సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది.
నెల్లూరు జిల్లాలో ఒక్కటి మినహా..
తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేయగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీలో సర్పంచి పదవికి, వార్డు సభ్యులుగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,723 గ్రామాల్లో సర్పంచి పదవికి పోలింగ్ జరగనుంది. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులు ఉండగా 12,185 ఏకగ్రీవమయ్యాయి. మరో 157 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 20,160 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఓట్ల లెక్కింపు కూడా రేపే..
తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓట్ల లెక్కింపు కూడా మంగళవారమే చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును చేపడతారు. గ్రామంలో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఫలితాల వెల్లడి తర్వాత వెంటనే వార్డు సభ్యుల ద్వారా ఉప సర్పంచి ఎన్నికను చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఓటు హక్కు విధిగా వినియోగించుకోండి
ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పంచాయతీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లను కోరారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగం ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. విధిగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని కోరారు.
తొలి విడత ఇలా
► తొలివిడత ఎన్నికల్లో 2,723 సర్పంచి పదవులకు 7,506 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 20,160 వార్డు సభ్యుల పదవులకు 43,601 మంది బరిలో ఉన్నారు.
► సర్పంచి, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఒకేసారి ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపరు విధానంలో ఎన్నిక జరుగుతుంది.
► సర్పంచి పదవికి గులాబీ రంగు (పింక్ కలర్) బ్యాలెట్ పేపరుపైనా, వార్డు పదవికి తెలుపు రంగు బ్యాలెట్ పేపరుపైనా ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత రెండు బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్స్ వద్దకు తీసుకెళ్లి రెండూ కలిపి అందులోనే వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.
► పోలింగ్ మెటీరియల్‌ను సోమవారం ఆయా మండల పరిషత్‌ల కార్యాలయాల వద్ద సంబంధిత పోలింగ్ సిబ్బందికి అందజేస్తారు.
► బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లు, ఇంకు, కవర్లు తదితర 38 రకాల పోలింగ్ మెటీరియల్స్‌ను పోలింగ్ సిబ్బందికి అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment