తిరుమల/తిరుచానూరు(చంద్రగిరి): తిరుమలలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుడిపైనా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో భక్తులంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం శనివారం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు.
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆయన తొలగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తిరుమల కొండలు పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడి గది లాగే భావించి శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని.. ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇకపై ప్రతి నెలా రెండో శనివారం సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమలను పరిశుభ్రంగా.. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు. తిరుమలకు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ని రంగనాయకుల మండపంలో లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment