నెలకు రూ.1.50 కోటి.. ఏడాదికి రూ.18 కోట్లు కట్టాల్సిందే
కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి చేసే యూబీ కంపెనీకి తేల్చిచెప్పిన కూటమి ముఠా
ఇంత భారీ మొత్తం చెల్లించలేమన్న కంపెనీ
దీంతో రెచ్చిపోయిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు
ఫ్యాక్టరీపై దాడి.. కంపెనీ ఆస్తులు ధ్వంసం
లారీలను అనుమతించని వైనం
కంపెనీ ముందు బారులు తీరిన లారీలు
డబుల్ గేమ్‌తో డ్రామాను రక్తి కట్టిస్తున్న మంత్రి అచ్చెన్న
పారిశ్రామికవేత్తలకు అప్పుడే పచ్చ ముఠా బెదిరింపులు
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్‌లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్‌ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.
అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది.
ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.
దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది.
కంపెనీ యాజమాన్యం ససేమిరా..
ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్‌కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది.
రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్‌లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్‌లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం.
ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్‌లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్న
ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు.
అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు.
పారిశ్రామికవేత్తల ఆందోళన..
అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment