లోకేష్ గారూ షాదీమహల్‌ను బాగుపర్చండి!
సౌకర్యాలు కల్పించకుండానేప్రారంభించిన నాటి ఎమ్మెల్యే శంకర్
వినియోగంలోకి తేవాలని ముస్లింల డిమాండ్
బి.కొత్తకోట: యువగళం పాదయాత్ర సందర్భంగా 2023 మార్చి 15న బి.కొత్తకోట మీదుగా పెద్దతిప్పసముద్రం మండలంలోకి వెళ్తూ..ఆలేరువాగు ఒడ్డున నిర్మించిన బి.కొత్తకోట షాదీమహాల్ వద్ద ఆగిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. దీనిని టీడీపీ ప్రభుత్వంలో రూ.50 లక్షలతో నిర్మించగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాళంతో పాటు బ్లూ, ఆకుపచ్చ రంగులు వేయించిందని ట్విట్టర్‌లో పోస్టు పెట్టి ఆరోపణలు చేశారు. తాళం వేసిన పాపం నూటికి నూరుపాళ్లు టీడీపీ ప్రభుత్వానిదే. దీనిని ఎప్పుడు, ఎవరి హయాంలో నిర్మించారో స్థానికులకు తెలియంది కాదు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేసిన లోకేష్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి హయాంలో నిర్మించి నిరుపయోగం చేసిన షాదీమహల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.
సౌకర్యాలు విస్మరించి విమర్శలు
షాదీమహల్‌లో వివాహాలు, ఇతరా శుభకార్యాలు జరుపుకునేందుకు అవసరమైన సౌకర్యాలను గత టీడీపీ ప్రభుత్వం కల్పించలేదు. ప్రధానంగా తాగునీటి వసతి లేదు. బోరువేయించాలని టీడీపీ ముస్లిం నాయకులు ప్రారంభోత్సవ సభలోనే విన్నవించినా పట్టించుకోలేదు. రూ.50లక్షలతో నిర్మించిన భవనానికి కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు. భవనం నిర్మించి శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకున్నారు. 2018 అగస్టు 16న ప్రారంభించిన రోజు షాదీమహల్ తెరచుకుంది. అయితే మరుసటిరోజు నుంచే దీనికి తాళం వేశారు.
అప్పుడు వేసిన తాళమే ఇప్పటికీ అలాగే ఉంది. షాదీమహల్ వ్యవహారంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఏనాడూ జోక్యం చేసుకోలేదు. వైఎస్సార్‌సీపీ నాయకుల జోక్యంకాని, ప్రమేయం కానీ లేదు. ముస్లింల కోసం షాదీమహల్ నిర్మించినా 2019లో టీడీపీ అధికారం కోల్పోయేదాకా పట్టించుకోలేదు. ఈ తప్పులన్నీ గత టీడీపీ ప్రభుత్వంలో జరిగి తాళం పడితే దానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లోకేష్ ఆరోపణలు చేశారు. పాదయాత్రలో షాదీమహల్ వద్ద సెల్ఫీ తీసుకుని తాళం వేశారని ఆరోపించిన లోకేష్ దీనిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment