.ఈ ఫండ్‌తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాడు–నేడు మొదటి విడతలో పని చేసిన అనుభవం  ఉన్న ఎంఈఓ, ఏఈ, హెచ్‌ఎంలు, పేరెంట్‌ కమిటీల సభ్యులు, సిఆర్పీలు, ఎమ్మార్సీలో పని చేస్తున్న ఎంఐఎస్, ఎల్డీఏ, మండల లెవెల్‌ అకౌంటెంట్స్‌తో పాటు మిగిలిన సిబ్బంది, సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్‌ సిబ్బందితో రెండో విడత పనులు పూర్తిచేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 

తొమ్మిది రకాల పనులు.. 
నాడు–నేడు రెండో విడిత కోసం జిల్లాలో ఉన్న మొత్తం 27 మండలాల్లో  451 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ పనుల కోసం ఏపీఈపీడబ్ల్యూఐడీసీకి 160 పాఠశాలలు, ప్రజారోగ్య డిపార్ట్‌మెంటుకు 33 పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్‌మెంట్‌కు 63 పాఠశాలలు, సమగ్రశిక్షా డిపార్ట్‌మెంట్‌కు 195 చొప్పున మొత్తం నాలుగు ఏజెన్సీలకు నిర్మాణ పనుల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండో విడతను జాతీయ నూతన విద్యావిధానం ఆధారంగా చేసుకొని పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం కేవలం కంపోనేంట్‌ పనులు మాత్రమే కాకుండా అదనపు తరగతి గదుల నిర్మాణ పనులతో కూడిన 9 రకాల పనులు జరుగుతున్నాయి. వీటిల్లో అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయి మరమ్మతులు, ఉన్నత పాఠశాలల్లో 10 కాంపోనెంట్స్‌ పనులు ఉన్నాయి.  

నిధుల విడుదల.. 
451 పాఠశాలలకు (514 ప్రాజెక్టు పను) రూ.68 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. 576 పాఠశాల అదనపు తరగతి గదుల కోసం రూ.69కోట్ల 12 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 439 పాఠశాలల పేరెంట్స్‌ కమిటీ ఖాతాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ జమ అయింది. 

ఇసుక, సిమెంట్‌కు కొరత లేదు  
విజయనగరం కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు ఇసుక కోసం ప్రతి మండలంలో 3 స్టాక్‌ పాయింట్స్‌ను ఏర్పాటు చేశాం. ఇండెంట్‌ పెట్టిన పాఠశాలలన్నింటికీ సరఫరా చేస్తున్నాం. ఏ పాఠశాలకు ఎంత మేరకు అవసరం, ఎంత వెళ్తోంది అనే అంశాలను పరిశీలించి రికార్డు నిర్వహించడానికి సీఆర్పీని ఇంచార్జిగా నియమించాం. ఇంతవరకు 2,130 మెట్రిక్‌ టన్నుల ఇసుక కోసం ఇండెంట్‌ పెట్టగా 1,659 మెట్రిక్‌ టన్నులను సరఫరా చేశాం.  
– డాక్టర్‌ వేముల అప్పలస్వామినాయుడు, ఏపీసీ, సమగ్రశిక్ష, విజయనగరం   

(చదవండి: అందమైన కలలకు రూపం 'నగరవనం')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement