సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ సంస్థ మాండలీజ్ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. శ్రీసిటీలో ఇప్పటికే రూ.2,078 కోట్లతో 133 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు చేసిన మాండలీజ్.. ఆ యూనిట్‌లోనే రూ.1,600 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విస్తరణ ద్వారా 57 వేల చదరపు మీటర్ల మేర అభివృద్ధి చేయనున్నామని, తద్వారా ఏటా 2.20 లక్షల టన్నుల కోకోను వినియోగించుకునే సామర్థ్యం వస్తుందని మాండలీజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ మానేపల్లి తెలిపారు.
కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లు
విస్తరణలో భాగంగా కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 400 మంది పనిచేస్తుండగా.. విస్తరణ తర్వాత ఉపాధి లభించే వారి సంఖ్య 973కు చేరనుంది. అలాగే.. ఈ యూనిట్ ద్వారా 18 వేల మంది కోకో రైతులకు ప్రయోజనం లభించనుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడు సంవత్సరాల్లో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ సందర్భంగా వెంకట్ మానేపల్లి మాట్లాడుతూ.. ‘భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా మా వృద్ధికి అనుగుణంగా దేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించటం పట్ల సంతోషంగా ఉన్నాం. కీలకమైన శ్రీ సిటీ తయారీ యూనిట్ కార్యకలాపాలను విస్తరిస్తూ పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో మరిన్ని విజయాలను నమోదు చేస్తాం’ అని పేర్కొన్నారు. మాండలీజ్ శ్రీసిటీ యూనిట్ ద్వారా క్యాడ్‌బరీ, బార్నొవిటీ, ఓరియో వంటి బ్రాండ్స్‌కు చెందిన చాక్లెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment