మారేడుమిల్లి (తూ.గో. జిల్లా) ప్రభుత్వ పాఠశాల , చింటూరు (తూ.గో. జిల్లా) ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ స్కూళ్లకు ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. కావాల్సింది ప్రభుత్వం వెన్నుదన్ను. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణ కార్యక్రమం ‘నాడు–నేడు’ ఉజ్వలంగా సాగుతోంది. స్కూళ్లు కళకళలాడుతున్నాయి. నవ ఉత్సాహాన్ని నింపుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో తనూ భాగమైంది మ్యూరల్ ఆర్టిస్ట్, తెలుగమ్మాయి స్వాతి. బహుశా దేశంలో దక్షిణాదిన తొలి మహిళా మ్యూరల్ ఆర్టిస్ట్ ఆమె. తూర్పు గోదావరి జిల్లా స్కూలు గోడల మీద ఆమె బొమ్మలు విద్యార్థులకు పురోగామి సందేశాన్ని అందిస్తున్నాయి.
‘మేము కేవలం ప్రభుత్వ స్కూళ్ల కోసమే పని చేస్తాం. ప్రయివేట్ స్కూళ్ల వాళ్లు ఎంత అడిగినా చేయలేదు. నేను, నా భర్త విజయ్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నాం. నిర్లక్ష్యం చేయకపోతే వాటి అంత మంచి స్కూళ్లు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల కోసం అద్భుతంగా పని చేస్తోంది. మేము ఆ పనిలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు స్వాతి. ఆమె దక్షణ భారతాన తొలి మహిళా మ్యూరల్ (కుడ్యచిత్రం) ఆర్టిస్ట్ కావచ్చు. ఒక తెలుగమ్మాయి ఈ రంగంలో పేరు గడించడం కచ్చితంగా ప్రశంసించాల్సిన సంగతి. స్వాతి, ఆమె భర్త విజయ్ ఇద్దరూ చిత్రకారులే. స్వాతి తన భర్తతో కలిసి ప్రస్తుతం తూ.గో.జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల ‘నాడు–నేడు’ కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. స్కూళ్ల ఆధునికీకరణలో భాగంగా తన వంతుగా బొమ్మలను ఆ స్కూళ్లకు జత చేస్తోంది. తలెత్తి చూడాల్సినంత ఎత్తులో ఉండే ఆ బొమ్మలు పిల్లలను ఉత్సాహపరుస్తున్నాయి. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పిల్లలను బడికి వచ్చి చదువుకోమంటున్నాయి. స్ఫూర్తి నింపుతున్నాయి.
సందేశానికి గోడ కావాలి
స్వాతిది ఖమ్మం. ఆమె భర్త విజయ్‌ది హైదరాబాద్. ఇద్దరూ హైదరాబాద్ జె.ఎన్.టి.యులో ఫైన్ ఆర్ట్స్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. స్వాతి ‘మాన్యువల్ పెయింటింగ్’ చదివితే విజయ్ ‘అప్లైడ్ ఆర్ట్స్’ చదివారు. అయితే వారిద్దరూ కళ ఉన్నది కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, దానితో సామాజిక పరివర్తన, సందేశం ఇవ్వాలనే తలంపు ఉన్నవారు. జె.ఎన్.టి.యులో చదువుతుండగా సోషల్ మెసేజ్ ఉన్న పెయింటిగ్స్ వేసి అక్కడే ప్రదర్శనకు పెట్టేవారు. కాని అక్కడికి వచ్చే వారు కళారాధకులే తప్ప ప్రత్యేకంగా సామాజిక సందేశాలను ఇష్టపడే వ్యక్తులు కాదు. అంటే కళ దగ్గరకు మనుషులు రాకపోతే మనుషుల దగ్గరకే కళ వెళ్లాలి అని స్వాతి, విజయ్ అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. భావోద్వేగాలు శృతి తప్పకుండా ఉద్యమం శాంతియుత మార్గంలో జరగాలని సందేశం ఇస్తూ ఒక గోడమీద గాంధీజీ పూలుజల్లుతున్న బొమ్మను ఇద్దరూ కలిసి గీశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతి, విజయ్‌లకు తమ కార్యక్షేత్రం అర్థమైంది.
రాజమండ్రి పాఠశాల
ఫ్రాన్స్‌లో చదువుకుని
ఎం.ఎఫ్.ఏ అయ్యాక స్వాతి విజయ్‌తో కలిసి ‘స్వాతివిజయ్’గా ఒకే ఆర్టిస్ట్ పేరుగా మారారు. 2013లో ఫ్రాన్స్ ఎంబసీ ఇచ్చే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కోసం అప్లై చేశారు. దేశవ్యాప్తంగా 174 మంది పోటీ పడితే స్వాతివిజయ్‌కే సీటు దక్కింది. ఇద్దరూ పారిస్ వెళ్లి ఆరునెలల పాటు అక్కడ మ్యూరల్స్‌ను స్టడీ చేశారు. సాధన చేశారు. 2014లో తిరిగి వచ్చి తమ కుడ్యచిత్ర కళను సమాజానికి తోడ్పడేలా ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు.
తొలి స్కూలు నుంచి ఏ.పి. స్కూళ్ల వరకు
స్వాతి, విజయ్ ఇద్దరూ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నవారే. వాటి ఆదరణ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. 2015లో మొదటిసారి తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలోని రంగసాయిపేట గ్రామంలో ఒక ప్రభుత్వబడిని తీసుకొని మ్యూరల్ వేశారు. ఆ స్కూల్లో ఒకటి నుంచి 5 క్లాసులు ఉన్నా కేవలం 15 మంది విద్యార్థులే ఉండేవారు. స్వాతి, విజయ్‌లో ఆ స్కూల్ గోడ మీద ఆకర్షణీయంగా ‘పుస్తకాల జల్లులో తడుస్తున్న పిల్లల’ భారీ బొమ్మ గీశాక (ఆ బొమ్మను వేసవి సెలవుల్లో గీశారు) స్కూల్ తెరిచేసరికి ఊళ్లో ఒక్క విద్యార్థీ మిగల్లేదు. అందరూ స్కూల్‌కు వచ్చి ఉత్సాహం చూపిన వారే. స్ట్రెంగ్త్ ఒక్కసారిగా 29కి పెరిగింది. ‘ఆ చిన్న విజయం మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అన్నారు స్వాతి. ఆ తర్వాత స్వాతి, విజయ్‌లు రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి, మత సామరస్యం కోసం మ్యూరల్స్ వేశారు. వీరి బొమ్మలు మెల్లగా ప్రచారం పొందాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. స్కూళ్ల ఆధునికీకరణలో భాగంగా వీరి బొమ్మలు జత అయితే బాగుంటుందని తూ.గో.జిల్లా చింతూరు ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆకుల రమణకు అనిపించింది. అంతే. ఒక అందమైన పని మొదలైంది.
పని జరుగుతున్న రాజమండ్రి పాఠశాల దగ్గర స్వాతి
ఆ స్కూళ్ల పిల్లలే మోడల్స్
‘మేము ఏ స్కూల్‌కు పని చేస్తే ఆ స్కూల్ పిల్లలనే మోడల్స్‌గా తీసుకుంటాం. నేను ఎక్కువగా గర్ల్ స్టూడెంట్స్‌నే ప్రిఫర్ చేస్తాను. బొమ్మ వారిని ఇన్‌స్పయిర్ చేసేలా నేను, విజయ్ మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటాం. కాని మ్యూరల్స్‌లో బొమ్మను స్కేల్ చేయడం కొంచెం కష్టం. పేపర్ మీద బొమ్మ వేయడం వేరు. 30 అడుగుల గోడ మీద బొమ్మ వేయడం వేరు. అంత ఎత్తుకు ఎక్కి బొమ్మ వేస్తున్నప్పుడు పూర్తి బొమ్మ ఎలా వస్తున్నదో తెలియదు. మాటిమాటికి కిందకు దిగి చూసుకుంటూ ఉండాలి. అయినా ఆ బొమ్మలు బాగుండేలా చూసుకుంటాం. తూ.గో.జిల్లాలో నాడు–నేడు కార్యక్రమమే కాదు అందులోని మా బొమ్మలు కూడా ప్రశంసలు సొందుతున్నాయి. మారేడుమిల్లి, రాజమండ్రి, కాకినాడలలో బొమ్మలు కొనసాగిస్తున్నాం. మాకు ఇష్టమైన ప్రభుత్వ స్కూళ్ల పున:ప్రతిష్టలో మేము సంతోషం గా పాలుపంచుకుంటాం’ అన్నారు స్వాతి.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment