
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహకరించడంతో పాటు అవసరమైన నిధులను కేటాయించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ.. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహకరించాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనేది పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వమే అంచనా వేయించి, ఆ మొత్తాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అన్ని జిల్లాలో తగిన ఏర్పాట్లు చేపట్టేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కూడా పేర్కొన్నారు. సీఎస్‌కు రాసిన లేఖతో కోర్టు తీర్పు కాపీని కూడా జత చేసినట్టు తెలిసింది.
కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అధికారులకు ‘డైరెక్షన్’ పేరుతో ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించామని, దీనికి వీలుగా డిసెంబర్ 21 తేదీ నాటికి గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితా మాస్టర్ కాపీలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా ఆ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment