SEC Ramesh Kumare Behaving Strangely In AP Panchayat Elections - Sakshi
Sakshi News home page

పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ 

Published Mon, Feb 8 2021 4:54 AM | Last Updated on Mon, Feb 8 2021 1:18 PM

Nimmagadda Ramesh Kumar is behaving strangely and making his mark as another mad tuglak - Sakshi

సాక్షి, అమరావతి: తనకు విశేషాధికారాలున్నాయని, తననెవ్వరూ ప్రశ్నించజాలరని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ మరో పిచ్చి తుగ్లక్‌గా ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో తన పరిధి దాటి వ్యవహరించారని స్పష్టమైనప్పటికీ, ఆయన వైఖరిలో ఇసుమంతైనా మార్పు రాకపోవడం మేధావులను, అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే ఆయన పని చేస్తున్నారనేది అడుగడుగునా స్పష్టమవుతోంది. న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయన్న కనీసపాటి జ్ఞానం లేకుండా, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను పక్కదోవ పట్టించడానికి పూనుకోవడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు.

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆదివారం హైకోర్టు కొట్టేసింది. ఇదే రోజు అధికారులు, రాజకీయ విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజలు సైతం విస్తుపోయేలా.. ఎన్నికల తర్వాత కూడా ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వం అనుకున్నట్టుగా కాకుండా తాను చెప్పినట్టే ఉండాలని నిర్దేశిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండే కలెక్టర్లు మొదలు రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల వరకు అందరినీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా బదిలీ చేయకూడదని పేర్కొనడం చూస్తుంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం కాక మరేమవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబాటే
► ప్రజలెన్నుకున్న ప్రభుత్వంగా ప్రజల సంక్షేమ, అభివృద్ధిని కాంక్షిస్తూ నిర్ధేశించుకున్న వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసే ప్రక్రియలో పాలనాపరంగా అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులను బదిలీ చేయడం సాధారణం. కానీ, నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసేందుకు నిర్ణీత కాల పరిమితి వరకు ఆగాలని చెబుతున్నారు. 
► ఎన్నికల విధులలో పాల్గొంటున్న కలెక్టర్లు, పోలీసు సిబ్బంది, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను వారి బదిలీకి నిర్ధేశించిన కాల పరిమితికి ముందు ప్రభుత్వం బదిలీ చేయకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రధాన అటవీ సంరక్షణాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
► ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసే అధికారులను అభినందిస్తూ, అందకనుగుణంగా ఆ వివరాలను సంబంధిత అధికారుల సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలన్న నిమ్మగడ్డ ఆదేశాలను చూసి అధికార యంత్రాంగం నివ్వెరపోయింది. 
► ఇది ముమ్మాటికీ అధికారులను ప్రలోభ పెట్టడమే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టీడీపీ తరఫున నిమ్మగడ్డ వకాల్తా పుచ్చుకుని పని చేస్తున్నారని ఈ పరిణామంతో సామాన్యులకు కూడా పూర్తిగా అర్థమైందని ఓ ప్రొఫెసర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం, టీడీపీ ఉనికి కాపాడటం కోసం ఓ అధికారి ఇంతగా బరి తెగించడం ఇప్పుడే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
► ఎన్నికలు జరిగే సమయంలో అంటే, కోడ్‌ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఎన్నికల తర్వాత ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ విషయం నిమ్మగడ్డకు తెలియదా? అని ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. పిచ్చి తుగ్లక్‌ను మరిపిస్తున్నారంటూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement