సాక్షి ప్రతినిధి, అనంతపురం, సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఇన్ని జరగాలనే పిడివాదంతో చేసే ఏకగ్రీవాలను అంగీకరించేది లేదన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అనంతపురం, కర్నూలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షణ కోసం కొత్త యాప్ ‘జియో’ తయారు చేశామని, గ్రామాల నుంచి నేరుగా రికార్డింగ్ మెసేజ్‌లతో పాటు సందేశాలు కూడా పంపవచ్చని తెలిపారు. యాప్, కాల్‌సెంటర్‌లను డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్ర సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలైన చోట్ల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని ఆదేశించారు. ఏకగ్రీవాలకు ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, అది గతం నుంచే ఉందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఉందని విపక్ష పార్టీల నాయకులు ఏకగ్రీవాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. సమాచార శాఖ కమిషనర్‌ను సంజాయిషీ కోరానని, ఆయనపై చర్యలు కూడా తీసుకోబోతున్నానన్నారు. ఇప్పటివరకూ ఎన్నికల కమిషనర్లు నాలుగు గోడల మధ్య పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేశారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా షాడో టీంలను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పెంచినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఓటు వేసేందుకు వస్తే చివరిలో పీపీఈ కిట్లు ధరించి వినియోగించుకునేలా అవకాశం ఇస్తామన్నారు.
నిన్ను సెన్సూర్ చేస్తా
ఉన్నతాధికారికి నిమ్మగడ్డ బెదిరింపులు
పత్రికలు, టీవీలు చూడలేదన్నందుకు ఓ ఉన్నతాధికారిని సెన్సూర్ చేస్తానంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ బెదిరించడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో సమీక్ష సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఈ రోజు పత్రికలు చూశావా? గవర్నరు వద్ద ఏం జరిగిందో తెలుసా?’ అంటూ కోనేరు రంగారావు సిఫారసుల కమిటీ(కేఆర్‌ఆర్‌సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడును నిమ్మగడ్డ ప్రశ్నించారు. పత్రికలు, టీవీలు చూడకపోతే ఎన్నికల సమయంలో నువ్వేం పని చేస్తావంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. సెన్సూర్ చేస్తానంటూ మూడుసార్లు బెదిరించినట్లు సమాచారం. తాను తెల్లవారుజామునే వచ్చి రిటర్నింగ్ అధికారులకు ఫోన్లు చేసే పనిలో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొనడంతో ‘గవర్నర్ వద్దకు వెళ్లి రాజకీయ పార్టీలు ఏం చెప్పాయో తెలియకపోతే ఏం డ్యూటీ చేస్తావ్?’ అని మరోసారి హెచ్చరించారు. అనంతరం ఆయన పేరు తెలుసుకుని నిమ్మగడ్డ సారీ చెప్పినట్లు తెలిసింది.
మీడియాపై చిందులు...
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌లను తప్పించాలంటూ రాసిన లేఖలపై నిమ్మగడ్డను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన సహనం కోల్పోయి గద్దించారు. ‘ఉండవయ్యా...ఉండు’ అంటూ చిర్రుబుర్రులాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడంపై ఏ చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment