టీడీపీ హయాంలో తమ కాంట్రాక్ట్ పనులకు అవసరమైన మట్టి కోసం పరిటాల కుటుంబం జంగాలపల్లి చెరువుపై కన్నేసింది. చెరువు స్వరూపం దెబ్బతీసేలా అధునాతన యంత్రాలతో మట్టిని తవ్వేశారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చెరువు ఆయకట్టులో ఊట పడటానికి కారకులయ్యారు. పంటలు దెబ్బతినడంతో పాటు జమ్ము గడ్డి ఏపుగా పెరిగి ఇకపై సాగు చేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. పరిటాల కుటుంబానికి కాసులు.. ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిలాయి.
రాప్తాడు రూరల్: అనంతపురం మండలం జంగాలపల్లి చెరువు (కందుకూరు చౌడు చెరువు) 33 ఏళ్ల తర్వాత నిండింది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఆయా గ్రామస్తులు పట్టుబట్టి ధర్మవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువుకు తెప్పించుకున్నారు. చెరువుకు నీళ్లు రాగానే భూగర్భజలాలు పెరిగి బోరుబావులు రీచార్జ్ అవుతాయని ఆయకట్టు రైతులు ఆశపడ్డారు. అయితే వారి అశలు అడియాసలయ్యాయి. గత టీడీపీ పాలకులు చేసిన పాపం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అప్పట్లో చెరువులో జరిపిన తవ్వకాల వల్ల కింది భాగం మట్టి లూజు అయ్యింది. ఫలితంగా ఊటలు ఏర్పడి సాగు చేసిన పంటల్లో నీరు ప్రవహిస్తోంది.
తుడిచిపెట్టుకుపోయిన పంటలు
ఈ చెరువు ఆయకట్టు దాదాపు 275 ఎకరాల దాకా ఉంది. నీటి ఊట కారణంగా 150 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, పరుశురాం, వెంకటరాముడు, చరణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితర రైతులు సాగు చేసిన చీనీ, అరటి, బొప్పాయి, స్వీట్ ఆరెంజ్, కాయగూరల పంటలు తుడిచి పెట్టుకుపోయాయి.
రైల్వే పనులకు చెరువు మట్టి
గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల కుటుంబం కాంట్రాక్ట్ చేసిన రైల్వే పనులకు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన మట్టిని జంగాలపల్లి చెరువు నుంచే తరలించింది. దాదాపు 30 అడుగుల లోతు ఇష్టారాజ్యంగా హిటాచీల సాయంతో తవ్వేశారు. జీడిబంక మట్టి అంతాపోయింది. ఇసుక, గరుసు వచ్చేవరకు తవ్వకాలు జరిపారు. టిప్పర్లు కింది నుంచి పైకి వచ్చేందుకు ప్రత్యేకంగా రన్‌వే ఏర్పాటు చేశారంటే ఏ స్థాయితో తవ్వకాలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు.
ఉబికి వస్తున్న నీళ్లు
చెరువు ఆయకట్టులో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఉన్న పంటలు నష్టపోవడంతో పాటు కొత్తగా పంటలు సాగు చేసేందుకు కూడా వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్లలో నుంచి నీరు బయటకు వస్తోంది. నీటి ప్రవాహంతో పెద్ద ఎత్తున జమ్ము పెరిగింది.
చేపల చెరువులకు లీజుకు ఇచ్చిన రైతులు
నీటి ఊటతో పంటలు సాగు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో తొలిసారి చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆయకట్టు కింద వెంకటరామిరెడ్డి, చరణ్‌కుమార్‌రెడ్డి వరి సాగు చేసేవారు. మంచి దిగుబడి వచ్చేది. ఈసారి నీటి ప్రవాహం కారణంగా పంట సాగు చేసేందుకు వీలు కాకపోవడంతో తమ భూమిని నెల్లూరు జిల్లా వాసులకు చేపల చెరువుల కోసం లీజుకు ఇచ్చారు.
మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి..
టీడీపీ పాలనలో చెరువులో జరిపిన మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దుగుమర్రి గోవిందరెడ్డి, సర్పంచ్ ప్రశాంత్‌కుమార్, ఎంపీటీసీ సభ్యులు రాగే రేవతి, పెద్దప్ప, ఉపసర్పంచ్ ఓబులేసు, పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, నరసింహారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు తెలిపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎంతో కష్టపడి కృష్ణాజలాలతో చెరువును నింపించారన్నారు. చెరువు అడుగు భాగం బాగా దెబ్బతినడంతో ఊటలు ఏర్పడి ఆయకట్టు అంతా నీరుపారుతోందన్నారు. ఇప్పటికే 60 శాతం దాకా నీళ్లు బయటికిపోయాయని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయకట్టులో జమ్ము గడ్డి పెరిగిందన్నారు. దీంతో ఇకపై పంటలు పెట్టేందుకు వీలుకాదని తెలిపారు.
వ్యవసాయ పంటలకు దెబ్బ
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చెరువుకు 75 శాతం నీళ్లు వచ్చినా ఏరోజూ ఊట పడలేదు. ఆనందంగా వరి సాగు చేసి.. 450 ప్యాకెట్ల ధాన్యం తీసేవాళ్లం. ఇప్పుడు ఆయకట్టులో భారీగా నీళ్లు ఊరుతున్నాయి. నా జీవితంలో ఎప్పుడూ ఆయకట్టులో జమ్ము గడ్డి పెరగడం చూడలేదు. ఇప్పుడా పరిస్థితి రావడంతో వ్యవసాయ పంటలకు పెద్ద దెబ్బ పడింది.
– చరణ్‌కుమార్‌రెడ్డి, రైతు, జంగాలపల్లి
మోటార్లతో నీళ్లు తోడుతున్నాం
ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో చీనీ పంట, మూడెకరాల్లో అరటి సాగు చేశాను. ఊట దిగడంతో అరటి పంట మొత్తం దెబ్బతింది. అరటిపంటలో మొత్తం జమ్ము పెరిగింది. నాలుగున్నరేళ్ల వయసున్న చీనీచెట్లను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నా. రోజూ మోటార్లతో నీళ్లు తోడిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. చెరువు అంతా పెద్ద పెద్ద గుంతలు తవ్వడం వల్లే నీటి ఊటలు ఏర్పడ్డాయి.
– కృష్ణారెడ్డి, చెరువు ఆయకట్టు దారుల సంఘం మాజీ అధ్యక్షుడు
ఊటలోనే 12 ఎకరాలు..
చెరువు ఆయకట్టు కింద 19 ఎకరాలు ఉంది. అరటి, బొప్పాయి, చీనీచెట్లు సాగు చేశాం. ఊట ఏర్పడి రెండెకరాలు మినహా తక్కిన పంటలన్నీ పూర్తిగా ఎత్తిపోయాయి. ఏడెనిమిది నెలలవుతున్నా 12 ఎకరాల భూమి నీళ్లలోనే ఉంది. 15 ఏళ్ల వయసున్న చీనీచెట్లు, కోతకు వచ్చిన అరటి, బొప్పాయి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు రూ. 20 లక్షల పైనే నష్టం వాటిల్లింది. గతంలో చెరువులో నీళ్లు ఉన్నా...ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. – సోమశేఖర్‌రెడ్డి, రైతు, కందుకూరు
Comments
Please login to add a commentAdd a comment