Navratri Celebrations From 7 to 15 October At Vijayawada - Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవం.. మూడు వేల మందితో భద్రత పటిష్టం

Published Tue, Oct 5 2021 10:13 AM | Last Updated on Tue, Oct 5 2021 12:41 PM

Navratri Celebrations From 7 to 15 October At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పోలీస్‌ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రోజూ పది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవదాయ, రెవెన్యూ, కార్పొరేషన్, నీటిపారుదల శాఖ, దేవస్థాన అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేస్తున్నామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 10 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు దర్శన అనుమతి లేదని స్పష్టం చేశారు. భవానీ మాలధారణతో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఘాట్‌లలో స్నానాలకు అనుమతి లేదని, జల్లు స్నానాలను సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేశామని వివరించారు.  

క్యూలైన్ల వద్ద భద్రతా ఏర్పాట్లు.. 
కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే భక్తుల క్యూలైన్‌.. ఘాట్‌ రోడ్డు మీదుగా అమ్మవారి గుడికి చేరుకుంటుందన్నారు.  
అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు అర్జున వీధి మీదుగా కెనాల్‌ రోడ్డుకు చేరుకోవాలన్నారు.  
కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్‌వాటర్‌ వర్క్స్‌ ఎదురుగా గుడికి ఆనుకుని టోల్‌ గేట్‌ వరకు క్యూలైన్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  
నవరాత్రి విధుల్లో మూడు వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు సీపీ తెలిపారు.  

నిఘా పక్కా.. 
చోరీలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని చెప్పారు. సమస్యలు ఎదురైతే 100 లేదా 7328909090 నంబర్‌లకు ఫోన్‌ చేసి సహాయం పొందాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం కమాండ్‌ కంట్రోల్‌రూం, వన్‌టౌన్, భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లతో పాటు రైల్వే, బస్‌ స్టేషన్, పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ ప్రాంతాల్లో పోలీస్‌ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోడల్‌ గెస్ట్‌ హౌస్, పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద 24 గంటలు పని చేసేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామన్నారు.
 
వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలు.. 
విధుల్లో ఉండే పోలీస్‌ సిబ్బంది వాహనాలను మోడల్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక పార్క్‌ చేసుకోవాలన్నారు. భక్తులు కార్లను పద్మావతి ఘాట్‌ గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్, రాజీవ్‌ గాంధీ కూరగాయల మార్కెట్, టీటీడీ ఖాళీ ప్రదేశం, పున్నమీ ఘాట్, భవానీ ఘాట్‌ల వద్ద, ద్విచక్ర వాహనాలను ఇరిగేషన్‌ పార్క్, గద్ద బొమ్మ(కేఆర్‌ మార్కెట్‌), లోటస్‌ అపార్ట్‌మెంట్‌ల వద్ద పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ వైపు నుంచి భక్తులతో వచ్చే బస్సులు భవానీఘాట్, పున్నమీ ఘాట్‌లో, విశాఖపట్నం గుంటూరు వైపు నుంచి బస్సులు పున్నమీ ఘాట్‌లో పార్కింగ్‌ చేసుకోవాలని కోరారు.  

మూలా నక్షత్రం నాడు.. 
ఈ నెల 11న మూలా నక్షత్రం రోజు రాత్రి 11 గంటల నుంచి 12 రాత్రి 11 గంటల వరకు కేఆర్‌ మార్కెట్‌ వైపు వెళ్లే బస్సులను బస్టాండ్, పీసీఆర్, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల రోడ్, సితార, గొల్లపూడి జంక్షన్, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్, సీతమ్మవారి పాదాలు, పీసీఆర్‌ విగ్రహం, ఘాట్‌ రోడ్డు, కుమ్మరిపాలేనికి ఇరువైపులా వాహనాలను అనుమతించబోమని సీపీ తెలిపారు. 

వాహనాల మళ్లింపు ఇలా.. 
ఉత్సవాల సమయంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు.  
విజయవాడ,ఇబ్రహీంపట్నం మధ్య రాకపోకలు సాగించే వాహనాలను సీతమ్మవారి పాదాలు, పీఎస్‌ఆర్‌ విగ్రహం, ఘాట్‌ రోడ్, స్వాతి జంక్షన్‌ మార్గాల్లో అనుమతించమన్నారు. ఈ వాహనాలు కనకదుర్గా ఫ్లై ఓవర్‌ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు.  
కుమ్మరిపాలెం నుంచి అమ్మవారి గుడి వైపు వచ్చే వాహనాలు గుప్తాసెంటర్, చెరువు సెంటర్, సితార సెంటర్, స్వాతి సెంటర్‌ నుంచి ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్లాలన్నారు.  
సీతమ్మవారి పాదాల నుంచి గుడికి చేరుకునే వాహనాలు గద్దబొమ్మ, కేఆర్‌ మార్కెట్, పంజా సెంటర్, గణపతిరావు రోడ్డు, చిట్టినగర్‌ సొరంగం మీదుగా ప్రయాణించాలని సూచించారు.  


మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి, చిత్రంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీ మోహన్, కలెక్టర్, సీపీ తదితరులు 

సమన్వయంతో విజయవంతం చేద్దాం 
ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి వెలంపల్లి  

సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ.. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ జె.నివాస్‌ అధ్యక్షతన బ్రాహ్మణవీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలో సమావేశం జరిగింది. ఉత్సవాల ఏర్పాట్లు ఏ దశలో ఉన్నాయనే వివరాలను దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులు మంత్రికి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌కు వివరించారు.  

వైభవంగా నిర్వహించాలి.. 
అనంతరం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేవస్థానం తరఫున చేపట్టిన పనులు త్వరతిగతిన పూర్తి చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. భక్తులకు మంచినీరు, పారుశుద్ధ్యం, ప్రసాదాల కౌంటర్లు తదితరాల ఏర్పాటులో అలసత్వం వద్దన్నారు. ఉత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో పాటు పలువురు రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement