సాక్షి, అమరావతి: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారులు ఉనికి కోసం పాట్లు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి నియోజకవర్గంలో పది పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం ఒకే ఒక పంచాయతీతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో తాను ఘనాపాటి అని చెప్పుకునే బుచ్చయ్య.. పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. జనసేనతో పొత్తు పెట్టుకుని కూడా ఆయన టీడీపీ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న మండపేట నియోజకవర్గంలో 43 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరుచోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడం విశేషం.
చేతులెత్తేసిన హేమాహేమీలు
► శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం కంతేటిలో వైఎస్సార్‌సీపీ అభిమాని గెలుపొందారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని తన సొంత గ్రామం కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టీడీపీ మద్దతుదారుడిని గెలిపించలేకపోయారు.
► మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలోనూ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి పరాజయం పాలయ్యారు.
► విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేత అయ్యన్నపాత్రుడు పార్టీ మద్దతుదారులను గెలిపించుకోలేక చేతులెత్తేశారు. ప్రతిరోజూ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయడం తప్ప నియోజకవర్గంలో ఆయనకు పట్టులేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.
► 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభిమాని గెలుపొందారు. ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీకి అండగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి, పల్లెపాడు, నిడదవోలు నియోజకవర్గంలోని కోరుమామిడి, పెండ్యాల, మోర్త, పసలపూడి, అన్నవరప్పాడు, కాపవరం గ్రామాల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది.
► టీడీపీకి అండగా ఉండే కృష్ణా జిల్లాలోని కొల్లేటి లంక గ్రామాలు ఈసారి మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించాయి. గుడివాడ నియోజకవర్గంలోని టీడీపీకి పెట్టనికోటగా ఉండే చౌటపల్లిలో ఈసారి ఆ పార్టీ అభిమాని ఓటమిపాలయ్యారు. మోటూరులోనూ అదే పరిస్థితి.
ఇనుమొల్లులో ఆంజనేయులుకు చుక్కెదురు
► గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలోని తన సొంత గ్రామం ఇనుమొల్లులో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ 12 వార్డులకుగాను పది వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలవడం గమనార్హం.
► అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు సొంత గ్రామం అంకంపల్లిలో టీడీపీ మద్దతుదారు ఓటమిపాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ తనకు కంచుకోటల్లాంటి గ్రామాల్లో బోల్తా పడింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం విశేషం.
► ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, పార్టీ రహిత ఎన్నికలు కావడంతో దాన్ని ఆసరాగా తీసుకుని తామే గెలిచినట్లు చంద్రబాబు చెప్పుకోవడం చూసి ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. ప్రజా క్షేత్రంలో టీడీపీ నేతలు మొహాలు చాటేస్తున్నారు.
టీడీపీ కంచుకోటల్లో వైఎస్సార్‌సీపీ పాగా
Published Mon, Feb 15 2021 3:47 AM | Last Updated on Mon, Feb 15 2021 12:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment