అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Navahnika Salakatla Srivari Brahmotsavam in Tirumala | Sakshi
Sakshi News home page

అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Published Sun, Aug 25 2024 9:59 AM | Last Updated on Sun, Aug 25 2024 9:59 AM

Navahnika Salakatla Srivari Brahmotsavam in Tirumala

    భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు 
     టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడి  

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 4 నుంచి12 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈఓ  శ్యామలరావు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందన్నారు. అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని, అదేరోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు.   

ఈఓ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు.. 
👉 ఉ.8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 వరకు వాహన సేవలు జరుగుతాయి. 
గరుడ వాహన సేవ సా.6.30 గంటలకు ప్రారంభమవుతుంది. 
👉 భక్తుల రద్దీ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. 
👉 అక్టోబరు 4 నుంచి 12 వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదు. 

తిరుమలలో నీటి లభ్యతపై అపోహలొద్దు.. 
ఇదిలా ఉంటే.. శనివారం నాటికి తిరుమలలో కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యాంలలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉందని.. నీటి లభ్యతపై అపోహలొద్దని ఈఓ శ్యామలరావు కోరారు. తిరుపతిలోని కల్యాణి డ్యాంలో 5,608 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉన్నందున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు నీటి అవసరాలతో సహా 130 రోజుల వరకు ఈ నీరు సరిపోతుందని ఆయన చెప్పారు. 

లాగే, కల్యాణి డ్యాం నుండి 11 లక్షల గ్యాలన్ల నీటిని అదనంగా సరఫరా చేయడానికి తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ అంగీకరించారని.. తద్వారా అదనంగా మరో నెలరోజులు తిరుమల నీటి అవసరాలు తీరుతాయని ఆయన చెప్పారు. అంతేకాక.. కైలాసగిరి రిజర్వాయర్‌ నుండి మరో 10 ఎంఎల్డీ నీరు తిరుపతికి సరఫరా కానుందని ఆయన వివరించారు. ఇక  తిరుపతికి నీటి సరఫరాను పెంచడానికి అదనపు పైప్‌లైన్‌ నిమిత్తం టీటీడీ రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు కూడా శ్యామలరావు 
వెల్లడించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement