
జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
రాజమండ్రి(తూ.గో): రాజమండ్రి ఆర్ట్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు హాజరయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రి తో పాటు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వేణుగోపాల కృష్ణ, అవంతి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించారు.
దీనిలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత ఇనుమడింప జేస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర సాంస్కృతిక శాఖ అనేక రకాల ఉత్సవాలను నిర్వహిస్తోందని, దేశ ప్రజల్లో జాతీయతను పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించిన నేతల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరని కొనియాడారు.
కాగా, దేశ మహోన్నత సంస్కృతి, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా జరగనున్న ఈ వేడుకల్లో తేట తెలుగు సంస్కృతి, కళల కనువిందు, పలు రకాల ప్రసిద్ధ వంటకాల ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి వైభవం, విశిష్టతను చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.