ఒకప్పటి  స్టేటస్‌ సింబల్‌.. నేడు మ్యూజియంలో వస్తువుగా.. | Past Status Symbol Landline Telephone Is Disappearing | Sakshi
Sakshi News home page

ఒకప్పటి  స్టేటస్‌ సింబల్‌.. నేడు మ్యూజియంలో వస్తువుగా..

Published Sun, Aug 21 2022 3:32 PM | Last Updated on Mon, Aug 22 2022 1:36 PM

Past Status Symbol Landline Telephone Is Disappearing - Sakshi

ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా): ట్రింగ్‌ ట్రింగ్‌... ట్రింగ్‌ ట్రింగ్‌.. అంటూ మార్మోగిన ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ క్రమక్రమంగా అదృశ్యమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్‌ సింబల్‌గా పిలుచుకునే టెలిఫోన్‌ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డెడ్‌ కాగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికిని కాపాడుకునేందుకు ఊగిసలాడుతోంది.  కాలగమనంలో అరచేతిలోకి సెల్‌ఫోన్‌ వచ్చి చేరడంతో ల్యాండ్‌లైన్‌కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇళ్లల్లో రాజసానికి సింబాలిక్‌గా నిలిచిన ‘ల్యాండ్‌లైన్‌ ఫోన్‌’.. సెల్‌ఫోన్‌ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారింది.
చదవండి: హనీ ట్రాప్‌.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి.. 

కాలం గడుస్తున్నకొద్దీ మనం రోజూ వాడే వస్తువులకు కూడా కాలం చెల్లుతుంది. సేవలు కూడా కనుమరుగైపోతాయి. శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్‌ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసుకుని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు.

2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సేవలు ఏటికేటికీ తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడం మొదలు పెట్టింది. 2009లో మొబైల్‌ ఫోన్‌కు 3జీ సెక్టార్‌ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండటం, మెసేజ్‌లు పంపుకునే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. అంతవరకు కాస్తో కూస్తో ఉన్న ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లను 2015లో వచ్చిన జియో బాగా దెబ్బతీసింది.

గ్రామగ్రామానా జియో టవర్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు రెండు సంవత్సరాలు జియో 4జి సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్‌లైన్‌ నిలువలేక పోయింది. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 1.5 లక్షల బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 7,500 పడిపోయింది.

అది ఒకప్పటి స్టేటస్‌ సింబల్‌ 
సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్‌ ఎక్సేంజి ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్‌ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో,పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకునేవారు. వారిని ఆ ఊరంతా సంపన్నులుగా భావించేవారు. ఆ ఊర్లో వాళ్లకు వారి బంధువులు ఏమైనా శుభవార్త అయినా.. అశుభ వార్త అయినా ఈ ఫోన్‌కు కాల్‌ చేసి చెబితే వారు పిలిపించి మాట్లాడించేవారు.

అందుకే ఫోన్‌ ఇంట్లో ఉన్న వారితో ఇరుగు పొరుగు అంతా బాగా కలిసి ఉండేవారు. కొంత కాలానికి ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఫోన్‌ తప్పసరి కావడంతో ల్యాండ్‌ఫోన్‌ పెట్టించుకునేవారు. అయితే కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్‌ఫోన్‌లు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వారు ఫోన్‌ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడటంతో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు ఆదరణ కోల్పోయాయి.

ఉపాధికి కేరాఫ్‌గా ఎస్‌టీడీ బూత్‌లు  
ఓ 20 సంవత్సరాల క్రితం చదువుకుని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్‌టీడీ బూత్‌లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్‌ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేణా ల్యాండ్‌లైన్‌ స్థానంలో కాయిన్‌బాక్స్‌లు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్‌ బాక్స్‌ ఉండేవి. అంతే స్పీడుగా స్మార్ట్‌ ఫోన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి.

ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోనే..  
బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2006 వరకు సుమారు 1.5 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 7,500కు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ల్యాండ్‌లైన్‌ కనుమరుగు అవగా పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్‌ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది.

2015 నుంచి డౌన్‌ఫాల్‌ 
2000 సంవత్సరం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారుడికి ల్యాండ్‌ఫోన్‌ ఉచితంగా ఇవ్వడం మానేసింది. డబ్బులిచ్చి ఫోన్‌ కొనుక్కోవాలి. ల్యాండ్‌ఫోన్‌ కనెక్షన్‌కు డిపాజిట్‌ కట్టి ఫోన్‌ కొనుగోలు చేసే సొమ్ముకు సెల్‌ ఫోన్‌ వస్తుండటంతో అందరూ అటువైపు మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో జియో 4జి రావడం.. ఒకటి, రెండేళ్లు ఉచితంగా అపరిమిత సేవలు అందించడంతో ప్రజలు మొత్తం సునామీలా అందులోకి డైవర్ట్‌ అయ్యారు. అప్పటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్లకు డౌన్‌ఫాల్‌ మొదలైంది.   
– రామాంజనేయరెడ్డి, ఎస్‌డీఓటీ, ఆళ్లగడ్డ

అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారు 
ల్యాండ్‌ఫోన్‌ ఖర్చుతో పోల్చితే మొబైల్‌ ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ల్యాండ్‌ఫోన్‌ ఓ చోట ఉంటే అందరూ అక్కడికి వచ్చి అందరి ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రైవసీకి అలవాటు పడ్డారు. మొబైల్‌ అయితే వారికి అనువుగా ఉన్నచోట కూర్చొని రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు ఎవరూ ఇష్ట పడ్డం లేదు.
– రమణ, అహోబిలం    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement