ఆంజనేయ ధర్మస్థల పుస్తకాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అందజేస్తున్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అర్చకులు ‘ఇస్తికఫాల్’ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుకొని.. శ్రీవారిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనవు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆంజనేయుని జన్మస్థలంపై టీటీడీ ముద్రించిన పుస్తకాన్ని అందజేశారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో కోవిడ్ వంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రెండేళ్ల తర్వాత ప్రతిరోజూ వేలాది మంది సామాన్య భక్తులకు సర్వదర్శన భాగ్యం లభించడం సంతోషకరమన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకొని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, లోకనాథం, వీజీవో బాలిరెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో జస్టిస్ దుర్గాప్రసాదరావు
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఆదివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment