Schools infrastructure
-
తగని వసతులు లేని చదువులా?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువ రానిది. అయితే ఉద్యమంలో కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో స్వార్థంలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్‌ఏ 2021– 22 నివేదిక మన పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న సంగ తిని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ లెక్కల వల్ల సగటున ఒక పాఠశాలకు కేవలం 7గురు టీచర్స్ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ విషయానికి వస్తే... కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్లైన్లో అరకొర విద్యాభ్యాసాన్ని కొన సాగించారు. అయితే అందులో కూసింత ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతోనే చదువుకున్నారు. అయితే ప్రధానంగా నష్ట పోయింది మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను కొనసాగిస్తున్న అణగారిన గ్రామీణ, పట్టణ పేదల పిల్లలే. వీరికి కంప్యూటర్లు, వైఫైవ్ లేదా ఇంటర్నెట్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్లనే నష్టపోయారు. టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్లో ఆన్లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, ఇతర సరి పడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? ప్రత్యామ్నాయ వసతులు లేకపోతే కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను ఎలా ఉప యోగించుకోగలరు? ఒక పక్క చిన్న చిన్న ఉప ఎన్ని కల్లోనూ పార్టీలు వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ... అవే పార్టీలు అధికారంలో ఉన్నా దేశానికి ఎంతో అవసరమైన విద్యకు బడ్జెట్‌ను తగిన మొత్తంలో కేటాయించక పోవడం విషాదం. ఇప్పటికీ వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవంటే బాలికా విద్య పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలంగాణ’, ‘వెండి తెలంగాణ’ అనే కబుర్లు మాని... తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే స్వరాష్ట్రం కొరకు విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్లు అవుతుంది. అశోక్ ధనావత్, వ్యాసకర్త ఎం.ఏ. డెవలప్మెంట్ స్టడీస్ విద్యార్థి ది హేగ్, నెదర్లాండ్స్ -
శభాష్ పూల్పాండి.. భిక్షాటన చేస్తూ రూ.50 లక్షలు దానం!
వేలూరు(చెన్నై): భిక్షాటన చేయగా.. వచ్చిన సొమ్మును సీఎం సహాయనిధికి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యాచకుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన పూల్పాండి(72) భిక్షగాడిగా జీవిస్తున్నాడు. సోమవారం వేలూరు కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్‌సెల్‌కు వచ్చా డు. తన వద్ద ఉన్న రూ. 10 వేలు నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్ కుమరవేల్ పాండియన్‌కు అందజేశారు. అనంతరం పూల్ పాండి మాట్లాడుతూ.. తాను పష్కరకాలంగా భిక్షాటన చేస్తున్నానని, వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసినట్లు చెప్పాడు. చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు
విజయనగరం పూల్‌బాగ్: జిల్లాలో మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చురుగ్గా సాగుతున్నాయి. అనుకున్న సమయానికే పనులు పూర్తిచేసి పాఠశాల అదనపు తరగతి గదులను వినియోగంలోనికి తెచ్చేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లాలో నాడు–నేడు మొదటి విడతలో రూ.238 కోట్లుతో 1,060 పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిచేయడం జరిగింది. ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో.. రాష్ట్ర పభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రెండో విడిత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాఠశాల తల్లిదండ్రులకు కమిటీలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలతో కూడిన బ్యాంకు అకౌంటులో నాడు–నేడు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేస్తున్నారు.ఈ ఫండ్‌తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాడు–నేడు మొదటి విడతలో పని చేసిన అనుభవం ఉన్న ఎంఈఓ, ఏఈ, హెచ్ఎంలు, పేరెంట్ కమిటీల సభ్యులు, సిఆర్పీలు, ఎమ్మార్సీలో పని చేస్తున్న ఎంఐఎస్, ఎల్డీఏ, మండల లెవెల్ అకౌంటెంట్స్‌తో పాటు మిగిలిన సిబ్బంది, సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్ సిబ్బందితో రెండో విడత పనులు పూర్తిచేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. తొమ్మిది రకాల పనులు.. నాడు–నేడు రెండో విడిత కోసం జిల్లాలో ఉన్న మొత్తం 27 మండలాల్లో 451 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ పనుల కోసం ఏపీఈపీడబ్ల్యూఐడీసీకి 160 పాఠశాలలు, ప్రజారోగ్య డిపార్ట్మెంటుకు 33 పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంట్కు 63 పాఠశాలలు, సమగ్రశిక్షా డిపార్ట్మెంట్కు 195 చొప్పున మొత్తం నాలుగు ఏజెన్సీలకు నిర్మాణ పనుల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండో విడతను జాతీయ నూతన విద్యావిధానం ఆధారంగా చేసుకొని పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం కేవలం కంపోనేంట్ పనులు మాత్రమే కాకుండా అదనపు తరగతి గదుల నిర్మాణ పనులతో కూడిన 9 రకాల పనులు జరుగుతున్నాయి. వీటిల్లో అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయి మరమ్మతులు, ఉన్నత పాఠశాలల్లో 10 కాంపోనెంట్స్ పనులు ఉన్నాయి. నిధుల విడుదల.. 451 పాఠశాలలకు (514 ప్రాజెక్టు పను) రూ.68 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. 576 పాఠశాల అదనపు తరగతి గదుల కోసం రూ.69కోట్ల 12 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 439 పాఠశాలల పేరెంట్స్ కమిటీ ఖాతాలకు రివాల్వింగ్ ఫండ్ జమ అయింది. ఇసుక, సిమెంట్‌కు కొరత లేదు విజయనగరం కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు ఇసుక కోసం ప్రతి మండలంలో 3 స్టాక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేశాం. ఇండెంట్ పెట్టిన పాఠశాలలన్నింటికీ సరఫరా చేస్తున్నాం. ఏ పాఠశాలకు ఎంత మేరకు అవసరం, ఎంత వెళ్తోంది అనే అంశాలను పరిశీలించి రికార్డు నిర్వహించడానికి సీఆర్పీని ఇంచార్జిగా నియమించాం. ఇంతవరకు 2,130 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం ఇండెంట్ పెట్టగా 1,659 మెట్రిక్ టన్నులను సరఫరా చేశాం. – డాక్టర్ వేముల అప్పలస్వామినాయుడు, ఏపీసీ, సమగ్రశిక్ష, విజయనగరం (చదవండి: అందమైన కలలకు రూపం 'నగరవనం') -
‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమేణా అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఫౌండేషన్ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్ మోడల్‌గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్యను అందుబాటులో ఉంచడం అనే అంశంలో రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్, గుజరాత్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. నివేదికలోని ఇతర ముఖ్య అంశాలు ఇలా.. ►ఓవరాల్ కేటగిరీని పరిశీలిస్తే.. చిన్న రాష్ట్రాల్లో కేరళ 67.95 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 58.95 స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో లక్షద్వీప్ 52.69 స్కోరుతో, మిజోరం 51.64 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. ►అభ్యసన ఫలితాలు, విద్యా మౌలిక సదుపాయాల అంశాల స్కోరులో కేరళకు ఇతర రాష్ట్రాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని నివేదిక పేర్కొంది. దీనిపై ఆయా రాష్ట్రాలు శ్రద్ధ పెట్టాలని సూచించింది. ►ఫౌండేషన్ లిటరీసీ, న్యూమరసీ ఇండెక్స్‌లో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే జాతీయ సగటు కన్నా ఎక్కువ స్కోరు సాధించాయి. ► జార్ఖండ్ 45.28, ఒడిశా 45.58, మధ్యప్రదేశ్ 38.69, ఉత్తరప్రదేశ్ 38.46, బీహార్ 36.81 స్కోరుతో పేలవమైన పనితీరుతో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఫౌండేషన్ విద్య స్థితిగతుల్ని విశ్లేషించిన నివేదిక ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక.. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. విద్య మౌలిక సదుపాయాలు, విద్య అందుబాటు, కనీస ఆరోగ్యం, అభ్యాస ఫలితాలు అనే ఐదు విభాగాల్లో, 41 అంశాలతో నేషనల్ అఛీవ్‌మెంటు సర్వే (ఎన్ఏఎస్), యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) డేటాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి రప్పించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతుల్లో అభ్యసనాల మెరుగుకు తీసుకోవలసిన చర్యలను సూచించింది. -
పరిశుభ్రతే లక్ష్యం
ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతులను ప్రారంభించే విషయం ఆలోచిం చాలి. రోజువారీ తరగతుల నిర్వహణపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన సాగించడంపై దృష్టి పెట్టాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలల్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలని సూచించారు. పాఠశాల విద్య, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల కోసం మొబైల్ యాప్‌పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరును ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేసి, పర్యవేక్షించాలని చెప్పారు. హాజరు వివరాలను నేరుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూసుకునే అవకాశం కల్పించాలన్నారు. పిల్లలు స్కూల్‌కు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు స్కూళ్లకు రాని పక్షంలో వలంటీర్ ద్వారా కూడా వారి యోగ క్షేమాలు కనుక్కోవాలని.. ఈ విషయంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ పర్యవేక్షణ చేయాలన్నారు. టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ తయారు చేశామని, టాయిలెట్ల నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా స్థాయి, స్కూలు లేదా కాలేజీ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో హాజరు విషయాలను యాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు టాయిలెట్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం – పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణను అత్యంత ప్రాధాన్యత అంశంగా చూడాలి. టాయిలెట్లు లేక పోవడం, ఉన్న వాటిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్ల చాలా వరకు పిల్లలు స్కూళ్లకు పోలేని పరిస్థితిని గతంలో చూశాం. అందుకే మనం దీన్ని ప్రాధాన్యత కార్యక్రమంగా చేపట్టాం. – ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులను తీసుకు రావడానికి టాయిలెట్ నిధిని ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – రానున్న కాలంలో టాయిలెట్లు నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. టాయిలెట్ల క్లీనింగులో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్టేకర్లకు అవగాహన కల్పించాలి. టాయిలెట్‌ను ఒకసారి వినియోగించిన తర్వాత కచ్చితంగా క్లీన్ చేయాలి. – టాయిలెట్ల నిర్వహణలో అవగాహన కల్పించేందుకు సులభ్ లాంటి సంస్థల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సకాలంలో విద్యా కానుక అందాలి విద్యా కానుకకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. స్కూళ్లు తెరిచే నాటికి తప్పనిసరిగా విద్యా కానుక అందించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన సాగించడంపై దృష్టి పెట్టాలి. – ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. నాడు – నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా నాణ్యమైన బోధనను అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఎవ్వరూ చేయలేని రీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం ‘గోరుముద్ద’ను అమలు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో టాయిలెట్ల నిర్వహణ చాలా ముఖ్యం. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. శానిటరీ, ప్లంబింగ్కు సంబంధించి ఎప్పుడు మరమ్మతులు వచ్చినా, వాటిని వెంటనే బాగు చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటన్నింటిపై ఎస్ఓపీలను తయారు చేయాలి. -
నాడు-నేడు: స్కూళ్లకు రంగుల రెక్కలు
ప్రభుత్వ స్కూళ్లకు ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. కావాల్సింది ప్రభుత్వం వెన్నుదన్ను. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణ కార్యక్రమం ‘నాడు–నేడు’ ఉజ్వలంగా సాగుతోంది. స్కూళ్లు కళకళలాడుతున్నాయి. నవ ఉత్సాహాన్ని నింపుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో తనూ భాగమైంది మ్యూరల్ ఆర్టిస్ట్, తెలుగమ్మాయి స్వాతి. బహుశా దేశంలో దక్షిణాదిన తొలి మహిళా మ్యూరల్ ఆర్టిస్ట్ ఆమె. తూర్పు గోదావరి జిల్లా స్కూలు గోడల మీద ఆమె బొమ్మలు విద్యార్థులకు పురోగామి సందేశాన్ని అందిస్తున్నాయి. ‘మేము కేవలం ప్రభుత్వ స్కూళ్ల కోసమే పని చేస్తాం. ప్రయివేట్ స్కూళ్ల వాళ్లు ఎంత అడిగినా చేయలేదు. నేను, నా భర్త విజయ్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నాం. నిర్లక్ష్యం చేయకపోతే వాటి అంత మంచి స్కూళ్లు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల కోసం అద్భుతంగా పని చేస్తోంది. మేము ఆ పనిలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు స్వాతి. ఆమె దక్షణ భారతాన తొలి మహిళా మ్యూరల్ (కుడ్యచిత్రం) ఆర్టిస్ట్ కావచ్చు. ఒక తెలుగమ్మాయి ఈ రంగంలో పేరు గడించడం కచ్చితంగా ప్రశంసించాల్సిన సంగతి. స్వాతి, ఆమె భర్త విజయ్ ఇద్దరూ చిత్రకారులే. స్వాతి తన భర్తతో కలిసి ప్రస్తుతం తూ.గో.జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల ‘నాడు–నేడు’ కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. స్కూళ్ల ఆధునికీకరణలో భాగంగా తన వంతుగా బొమ్మలను ఆ స్కూళ్లకు జత చేస్తోంది. తలెత్తి చూడాల్సినంత ఎత్తులో ఉండే ఆ బొమ్మలు పిల్లలను ఉత్సాహపరుస్తున్నాయి. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పిల్లలను బడికి వచ్చి చదువుకోమంటున్నాయి. స్ఫూర్తి నింపుతున్నాయి. సందేశానికి గోడ కావాలి స్వాతిది ఖమ్మం. ఆమె భర్త విజయ్‌ది హైదరాబాద్. ఇద్దరూ హైదరాబాద్ జె.ఎన్.టి.యులో ఫైన్ ఆర్ట్స్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. స్వాతి ‘మాన్యువల్ పెయింటింగ్’ చదివితే విజయ్ ‘అప్లైడ్ ఆర్ట్స్’ చదివారు. అయితే వారిద్దరూ కళ ఉన్నది కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, దానితో సామాజిక పరివర్తన, సందేశం ఇవ్వాలనే తలంపు ఉన్నవారు. జె.ఎన్.టి.యులో చదువుతుండగా సోషల్ మెసేజ్ ఉన్న పెయింటిగ్స్ వేసి అక్కడే ప్రదర్శనకు పెట్టేవారు. కాని అక్కడికి వచ్చే వారు కళారాధకులే తప్ప ప్రత్యేకంగా సామాజిక సందేశాలను ఇష్టపడే వ్యక్తులు కాదు. అంటే కళ దగ్గరకు మనుషులు రాకపోతే మనుషుల దగ్గరకే కళ వెళ్లాలి అని స్వాతి, విజయ్ అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. భావోద్వేగాలు శృతి తప్పకుండా ఉద్యమం శాంతియుత మార్గంలో జరగాలని సందేశం ఇస్తూ ఒక గోడమీద గాంధీజీ పూలుజల్లుతున్న బొమ్మను ఇద్దరూ కలిసి గీశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతి, విజయ్‌లకు తమ కార్యక్షేత్రం అర్థమైంది. రాజమండ్రి పాఠశాల ఫ్రాన్స్‌లో చదువుకుని ఎం.ఎఫ్.ఏ అయ్యాక స్వాతి విజయ్‌తో కలిసి ‘స్వాతివిజయ్’గా ఒకే ఆర్టిస్ట్ పేరుగా మారారు. 2013లో ఫ్రాన్స్ ఎంబసీ ఇచ్చే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ కోసం అప్లై చేశారు. దేశవ్యాప్తంగా 174 మంది పోటీ పడితే స్వాతివిజయ్కే సీటు దక్కింది. ఇద్దరూ పారిస్ వెళ్లి ఆరునెలల పాటు అక్కడ మ్యూరల్స్ను స్టడీ చేశారు. సాధన చేశారు. 2014లో తిరిగి వచ్చి తమ కుడ్యచిత్ర కళను సమాజానికి తోడ్పడేలా ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు. తొలి స్కూలు నుంచి ఏ.పి. స్కూళ్ల వరకు స్వాతి, విజయ్ ఇద్దరూ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నవారే. వాటి ఆదరణ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. 2015లో మొదటిసారి తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలోని రంగసాయిపేట గ్రామంలో ఒక ప్రభుత్వబడిని తీసుకొని మ్యూరల్ వేశారు. ఆ స్కూల్లో ఒకటి నుంచి 5 క్లాసులు ఉన్నా కేవలం 15 మంది విద్యార్థులే ఉండేవారు. స్వాతి, విజయ్‌లో ఆ స్కూల్ గోడ మీద ఆకర్షణీయంగా ‘పుస్తకాల జల్లులో తడుస్తున్న పిల్లల’ భారీ బొమ్మ గీశాక (ఆ బొమ్మను వేసవి సెలవుల్లో గీశారు) స్కూల్ తెరిచేసరికి ఊళ్లో ఒక్క విద్యార్థీ మిగల్లేదు. అందరూ స్కూల్‌కు వచ్చి ఉత్సాహం చూపిన వారే. స్ట్రెంగ్త్ ఒక్కసారిగా 29కి పెరిగింది. ‘ఆ చిన్న విజయం మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అన్నారు స్వాతి. ఆ తర్వాత స్వాతి, విజయ్‌లు రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి, మత సామరస్యం కోసం మ్యూరల్స్ వేశారు. వీరి బొమ్మలు మెల్లగా ప్రచారం పొందాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. స్కూళ్ల ఆధునికీకరణలో భాగంగా వీరి బొమ్మలు జత అయితే బాగుంటుందని తూ.గో.జిల్లా చింతూరు ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆకుల రమణకు అనిపించింది. అంతే. ఒక అందమైన పని మొదలైంది. పని జరుగుతున్న రాజమండ్రి పాఠశాల దగ్గర స్వాతి ఆ స్కూళ్ల పిల్లలే మోడల్స్ ‘మేము ఏ స్కూల్‌కు పని చేస్తే ఆ స్కూల్ పిల్లలనే మోడల్స్‌గా తీసుకుంటాం. నేను ఎక్కువగా గర్ల్ స్టూడెంట్స్‌నే ప్రిఫర్ చేస్తాను. బొమ్మ వారిని ఇన్‌స్పయిర్ చేసేలా నేను, విజయ్ మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటాం. కాని మ్యూరల్స్‌లో బొమ్మను స్కేల్ చేయడం కొంచెం కష్టం. పేపర్ మీద బొమ్మ వేయడం వేరు. 30 అడుగుల గోడ మీద బొమ్మ వేయడం వేరు. అంత ఎత్తుకు ఎక్కి బొమ్మ వేస్తున్నప్పుడు పూర్తి బొమ్మ ఎలా వస్తున్నదో తెలియదు. మాటిమాటికి కిందకు దిగి చూసుకుంటూ ఉండాలి. అయినా ఆ బొమ్మలు బాగుండేలా చూసుకుంటాం. తూ.గో.జిల్లాలో నాడు–నేడు కార్యక్రమమే కాదు అందులోని మా బొమ్మలు కూడా ప్రశంసలు సొందుతున్నాయి. మారేడుమిల్లి, రాజమండ్రి, కాకినాడలలో బొమ్మలు కొనసాగిస్తున్నాం. మాకు ఇష్టమైన ప్రభుత్వ స్కూళ్ల పున:ప్రతిష్టలో మేము సంతోషం గా పాలుపంచుకుంటాం’ అన్నారు స్వాతి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, హైదరాబాద్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బడి.. సమస్యల ఒడి
రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఎక్కువ శాతం పాఠశాలల్లో తాగునీటి సమస్యతో విద్యార్థులు తంటాలు పడుతున్నారు. బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల సదుపాయం గతంలో కంటే కొంత మెరుగైనా.. ఇంకా పూర్తిస్థాయిలో సమకూరకపోవడంతో బాలికలకు ఇబ్బందులు తప్పట్లేదు. మరోవైపు విద్యా బోధనలో అవసరమైన లైబ్రరీలు, కంప్యూటర్లు లేవు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, మానసిక ఉల్లాసానికి దోహదపడే ఆట స్థలాలు లేక తరగతి గదికే విద్యార్థులు పరిమితం కావాల్సి వస్తోంది. పాఠశాలల్లో నెలకొన్న ఇలాంటి అనేక సమస్యలను ఇటీవల విడుదలైన అసర్ సర్వే బయటపెట్టింది. – సాక్షి, హైదరాబాద్ ఆటలకు తంటాలే.. పలు పాఠశాలల్లో ఆట స్థలాల్లేక, ఆడించే వారు (పీఈటీ) లేక ఎలిమెంటరీ విద్యార్థులకు ఆటలే లేకుండా పోయాయి. 23 శాతం పాఠశాలల్లో ఆట స్థలాలు విద్యార్థులకు అందుబాటులో లేవు. 39.9 శాతం పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ) అందుబాటులో లేరు.ఆట స్థలాల పరిస్థితీ అలాగే ఉంది. 2010లో రాష్ట్రంలోని 83.9 పాఠశాలల్లో ఆట స్థలాలు ఉంటే ఏటా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2014లో ఆట స్థలాలు 76.7 శాతం పాఠశాలకు పరిమితం కాగా, 2016లో 78 శాతానికి, 2018లో 77 శాతం పాఠశాలలకు పరిమితమయ్యాయి. మిగతా 23 శాతం పాఠశాలల్లో 6.2 శాతం స్కూళ్లకు ఆట స్థలాలే లేకపోగా, 16.7 శాతం పాఠశాలలకు దూరంగా ఆట స్థలాలు ఉన్నాయి. టాయిలెట్ల పరిస్థితి మెరుగైనా.. రాష్ట్రంలోని పాఠశాలల్లో టాయిలెట్ల సదుపాయం ఐదేళ్ల కిందటితో పోలిస్తే కొంత మెరుగైంది. అయితే రెండేళ్ల కిందటితో పోలిస్తే మాత్రం టాయిలెట్లు లేని పాఠశాలల సంఖ్య పెరిగింది. 2010లో టాయిలెట్లు లేని పాఠశాలలు 23.4% ఉంటే, 2014 నాటికి 13 శాతానికి తగ్గింది. 2016 నాటికి వాటి సంఖ్య మరింతగా తగ్గి 1.9 శాతానికి చేరింది. కానీ 2018 వచ్చేసరికి టాయిలెట్లు లేని పాఠశాలల సంఖ్య 3.5 శాతానికి పెరిగింది. బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల విషయంలో పరిస్థితి మాత్రం రెండేళ్ల కిందటితో పోలిస్తే సగానికి సగం మెరుగైంది. 2010లో 53.1 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేకపోగా, 2014 నాటికి వాటి సంఖ్య 28.4 శాతానికి తగ్గింది. 2016కి టాయిలెట్లు లేని పాఠశాలల సంఖ్య 15.1% ఉండగా 2018 నాటికి 8.7 శాతానికి చేరుకుంది. ఈ సంవత్సరంలో మరో 8.7 శాతం టాయిలెట్లకు తాళాలు వేసి ఉన్నాయి. మరో 10.7 శాతం వినియోగించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. మొత్తం 71.9 శాతం పాఠశాలల్లో బాలికల ప్రత్యేక టాయిలెట్లు వినియోగంలో ఉన్నాయి. అసర్ నివేదికలోని మరికొన్ని ప్రధానాంశాలు.. - 41 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 42.8% పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటికి తంటాలు తప్పట్లేదు. - 55.7% పాఠశాలల్లోనే లైబ్రరీలు ఉండి, వాటిని వినియోగిస్తున్నారు. 22.3 శాతం పాఠశాలల్లో లైబ్రరీలు లేకపోగా మరో 22% పాఠశాలల్లో లైబ్రరీలు ఉన్నా వినియోగంలో లేవు. లైబ్రరీల్లో ఉన్న కొన్ని పనికిరాని పుస్తకాలు కావడం, వాటిని ఉపయోగించుకునే స్థితి లేకపోవడంతో ఉన్నా లేనట్లే వాటి పరిస్థితి తయారైంది. - రాష్ట్రంలోని 89.5% పాఠశాలల్లో కంప్యూటర్లు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 3.1% పాఠశాలల్లోనే కంప్యూటర్లు పని చేస్తుండగా, మరో 7.4% పాఠశాలల్లో అవి వినియోగంలోనే లేవు. -
ఆర్వీఎం.. అస్తవ్యస్తం
ఖమ్మం, న్యూస్‌లైన్ : పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, వెనకబడిన విద్యార్థులు, బడి మానేసిన, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన వంటి అంశాల్లో కీలక భూమిక పోషించే రాజీవ్ విద్యామిషన్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. వందల కోట్ల రూపాయల నిధులు వచ్చే ఈ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల మధ్య పంపకాల గొడవను పరిష్కరించే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య గ్రూపు తగాదాలతో అయిన వారికి అందలం.. కాని వారిపై వేటు వేసే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కోట్లాది రూపాయల నిధుల వినియోగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకం కావడం, అన్నింటా వారికే ప్రాధాన్యత ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. జీసీడీవో సరెండర్‌పై అనుమానాలు... బాలికల విద్యా అభివృద్ధి అధికారిణి సంధ్యశ్రీని తొలగించి, ఆమె స్థానంలో మరొకరిని నియమించడం ఆర్వీఎంలో దుమారం రేపుతోంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) నిర్వహణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయడం లేదనే నెపంతో జీసీడీవో సంధ్యశ్రీని, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను విద్యాశాఖకు సరెండర్ చేశారు. అయితే కొత్తగా జీసీడీవో, ఇతర సెక్టోరియల్ అధికారి నియామకానికి సంబంధిత ఉద్యోగుల సీనియారిటీ, సర్వీసు, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ అదేమీ చేయకుండా ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన శివకుమారికి జీసీడీవో బాధ్యతలు అప్పగించడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆర్వీఎం పీవో శ్రీనివాస్‌కు, జీసీడీవో సంధ్యశ్రీకి మధ్య సమన్వయం లేదని, అందుకే కావాలనే పీవో జీసీడీవోను సరెండర్ చేసి కొత్తవారిని నియమించారని ప్రచారం జరుగుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత... ఏటా వందల కోట్ల రూపాయల నిధులు వచ్చే ఆర్వీఎంలో కీలకమైన అకౌంట్ సెక్షన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్వీఎం పీవోకు, ఆశాఖ ఫైనాన్స్ అధికారికి మధ్య సమన్వయం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కావాలనే పీవో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిపై వేటు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖలో అక్రమాలు జరిగాయని భావించిన గత కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆర్వీఎం నిధుల వినియోగంపై ప్రత్యేక బృందంతో ఆడిట్ చేయాలని అప్పటి పీవో వెంకటనర్సమ్మను ఆదేశించారు. కానీ ఆ తర్వాత వెంకటనర్సమ్మ, సిద్ధార్థజైన్ ఇద్దరూ జిల్లా నుంచి బదిలీ కావడంతో ఆ శాఖలో ఉన్న అధికారులతోనే ఆడిట్ చేయించారని, దీంతో అంతా అనుకూలంగానే బిల్లులు సృష్టించి ఆడిట్‌ను మమ అనిపించారనే విమర్శలు వస్తున్నాయి. ఆడిట్ సెక్షన్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా.. వారిని కాదని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన వారి పనులకు బదులుగా బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీల పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అవకతవకలు జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆర్వీఎంపై ప్రత్యేక దృష్టి సారించి అస్తవ్యస్తంగా ఉన్న ఈ శాఖను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.