
కర్లపాలెం(బాపట్ల): ఊరు కాని ఊరు.. భాష రాక, తిరిగొచ్చే దారి తెలీక నాలుగేళ్ల క్రితం తప్పిపోయి ఓ మారుమూల రాష్ట్రంలో నరకయాతన అనుభవిస్తున్న 62ఏళ్ల వృద్ధురాలికి బాపట్లకు చెందిన ఓ వ్యక్తి జవాను ఆదుకున్నాడు. ఆమెను తన కుమారుడి దగ్గరకు చేర్చాడు. తెలంగాణలోని గద్వాల్ జిల్లా కుర్తిరవాళ్ గ్రామానికి చెందిన సోంబార్ నాగేశమ్మ 2018లో తన ఇంటి నుంచి అదృశ్యమై అసోంలోని చకోర్ జిల్లా చిల్‌చార్ సిటీకి చేరుకుంది.
అక్కడి భాష రాక మానసిక వేదనతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. అయిన వారు లేక నాగేశమ్మ రోజురోజుకీ మానసికంగా కుంగిపోతోంది. ఇంతలో ఓ రోజు అక్కడే జవానుగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం గ్రామానికి చెందిన ఎన్. వెంకట నరేష్ తోటి జవాన్లతో కలిసి ఆ వృద్ధాశ్రమానికి ఈ నెల 21న వెళ్లాడు.
అక్కడున్న వృద్ధ మహిళల మంచిచెడులు తెలుసుకుంటుండగా నాగేశమ్మ గురించి తెలిసింది. ఆమెను నరేష్ తెలుగులో పలకరించి ధైర్యం చెప్పాడు. ఆమె వివరాలు తెలుసుకుని తెలంగాణలోని ఓ న్యూస్ చానెల్ ప్రతినిధికి తెలియబర్చి వారిద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. వీడియో కాల్ ద్వారా తన తల్లిని గుర్తించిన ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు హుటాహుటిన అసోం వెళ్లి తన తల్లిని తీసుకుని వచ్చాడు.