Nellore, Andhra Pradesh Ongoing Rescue Operation for 3 Years Old Boy Sanju - Sakshi
Sakshi News home page

జాడలేక 10 రోజులాయే.. సంజూ ఎక్కడున్నావ్‌ నాన్నా.. 

Published Fri, Jul 9 2021 10:13 AM | Last Updated on Fri, Jul 9 2021 10:57 AM

Ongoing Rescue Operation For Boy Sanju - Sakshi

సంజు తల్లిదండ్రులు దండు బుజ్జయ్య, లక్ష్మమ్మ

‘నాన్నా.. ఎక్కడున్నావు.. నీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.. బుడిబుడి అడుగులతో అమ్మా అంటూ నా చీర పట్టుకుని తిరుగుతుంటే చూడాలని ఉంది బిడ్డా.. నిన్ను చూడకుండా నేనెలా బతకాలి కన్నా.. నీ కోసం మేమే కాదు.. కాలనీవాసులు, పోలీసులు రాత్రీపగలు తేడా లేకుండా వెతుకుతున్నాం.. త్వరగా కనిపించు నాన్నా..’ తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి దండు సంజు తల్లిదండ్రుల ఆవేదన ఇది.. 

సాక్షి, నెల్లూరు: కలువాయి మండలం ఉయ్యాలపల్లి దళితవాడకు చెందిన దండు బుజ్జయ్య, లక్ష్మమ్మకు ముగ్గురు మగపిల్లలున్నారు. వారిలో సంజు రెండో బిడ్డ. బుజ్జయ్య గొర్రెలు మేపుతాడు. లక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. గొర్రెలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తున్న బుజ్జయ్య వెంట చిన్నారి సంజు (3) వెళ్లేవాడు. కొంత దూరం వరకు వెళ్లిన చిన్నారిని తిరిగి ఇంటికి చేర్చడం నిత్యం జరుగుతుండేది. కానీ గత నెల 29వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో చిన్నారి తండ్రి వెళ్లిన కాసేపటికి అటవీ ప్రాంతం వైపు వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటినుంచి సంజు ఆచూకీ లభించలేదు.

జల్లెడ పడుతున్న పోలీసులు 
సంజు ఆచూకీ కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్, కలువాయి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది రోజూ సంజు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి అడవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉయ్యాలపల్లి తెగచర్ల పరిసర ప్రాంతాలతోపాటు, సమీప అటవీ ప్రాంతంలో పోలీస్‌ బృందాలు తీవ్రస్థాయిలో గాలించాయి.

రెండు రోజుల క్రితం పోలీస్‌ జాగిలాన్ని రప్పించి అడవిలో తిప్పారు. ముందుగా బాలుడు వాడుతున్న చెప్పులను వాసన చూపించారు. జాగిలం అక్కడి నుండి రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో తిరిగి ఆగిపోయింది. డాగ్‌ స్క్వాడ్‌ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే 10 రోజులు గడచినందున దుస్తులు తదితరాల కంటే చెప్పుల ద్వారా జాగిలాలు వాసనను బాగా పసిగట్టగలవని తెలిపారు. జాగిలం బాగా అలసిపోయిందని, విశ్రాంతినిచ్చారు. మళ్లీ గాలింపు చేపట్టనున్నారు. అలాగే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు వేయించి రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించారు. 

ఎత్తుకెళ్లి ఉంటారా? 
సంజును ఎవరైనా అపరిచితులు ఎత్తుకెళ్లి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. తల వెంట్రుకల కోసం ఊరూరా తిరిగే కొందరు అపరిచితుల వ్యక్తులు బిడ్డను అపహరించి విక్రయించుకునే అవకాశం కూడా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తప్పిపోయిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్‌ డంప్‌ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. 

క్షేమంగా ఉంటాడని.. 
సంజు ఆచూకీ లభ్యం కాకపోవడం.. పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో కూడా బిడ్డ ఆనవాళ్లు లేకపోవడంతో ఎక్కడో చోట క్షేమంగా ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ చిన్నారికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తప్పక ఆనవాళ్లు లభించేవని, త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటామని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. 

అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాం  
చిన్నారి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని గాలించాం..డ్రోన్‌ కెమెరాలతోపాటు పోలీస్‌ డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి గాలించాం. త్వరలోనే బిడ్డ ఆచూకీ కనుగొంటాం.    
– వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఆత్మకూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement