‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్‌ | State Of Foundational Literacy And Numeracy In India Was Released By Dr Bibek Debroy | Sakshi
Sakshi News home page

‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్‌

Published Sat, Dec 18 2021 4:18 AM | Last Updated on Sat, Dec 18 2021 2:29 PM

State Of Foundational Literacy And Numeracy In India Was Released By Dr Bibek Debroy - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమేణా అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం..
 
ఫౌండేషన్‌ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్‌ మోడల్‌గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి.

చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్యను అందుబాటులో ఉంచడం అనే అంశంలో రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్, గుజరాత్, బీహార్‌ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్‌ 25.67, గుజరాత్‌ 22.28, బీహార్‌ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. 

నివేదికలోని ఇతర ముఖ్య అంశాలు ఇలా..
ఓవరాల్‌ కేటగిరీని పరిశీలిస్తే.. చిన్న రాష్ట్రాల్లో కేరళ 67.95 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ 58.95 స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో లక్షద్వీప్‌ 52.69 స్కోరుతో, మిజోరం 51.64 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. 
అభ్యసన ఫలితాలు, విద్యా మౌలిక సదుపాయాల అంశాల స్కోరులో కేరళకు ఇతర రాష్ట్రాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని నివేదిక పేర్కొంది. దీనిపై ఆయా రాష్ట్రాలు శ్రద్ధ పెట్టాలని సూచించింది. 
ఫౌండేషన్‌ లిటరీసీ, న్యూమరసీ ఇండెక్స్‌లో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే జాతీయ సగటు కన్నా ఎక్కువ స్కోరు సాధించాయి. 
జార్ఖండ్‌ 45.28, ఒడిశా 45.58, మధ్యప్రదేశ్‌ 38.69, ఉత్తరప్రదేశ్‌ 38.46, బీహార్‌ 36.81 స్కోరుతో పేలవమైన పనితీరుతో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 

ఫౌండేషన్‌ విద్య స్థితిగతుల్ని విశ్లేషించిన నివేదిక
ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన నివేదిక.. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది.

ఫౌండేషన్‌ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. విద్య మౌలిక సదుపాయాలు, విద్య అందుబాటు, కనీస ఆరోగ్యం, అభ్యాస ఫలితాలు అనే ఐదు విభాగాల్లో, 41 అంశాలతో నేషనల్‌ అఛీవ్‌మెంటు సర్వే (ఎన్‌ఏఎస్‌), యాన్యువల్‌ సర్వే ఆన్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (అసర్‌) డేటాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి రప్పించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతుల్లో అభ్యసనాల మెరుగుకు తీసుకోవలసిన చర్యలను సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement