అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ‘‘భర్త దూరమైనా...ఒక్కగానొక్క కొడుకును చూసుకుని బతికేదాన్ని...దేవుడు నా బిడ్డనూ 33 ఏళ్లకే తీసుకువెళ్లాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసే కోడలు అండగా ఉంటుందనుకుంటే... ఇద్దరి పిల్లలనూ నా దగ్గర వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఈ పిల్లల ఆలనా పాలనా నా తరమా...వయస్సు ఉడిగిపోయిన నాపై పిల్లల బాధ్యత భావ్యమా..? వారి భవిష్యత్ తలచుకుంటుంటే భయమేస్తోంది. బిడ్డలపై కనికరం చూపమని నా కోడలికి మీరైనా చెప్పండమ్మా...ఈ ఇద్దరు చిన్నారుల భవిష్యత్ కోసం ఓ దారి చూపించండమ్మా’’ అని ఓ వృద్ధురాలు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్‌ను వేడుకుంది.
కలెక్టర్‌కు వృద్ధురాలు ఇచ్చిన అర్జీ ప్రకారం....అనంతపురం విద్యుత్ నగర్‌కు చెందిన లక్ష్మికి ఒక్కగానొక్క కుమారుడు సంతానం. జేఎన్‌టీయూలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. మేనకోడలితో పెళ్లికాగా గిరీష్‌కుమార్, జ్ఞానేశ్వరి సంతానం కలిగారు. అయితే అతను అనారోగ్యానికి గురై 2020లో మృతి చెందాడు. దీంతో రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా పనిచేసే అతని భార్య పిల్లలను వారి నానమ్మ లక్ష్మి వద్ద వదిలి మరో పెళ్లి చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారుల ఆలనా పాలనా నానమ్మే చూసుకుంటోంది. ఈక్రమంలోనే తన కోడలికి బుద్ధి చెప్పి చిన్నారుల భవితకు దారి చూపాలని కలెక్టర్‌ను వేడుకుంది. పిల్లల చదువులు, బాగోగులు చూసుకోవడం తనకు కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన కలెక్టర్... వృద్ధురాలు లక్ష్మి వినతిని ప్రత్యేకంగా స్వీకరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment