కృష్ణా జిల్లా మొవ్వలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డను శాలువాతో సత్కరిస్తున్న టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగ బద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలగడం మరోసారి బట్టబయలైంది. కృష్ణా జిల్లా మొవ్వ మండల కేంద్రానికి ఆదివారం దైవ దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలోనే శాలువా కప్పి సన్మానించారు. టీడీపీ అనుబంధ విభాగం తెలుగు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాతినేని పూర్ణచంద్రరావు, ఆ పార్టీ మొవ్వ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుజ్జి కోటేశ్వరరావు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులుగా పనిచేసిన శీలం బాబురావు, ఇతర నాయకులు పోతర్లంక సుబ్రహ్మణ్యం, మండవ వీరభద్రరావు, మండవ రవికిరణ్, మండవ రాజ్యలక్ష్మి తదితరులు నిమ్మగడ్డతో ఆత్మీయంగా మెలుగుతూ కొద్దిసేపు ముచ్చటించారు. తిరిగి వెళ్లేటప్పుడు వారు ఆయన వెంట కారు దాకా వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. నిమ్మగడ్డ మొవ్వ గ్రామానికి వెళ్లుతున్న విషయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ పెద్దలు గ్రామ పార్టీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారని తెలిసింది. అందువల్లే అక్కడి నేతలు శాలువాతో ముందే సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పేదకల్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి ఆలయంలో, శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకులేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వంతో ఘర్షణ.. ప్రతిపక్షంతో స్నేహం!
– ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్న నిమ్మగడ్డ.. అదే సమయంలో ప్రభుత్వంతో పూర్తిగా ఘర్షణ వైఖరితో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వరకు అన్నింటా భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారు.
– ప్రభుత్వం నుంచి ఒక రకమైన అభిప్రాయం వెల్లడైతే, నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో అభిప్రాయం వ్యక్తపరుస్తూ వచ్చారు. 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసినప్పుడు గానీ.. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరపాలన్న అంశంలోగానీ ఏకపక్షంగా వ్యవహరించారు.
– గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసినప్పటికీ, అప్పుడు కూడా ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ.. సకాలంలో ఎన్నికలు జరపని విషయం తెలిసిందే.
– అలాంటిది ప్రపంచం మొత్తాన్ని ప్రాణ భయంలోకి నెట్టివేసిన కరోనాకు వ్యాక్సినేషన్ అందజేసే ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాసు స్వయంగా వివరించినప్పటికీ, వినిపించుకోక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కృష్ణా జిల్లా మొవ్వలో టీడీపీ నేతలతో ముచ్చటిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్
బాబు సన్నిహితులతో నాడు హోటల్‌లో మంతనాలు
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతల విషయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 2020 జూన్‌లో వివాదం తలెత్తిన సమయంలో.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న అప్పటి టీడీపీ నేత సుజనా చౌదరి (ప్రస్తుతం బీజేపీలో చేరారు), గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన కామినేని శ్రీనివాసరావుతో అదే నెల 13న హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో సమావేశం కావడం అప్పట్లో రాజకీయ దుమారానికి కారణమైంది.
– నా రోజు ఆ ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు నిమ్మగడ్డ ఉన్న హోటల్‌లోని గదికి చేరుకోవడం, గంటన్నర సేపు మంతనాలు సాగించడం.. అనంతరం ముగ్గురూ వేర్వేరుగా హోటల్ గది నుంచి బయటకు వచ్చే దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే.
టీడీపీ నేతే అన్నట్టు వ్యవహారం
కరోనా సెకెండ్ వేవ్ ఉన్నప్పటికీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఆయన మొవ్వ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి దర్శనానికి వెళితే.. అక్కడి టీడీపీ నేతలు స్వాగత సత్కారాలు చేస్తుంటే, ఆయన సంతోషంగా స్వీకరిస్తూ.. ఏదో విజయం సాధించినట్టు వ్యవహరించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న అధికారికి ఇది తగునా? ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పిన ఆయనే టీడీపీ నేతలతో ఎలా సన్మానాలు చేయించుకున్నారు? ఆయనేమన్నా టీడీపీ అనుబంధ సంఘం నేతా? ఎన్నికలు జరపడానికి అనువైన పరిస్థితులు ఇప్పుడు లేవని సీఎస్ స్వయంగా చెప్పినప్పటికీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చూస్తుంటే నిమ్మగడ్డ టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
– కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్యే, పామర్రు.
ఇతరులు వెళితే ఇంటర్ కమ్‌లోనే..
ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి ఇతర పార్టీ నేతలెవరైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళితే నిమ్మగడ్డ కలవడం లేదు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రతినిధుల బృందం నిమ్మగడ్డను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే.. తానెవరినీ కలవడం లేదంటూ, తన పీఏ వద్ద ఉన్న ఇంటర్ కమ్ ఫోన్‌లో మాట్లాడి పంపారు. తమ వద్ద నుంచి నిమ్మగడ్డ వ్యక్తిగత కార్యదర్శి వినతిపత్రం తీసుకున్నారని బీజేపీ ప్రతినిధుల బృందం సభ్యుడు ఉప్పలపాటి శ్రీనివాసరాజు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment