సాక్షి, గుడివాడ: మనుషులే కాదు..మాటలు రాని పక్షులు సైతం తమ బిడ్డలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతాయనేందుకు గుడివాడలో జరిగిన ఓ ఘటన సాక్షీభూతంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని వృక్షానికి గల తొర్రలో ఓ చిలుక పిల్లలను పెట్టింది. దానిని పసికట్టిన ఓ పెద్ద పాము తల్లి చిలుక గూటిలో లేని సమయంలో వాటిని మింగేందుకు తొర్ర వద్దకు చేరింది. అదే సమయానికి అక్కడకు చేరుకున్న తల్లి రామచిలుక గట్టిగా అరవడంతో చుట్టు పక్కల ఉన్న చిలుకలన్నీ దీనికి తోడయ్యాయి. అవి మూకుమ్మడిగా పాముపై దాడి చేశాయి. ఆ దెబ్బకు బతుకు జీవుడా అంటూ పాము పలాయనం చిత్తగించింది. తమ బిడ్డలను రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి పామును తరిమికొట్టే వరకు చిలుకలు చేసిన పోరాటాన్ని చూసిన ప్రజలు..పేగు బంధం అంటే ఇదే సుమా అంటూ చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment