
విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ, వైస్సార్‌సీపీ రూరల్ అధ్యక్షుడు శరగడం చిన్న అప్పలనాయుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో అవిశ్రాంతంగా పనిచేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ లేరన్న బాధ జీర్ణించుకోలేక పోతున్నానని సీపీఎం నేత నర్సింగ రావు అన్నారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసందర్శించి నివాళులు అర్పించారు.
తమ అభిమాన నేతను కడసారిగా చూసేందుకు పెద్దఎత్తున నగర ప్రజలు, నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ద్రోణంరాజు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే')
ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. గత నెలవరకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా పనిచేశారు. నిష్కళంక నాయకుడిగా, అవినీతి మరకలేని నేతగా పేరు సంపాదించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్‌కు ఆగస్టు 29న కోవిడ్ పాజిటివ్ రావడంతో నాలుగు రోజులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. తరువాత నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్సతో కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. (ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ విచారం)
Comments
Please login to add a commentAdd a comment