సీఎం హోదాలో డిక్లరేషన్‌ అవసరం లేదు | No declaration is required in the capacity of CM At TTD | Sakshi
Sakshi News home page

సీఎం హోదాలో డిక్లరేషన్‌ అవసరం లేదు

Published Thu, Dec 31 2020 5:06 AM | Last Updated on Thu, Dec 31 2020 2:59 PM

No declaration is required in the capacity of CM At TTD - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల డిక్లరేషన్‌ వివాదానికి హైకోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. టీటీడీ ఆహ్వానం మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధిగా వెళ్లారని, అందువల్ల దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకవేళ హిందూయేతరుడై, వ్యక్తిగత హోదాలో తిరుమలకు దర్శనానికి, ప్రార్థనల నిమిత్తం వెళితే, అప్పుడు ఆ వ్యక్తి నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని, అందువల్ల ఏ అధికారంతో ఆయన సీఎంగా కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన రిట్‌ ఆఫ్‌ కో వారెంటో పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌కు ఏ మాత్రం విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ హైకోర్టు తన 27 పేజీల తీర్పు వెలువరించారు. గుంటూరు జిల్లా, వైకుంఠపురంకు చెందిన రైతు ఆలోకం సుధాకర్‌బాబు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, టీటీడీ చైర్మన్, ఈవోలు కూడా ఏ అధికారంతో ఆయా పదవులు, పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ లోతుగా విచారించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 22న తీర్పును వాయిదా వేసిన ఆయన బుధవారం తీర్పు వెలువరించారు.

జగన్‌ క్రిస్టియన్‌ అని పిటిషనర్‌ నిరూపించలేకపోయారు
‘ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను చూపడంలో పిటిషనర్‌ విఫలమయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అని, ఆయన క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసినంత మాత్రాన , క్రైస్తవ సభలకు హాజరైనంత మాత్రాన, ఓ వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించజాలం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హిందువు కాదని, క్రిస్టియన్‌ అని, అందువల్ల డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని ఆరోపణలు చేయడం మినహా, అందుకుతగిన ఏ ఆధారాలనూ సమర్పించలేదు. అందువల్ల పిటిషనర్‌ చేస్తున్న ఆరోపణలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం లేదు.  ఓ వాదనతో అధికరణ 226 కింద ఓ పిటిషన్‌ వేస్తే సరిపోదు, ప్రమాణపూర్వక అఫిడవిట్ల రూపంలో ఆధారాలను కోర్టు సమర్పించాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

బైబిల్‌ చదివితే క్రిస్టియన్‌ అయిపోతారా..?
‘ముఖ్యమంత్రి క్రైస్తవ సువార్త సమావేశాల్లో పాల్గొన్నారని, చర్చిల్లో ప్రార్థనలు చేశారని, అందువల్ల ఆయన క్రిస్టియన్‌ అవుతారని పిటిషనర్‌ చెబుతున్నారు. ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం ఓ వ్యక్తి క్రైస్తవ సువార్త సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన, చర్చిల్లో ప్రార్థనలు చేసినంత మాత్రాన, ఆ వ్యక్తిని క్రిస్టియన్‌గా పరిగణించడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి ఇటీవల విజయవాడ గురుద్వారలో ప్రార్థనలు చేశారు. అంత మాత్రాన, ఆయన సిక్కు మతాన్ని అనుసరిస్తున్నారని అనగలమా? ఓ వ్యక్తి బైబిల్‌లో ఉన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవ ఉపన్యాసానికి హాజరైనంత మాత్రాన, బైబిల్‌ చదివినంత మాత్రాన, ఇంట్లో శిలువ పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్‌ అయిపోతాడా? కాడు..’ అని న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ తెలిపారు.

సీఎంగా ఎవరున్నా ఆ సాంప్రదాయం కొనసాగుతోంది...
‘బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో శ్రీవెంకటేశ్వరస్వామికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తోందని పిటిషనరే చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున కైంకర్యపట్టి సమర్పించే అనవాయితీ ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు టీటీడీ సాంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతోంది. అలాగే పట్టువస్త్రాల సమర్పణకు టీటీడీ బోర్డు, ముఖ్యమంత్రిని ఆహ్వానించడం కూడా అనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పటికీ, ఈ సాంప్రదాయం మాత్రం కొనసాగుతూనే ఉంది.’ అని న్యాయమూర్తి తీర్పులో వివరించారు. ‘తిరుమల, తిరుపతి దేవస్థానాలు సాధారణంగా హిందూ ప్రజానీక దేవస్థానాలు. ఇందులో సాధారణంగా హిందువులకే ప్రవేశం ఉంటుంది. ఒకవేళ హిందూయేతరులు ఈ దేవస్థానాల్లోకి ప్రవేశించాలంటే, దేవాదాయ చట్ట నిబంధనలు 136, 137 ప్రకారం తన అసలైన మతాన్ని వెల్లడించి, తమకు శ్రీవెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది..’ అని స్పష్టం చేశారు. చివరిగా  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్సెస్‌ నారా చంద్రబాబునాయుడు కేసులో అప్పటి చీఫ్‌ జస్టిస్‌ ఎంఎస్‌ లిబరహాన్‌ చెప్పిన తీర్పును న్యాయమూర్తి గుర్తుచేశారు.

ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ, రాష్ట్రపతి హోదాలో అబ్దుల్‌ కలాం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చారని పిటిషనర్‌ చెబుతున్నారు. వాస్తవానికి ఇందిరాగాంధీ, అబ్దుల్‌ కలాంలు ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం, ప్రార్థనల నిమిత్తమే వచ్చారు. అంతేతప్ప, వారు ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా టీటీడీ సాంప్రదాయాల ప్రకారం నిర్వర్తించాల్సిన ఆచారాలను నిర్వర్తించేందుకు రాలేదు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, ప్రజా ప్రతినిధిగా టీటీడీ బోర్డు ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు వచ్చారు. సీఎం హోదాలో టీటీడీ ఆచారాలను నిర్వర్తించేందుకు వచ్చినప్పుడు ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు.
– న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement