
కడప సిటీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల స్పష్టమైన తీర్పుతో పంచాయతీ ఎన్నికలను ఇక ఏ శక్తీ ఆపలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం తన విధి అని, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ చేపట్టామన్నారు. 2006లో 36 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతున్నాయన్నారు. బలవంతంగా ఏకగ్రీవాలకు పాల్పడటం తగదని, ఆ దిశగా ప్రభావితం చేసే వారిపై షాడో బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం అని, ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం పనితీరు బాగుందని, పనితనం ఉన్న వారిపై ఆరోపణలు రావడం సహజమే అన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు.
నిజం నిర్భయంగా చెబుతా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న ఈ జిల్లాలో ఒక అధికారిక సమావేశంలో పాల్గొనడం చాలా సంతృప్తికరంగా ఉందని నిమ్మగడ్డ అన్నారు. వైఎస్సార్ వద్ద పని చేయడం వల్లే తన కెరీర్‌లో గొప్ప మలుపు వచ్చిందని చెప్పారు. ఆయన వద్ద మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన తనను, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్‌భవన్‌లో ఉన్నత బాధ్యతల కోసం పంపించారన్నారు. అలా వెళ్లిన తాను అక్కడ ఏడేళ్లు ఉండిపోయి ఎలక్షన్ కమిషనర్‌ను అయ్యానని వివరించారు. రాజ్ భవన్ ఆశీస్సులతోనే తనకు ఈ పదవి వచ్చిందన్నారు.
అందువల్ల తన హృదయంలో వైఎస్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. తానెప్పుడూ నిజాన్ని నిర్భీతిగా, ధైర్యంగా చెబుతానన్నారు. ఇటీవల కొన్ని పరిణామాల వల్ల వచ్చిన సీబీఐ కేసుల్లో తాను ప్రధాన సాక్షినని, రేపు కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చాలా విషయాల్లో ఇదివరకే సాక్ష్యం చెప్పానన్నారు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యం చెప్పే వారికి కోర్టు అనేక రక్షణలు ఇచ్చిందన్నారు. అందువల్ల నిర్భీతితో తాను చెప్పాల్సింది చెబుతానన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.