అరసవల్లి: ముమ్మర వ్యాక్సినేషన్.. ఎక్కడికక్కడ కోవిడ్ టెస్టులు.. ఆస్పత్రుల్లో సదుపాయాల ఏర్పాటు.. అధికారుల నిరంతర పర్యవేక్షణ.. కలగలిపి సిక్కోలును కోవిడ్ మూడో ముప్పు బారి నుంచి తప్పిస్తున్నాయి. ఒకటి రెండు దశల్లో జిల్లాను అతలాకుతలం చేసిన కరోనా మూడోసారి మాత్రం కనికరిస్తోంది. పూర్తిగా అంతం కాకపోయినా కేసులు, మరణాల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గింది.
కోవిడ్ మొదటి దశలో జిల్లాలో వేలాది పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరణాల సంఖ్య కూడా అధికంగా నమోదైంది. చాలా కుటుంబాలు ఆర్థికంగా కూడా ఛిన్నాభిన్నమయ్యాయి. కొద్దికాలం తర్వాత డెల్టా వైరస్ కూడా జిల్లాను భయపెట్టింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను పొట్టన పెట్టుకుంది. వందలాది కుటుంబాలు దిక్కులేకుండా పోయాయి. ఆ తర్వాత కొన్ని నెలల పాటు కోవిడ్ నిద్రావస్థకు వెళ్లింది. మళ్లీ తాజాగా ఒమిక్రాన్ అంటూ తరుముకొచ్చింది. కానీ అప్పటికే అధికారులు ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేయడం, ఆస్పత్రుల్లో సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంతో ప్రాణనష్టం తప్పింది. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు బృందం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించింది. ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది. దీంతో జిల్లాలో రోజుకు సుమారు 80 వరకు కేసులు అధికంగా నమోదైనప్పటికీ.. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూనే అంతా సురక్షితంగా బయటపడగలిగారు.
ముందు జాగ్రత్త చర్యలతో..
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 15 నుంచి 60 ఏళ్లకు పైగా ఉన్న వారికి రెండు విడతలుగా వ్యాక్సిన్లు వేశారు. ఏకంగా 103 శాతం మొదటి డోస్‌ను అలాగే రెండో డోస్‌ను కూడా సుమారు 80 శాతానికి పైగానే పూర్తి చేశారు. అలాగే బూస్టర్ డోస్‌ను వీలైనంత వేగంగా వేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ పూర్తి స్థాయి బాధ్యతతో పనిచేయడంతో కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదు కావడం శుభ సూచికం.
Comments
Please login to add a commentAdd a comment