Status symbol
-
ఒకప్పటి స్టేటస్ సింబల్.. నేడు మ్యూజియంలో వస్తువుగా..
ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా): ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్ ట్రింగ్.. అంటూ మార్మోగిన ల్యాండ్‌లైన్ ఫోన్ క్రమక్రమంగా అదృశ్యమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్‌గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డెడ్ కాగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికిని కాపాడుకునేందుకు ఊగిసలాడుతోంది. కాలగమనంలో అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చి చేరడంతో ల్యాండ్‌లైన్‌కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇళ్లల్లో రాజసానికి సింబాలిక్‌గా నిలిచిన ‘ల్యాండ్‌లైన్ ఫోన్’.. సెల్‌ఫోన్ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. కాలం గడుస్తున్నకొద్దీ మనం రోజూ వాడే వస్తువులకు కూడా కాలం చెల్లుతుంది. సేవలు కూడా కనుమరుగైపోతాయి. శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ సేవలు ఏటికేటికీ తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడం మొదలు పెట్టింది. 2009లో మొబైల్ ఫోన్‌కు 3జీ సెక్టార్ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండటం, మెసేజ్‌లు పంపుకునే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. అంతవరకు కాస్తో కూస్తో ఉన్న ల్యాండ్‌లైన్ కనెక్షన్లను 2015లో వచ్చిన జియో బాగా దెబ్బతీసింది. గ్రామగ్రామానా జియో టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు రెండు సంవత్సరాలు జియో 4జి సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్‌లైన్ నిలువలేక పోయింది. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 1.5 లక్షల బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 7,500 పడిపోయింది. అది ఒకప్పటి స్టేటస్ సింబల్ సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్ ఎక్సేంజి ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో,పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకునేవారు. వారిని ఆ ఊరంతా సంపన్నులుగా భావించేవారు. ఆ ఊర్లో వాళ్లకు వారి బంధువులు ఏమైనా శుభవార్త అయినా.. అశుభ వార్త అయినా ఈ ఫోన్‌కు కాల్ చేసి చెబితే వారు పిలిపించి మాట్లాడించేవారు. అందుకే ఫోన్ ఇంట్లో ఉన్న వారితో ఇరుగు పొరుగు అంతా బాగా కలిసి ఉండేవారు. కొంత కాలానికి ల్యాండ్‌లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఫోన్ తప్పసరి కావడంతో ల్యాండ్‌ఫోన్ పెట్టించుకునేవారు. అయితే కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్ఫోన్లు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వారు ఫోన్ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడటంతో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఆదరణ కోల్పోయాయి. ఉపాధికి కేరాఫ్‌గా ఎస్టీడీ బూత్‌లు ఓ 20 సంవత్సరాల క్రితం చదువుకుని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్టీడీ బూత్‌లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్‌ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేణా ల్యాండ్‌లైన్ స్థానంలో కాయిన్‌బాక్స్‌లు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్ బాక్స్ ఉండేవి. అంతే స్పీడుగా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోనే.. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2006 వరకు సుమారు 1.5 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 7,500కు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ల్యాండ్‌లైన్ కనుమరుగు అవగా పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2015 నుంచి డౌన్‌ఫాల్ 2000 సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడికి ల్యాండ్‌ఫోన్ ఉచితంగా ఇవ్వడం మానేసింది. డబ్బులిచ్చి ఫోన్ కొనుక్కోవాలి. ల్యాండ్‌ఫోన్ కనెక్షన్‌కు డిపాజిట్ కట్టి ఫోన్ కొనుగోలు చేసే సొమ్ముకు సెల్ ఫోన్ వస్తుండటంతో అందరూ అటువైపు మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో జియో 4జి రావడం.. ఒకటి, రెండేళ్లు ఉచితంగా అపరిమిత సేవలు అందించడంతో ప్రజలు మొత్తం సునామీలా అందులోకి డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లకు డౌన్‌ఫాల్ మొదలైంది. – రామాంజనేయరెడ్డి, ఎస్‌డీఓటీ, ఆళ్లగడ్డ అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారు ల్యాండ్‌ఫోన్ ఖర్చుతో పోల్చితే మొబైల్ ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ల్యాండ్‌ఫోన్ ఓ చోట ఉంటే అందరూ అక్కడికి వచ్చి అందరి ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రైవసీకి అలవాటు పడ్డారు. మొబైల్ అయితే వారికి అనువుగా ఉన్నచోట కూర్చొని రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాండ్‌లైన్ ఫోన్లు ఎవరూ ఇష్ట పడ్డం లేదు. – రమణ, అహోబిలం -
ఇషా కొప్పికర్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాక్..
ముంబై : తమ స్టేటస్ చాటుకునేందుకు బాలీవుడ్ భామలు ఎంతైనా ఖర్చుచేస్తున్నారు. ఖరీదైన వస్తువులను ప్రదర్శిస్తూ స్టైల్ స్టేట్మెంట్లో ఒకర్ని ఒకరు మించిపోతున్నారు. తాజాగా నటి ఇషా కొప్పికర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. ఎరుపు రంగు దుస్తులు, యాక్సెసరీస్‌తో ఆకట్టుకున్న ఇషా కొప్పికర్ ఖరీదైన వస్తువులతో రాజసం ప్రదర్శించారు. పొడవాటి రెడ్ గౌన్ ధరించిన ఇషా కొప్పికర్ తన క్రేజీ బ్యాగ్‌తో కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 14,54,849 మాత్రమే. కాగా, ఇషా డ్రెస్ ఆమెకు పెద్దగా నప్పలేదని, భారీ బ్యాగ్‌పైనే అందరి దృష్టి కేంద్రకృతమైందని అక్కడి వారు గుసగుసలాడటం వినిపించింది. -
గన్‌జాటం!
♦ స్టేటస్ సింబల్‌గా తుపాకీ ♦ జిల్లాలో కనిపించని ఫ్యాక్షన్, నక్సలిజం ♦ అయినా పెరిగిన దరఖాస్తులు ♦ లైసెన్స్ జారీలో ఆచితూచి అడుగులు ♦ అదుపుతప్పితే ముప్పే ♦ లోతుగా విశ్లేషిస్తున్న పోలీసులు అనంతపురం అర్బన్ : చెప్పుకోదగ్గ ఫ్యాక్షన్ లేదు.. నక్సలిజం జాడ కనిపించట్లేదు.. ప్రత్యేకంగా ముప్పు ఉన్నట్లు ఎవరూ ముందుకు రాలేదు.. ఇక ప్రజాప్రతినిధులకు ఎలాగూ ప్రభుత్వం గన్మెన్లను కేటాయిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే ప్రత్యేకంగా ఎవరికీ గన్‌తో పని లేదనేది సుస్పష్టం. అయితే గన్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తున్నట్లు ఇటీవల కాలంలో చేసుకున్న దరఖాస్తులను చూస్తే అర్థమవుతుంది. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి గన్ లైసెన్స్‌లు ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే లైసెన్స్ ఉండి రెన్యూవల్ కోసం 51 మంది దరఖాస్తు చేశారు. ఈ రెండింటికీ 74 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో 8 మందికి లైసెన్స్ మంజూరయింది. 11 మంది దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా.. 55 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. స్టేటస్ కోసమేనా.. ఒకప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ జాడ ఉంది. ఆ క్రమంలో కొందరు తమ ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందనే ఉద్దేశంతో గన్‌లైసెన్స్ పొందారు. ప్రస్తుతం జిల్లాలో ఫ్యాక్షన్ సద్దుమణిగింది. అదేవిధంగా ఒకప్పుడు నక్సలిజం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ క్రమంలో ఆయా కారణాలు చూపిస్తూ గతంలో కొందరు గన్‌లైసెన్స్ పొందినా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఫ్యాక్షనిజం, నక్సలిజం కనుమరుగయ్యింది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ప్రత్యేకంగా 1+1 తక్కువ కాకుండా, వారి స్థాయిని బట్టి గన్మెన్లను కేటాయిస్తోంది. ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వారికీ గన్మెన్లను మంజూరు చేస్తున్నారు. వీరే కాకుండా కొత్తగా లైసెన్స్ కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు అవుతుండటం చూస్తే గన్ సంస్కృతికి పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. గన్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. సూక్ష్మ పరిశీలన తర్వాతే మంజూరు గతంలో గన్ లైసెన్స్‌ని అప్పటి పరిస్థితుల ఆధారంగా ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లా పరిస్థితులు పూర్తిగా మారడంతో లైసెన్స్ మంజూరులో అధికారులు సూక్ష్మ పరిశీలన చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యం, వారికి నిజంగా ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందా? వారు చూపుతున్న కారణంలో నిజం ఎంత? గన్ లేకపోతే ప్రాణ హాని ఉంటుందా? పోలీసు ప్రొటెక్షన్ కలిగి ఉన్నారా? ఒకవేళ ఇప్పటికే కలిగి ఉన్న లైసెన్స్‌కి నిర్ణీత గడువులో రెవెన్యూవల్కి దరఖాస్తు చేసుకున్నారా? ఇలా దరఖాస్తుదారునికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని విధాల సంతృప్తి చెందితేనే లైసెన్స్ మంజూరు చేయడం.. లేదా రెన్యూవల్ చేయడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్‌లకు రెకమండ్ చేయట్లేదు గన్ లైసెన్స్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రెకమెండ్ చేయడం లేదు. రెన్యూవల్కి వచ్చిన దరఖాస్తులను విచారణకు పంపుతాం. కొందరు లైట్ థ్రెట్ ఉందంటున్నారు. అందులో వారు పేర్కొన్న కారణాల ప్రకారం థ్రెట్ ఉందా లేదా అనేది పరిశీలిస్తాం. ఆ తర్వాతే రెన్యూవల్ చేస్తాం. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత లైసెన్స్‌లకు రెకమెండ్ చేయలేదు. బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా మంది ఉన్నారు. వారికి మాత్రమే రెకమెండ్ చేస్తున్నాం. – జి.వి.జి.అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
అందాల కోళ్లు.. అదృష్ట దేవతలు
♦ వీటి పెంపకం హోదాకు చిహ్నం.. ♦ చూస్తే చాలనే స్థాయి వీటి సొంతం.. ♦ ఈ చరణాయుధాల కథే వేరు.. కోడి.. ఈ మాట వింటే (శాకాహారులను మినహాయిస్తే) నోరూరనిదెవ్వరికి? పండగల్లోనో, మరే పవిత్రమైన రోజుల్లోనో తప్పితే అమాంతం చప్పరించేయాలన్న ఆరాటం కలగనిదెవ్వరికి? కానీ మన మధ్యనే ఉన్న కొందరు మాత్రం ఈ ప్రత్యేకమైన కోళ్లు చూడడం అబ్బురంగా భావిస్తారు! ఈ ప్రాంతంలో పెద్దగా లభించని పొట్టి ముక్కు, పొడుగు తోక రకం కోళ్లను పెంచడమే ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు! వీటి ఖరీదులు వేలలో ఉన్నా మురిపెంగా కొనుక్కుంటారు. కొందరు వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇంతా చేసి వీటిని పోటీలకు పంపరు.. కూరగా చేయరు! జస్ట్.. స్టేటస్ సింబల్‌గా ఇంటి ముందు పెరిగే ఈ కోళ్ల కథా కమామిషు ఇదీ.. మామూలుగా కోడి అంటే ఆహారంగానో, పండగ వేళ వినోదంగానో భావించే మనకు కొందరు కోళ్లకు హోదాకు చిహ్నంగా పెంచుతారంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కొన్నిదేశాలలో ఇంటి ముందు ఇటువంటి కోళ్లు పెరగడాన్ని స్టేటస్ సింబస్గా భావిస్తారు. చరణాలే( కాళ్లు) ఆయుధంగా పోరాటం చేస్తుంది కాబట్టి చరణాయుధంగా కూడా వ్యవహరిస్తారు.. వంపు తిరిగిన ముక్కుతో పాటు పొడుగాటి తోక ఉండే ఈ కోళ్లను ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. ఇంటి ముందు కట్టిఉంచిన కుక్కుటాన్ని ఆగిచూసి వెళ్లడం వీటిని గౌరవించడంగా భావిస్తారు. వీటిని పందేలకు పంపరు. ఆహారానికి చంపరు. మనసు కలతలకు దూరం కావడానికి సాధనంగా పరిగణిస్తారు. ఇక్కడివి కావు.. పొట్టి ముక్కు, పొడుగాటి తోక అందాలను బట్టి వీటి ధరలు కూడా అదురుతుంటాయి. తమిళనాడుకు చెందిన సేలం, దిండిగల్ పట్టణాలలో ఎంపికచేసిన వీటిని ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. దేశంలో వివిధ ప్రాంతాలకు రవాణా అవుతాయి. అక్కడ నుంచి విదేశాలకు కూడా వీటిని పంపిస్తారు. భీమిలి డివిజన్లోని ఈ మండలానికి చెందిన అమనాం పంచాయతీ, పద్మనాభం మండలంలోని రేవిడి పంచాయతీలో ఔత్సాహికులు వీటిని కొనుగోలుచేసి పునరుత్పత్తి అనంతరం విక్రయిస్తుంటారు. వీటిలో పుంజు రకాలలో పొడుగాటి తెల్లతోక కలిగిన రసంగి రకం రెండేళ్ల పక్షి రూ. 40 వేలకు, మూడేళ్లు వయసు కలిగిన నల్ల సవల రూ. 30 వేలకు, తొమ్మిది మాసాల వయసు గల డేగ రకానికి చెందిన పక్షి రూ.40 వేలకు అమ్ముడుపోతుంటాయి. వీటి తోకలు రెండుమీటర్ల వరకు ఉంటాయి. ఇలాంటి పక్షుల ధరలు తోక పొడవు బట్టి అత్యధికంగా రూ.80వేల నుంచి లక్ష వరకు పలుకుతుంటాయి. వంపు తిరిగిన ముక్కుల్లాంటి పెట్టలు కూడా ఒక్కొక్కటి రూ.8 వేల వరకు అమ్ముడుపోతున్నాయి. వీటిలో నల్ల కక్కెర, డేగపెట్ట, నల్ల సవల పెట్ట, రసంగి పెట్ట, కగర పెట్ట, తెల్ల సవల, ఎర్ర కక్కెర వంటి రకాలకు మంచి గిరాకీ ఉంటుంది. జూదానికి దూరం మామూలుగా సంక్రాంతి, దసరా వంటి పండగల కోసమే కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పెంచేవారున్న గ్రామాలలో కూడా వీటిని ప్రత్యేకశ్రద్ధతో పెంచుతున్నారు. కానీ వీటిని పొరపాటున కూడా పందాలకు దించరు. అంతేకాకుండా కొన్ని పుంజులను పునరుత్పత్తికి కూడా వినియోగించరు. దీనివలన తోక ఈకలు ఊడిపోయి వీటి అందం తగ్గుతుందని అంటారు. పెట్టలను మాత్రం గుడ్లుపెట్టిన తరువాత పొదిగించి విక్రయిస్తుంటారు. ఇంత ఖరీదైన కోళ్లను ఆహారంగా తీసుకోవడానికి పెంపకందారులకు మనసొప్పదు. కొన్నిప్రాంతాలలో పండగ సమయాలలో వీటికి అందాల పోటీలు నిర్వహించడం విశేషం. -
గ్రేట్ డేన్స్...
జంతువులు... మనిషి జీవితంలో భాగం. అందులోనూ కుక్క విశ్వాసానికి మారుపేరు. ఒకప్పటి గ్రామ సింహం ఇప్పుడు స్టేటస్ సింబల్. అయితే ఎన్నో రకాల జాతులున్నా... ఇప్పుడు సంపన్న వర్గాలు మాత్రం గ్రేట్ డేన్స్‌ను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నాయి. సున్నిత స్వభావం, భారీ శరీరం, నిశిత పరిశీలన, ధైర్యం కలగలిసిన జంతువు గ్రేట్ డేన్స్. వీటికి అపోలో ఆఫ్ ఆల్ డాగ్స్ అని పేరు. ఆదేశాలను వెంటనే అర్థం చేసుకునే డేన్స్‌కు శిక్షణ ఇవ్వడం చాలా సులువు. జర్మన్ షెపర్డ్కంటే అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని ఇట్టే పసిగడుతుంది. అందుకే వీటిని ఇళ్లలో పెంచుకోవడమే కాక పోలీసులు కూడా నిందితులను పట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. తక్కువ జూలు, ఎక్కువ ఎత్తు ఉండే... ఈ డేన్స్‌ను పెంచుకోవడానికే కాదు, సెక్యూరిటీ, సినిమా షూటింగ్స్‌కు కూడా ఎంచుకుంటున్నారు. ముప్పైవేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పలుకుతున్న గ్రేట్ డేన్స్ హైదరాబాద్‌లో కెన్నెల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అద్దెకు లభిస్తాయి... ఇటీవల పెద్దపెద్ద కంపెనీలు, ఫామ్ హౌస్‌లు, ఇళ్లకు సెక్యూరిటీగా అత్యంత అప్రమత్తంగా ఉండే డేన్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే లక్షల విలువైన వీటిని కొనలేనివారికోసం... నగర శివార్లలో ఉన్న ఎస్ఎస్ కెన్నెల్స్ అద్దెకి ఇస్తోంది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన డేన్ను అవసరమున్నన్ని రోజులు సెక్యూరిటీగా తెచ్చుకోవచ్చు. డేన్స్ కొత్తవాళ్ల ఆదేశాలను వెంటనే స్వీకరించడం కష్టం కనుక వాటితో పాటు ట్రైనీని కూడా పంపుతారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు అవసరమనుకుంటే నాలుగైదు కుక్కల్ని కూడా సెక్యూరిటీగా తెప్పించుకుంటున్నారు. కేవలం ఇలా సంస్థలు, ఇళ్లకే కాక సినిమా షూటింగ్స్‌కు కూడా కెన్నెల్స్ నుంచి కుక్కల్ని తీసుకెళ్తున్నారు. కొనాలనుకుంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా రకాల డేన్స్ అందుబాటులో ఉన్నాయి. కుక్కల రంగు, ఎత్తు, స్వభావం, ఇతర లక్షణాల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు. డేన్స్‌ను పెంచుకోవాలనుకునేవారు డేన్ కొనుగోలు చేసే కెన్నెల్ క్లబ్ ఇండియాలో నమోదు అయిందో, లేదో కనుక్కోవాలి. డేన్స్ ఏ దేశానికి చెందినవి, వాటికి ఏమైనా వ్యాధులున్నాయేమో తెలుసుకోవాలి. బ్రీడర్స్ వద్దే కొనాలి. శునకంతోనే స్నేహం... ‘నాగోల్, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఉన్న మా కెన్నెల్ సౌత్ ఇండియాలోనే పెద్దది. చిన్నప్పటి నుంచే జంతువులపై ఉన్న మక్కువతో కెన్నెల్‌ను ప్రారంభించాను. గ్రేట్ఫాన్, హార్లీక్వీన్, బ్లాక్ డెన్, గ్రేడ్డెన్ బ్రిండిల్, బ్లూ మోల్, ఫానీ క్వీన్‌తోపాటు 70కి పైగా గ్రేట్ డేన్స్ మా దగ్గర ఉన్నాయి. చిన్న పిల్లల్ని తెచ్చి బ్రీడ్ చేసి పెంచుతున్నాం. వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మా దగ్గర నుంచి ఎక్కువగా సినిమాలకోసం అద్దెకు తీసుకెళ్తుంటారు. సెక్యూరిటీ కోసం తీసుకెళ్లేవారి సంఖ్య ఈ మధ్యే పెరిగింది. బ్రీడ్‌ని బట్టి అద్దె ఉంటుంది’ అని చెబుతున్నాడు ఎస్ఎస్ కెన్నెల్స్ నిర్వాహకుడు ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి దగ్గర శిక్షణ పొందుతున్న డేన్స్ అనేక డాగ్షోలలో బహుమతులు పొందాయి. గ్రేట్ డేన్... అతి ఎత్తై జర్మన్ జాతి కుక్క. చిరుత చూపులు, మెరుపు వేగంతో రాయల్‌గా కనిపించే వీటి రూపంలో ఎంత గాంభీర్యం ఉందో... అంతే సున్నితమైనవి కూడా. మనుషులతో ఇట్టే కలిసిపోయి, చిన్నపిల్లలతో ఈజీగా స్నేహం చేయగలిగిన గ్రేట్డేన్స్ డాగ్స్‌ను పెంచుకునేందుకు సిటీవాసులు ఆసక్తి చూపుతున్నారు. వీటిని అద్దెకు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది...:: వాంకె శ్రీనివాస్ -
శునకం... ఓ ఫుల్ మీల్స్
చాలామంది తాము జంతు ప్రేమికులమని చాటుకోవడానికి గొప్ప గొప్ప జాతి శునకాలను పెంచుకోవడం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా చలామణీలో ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ, పలువురిని నేను దగ్గరి నుంచి పరిశీలించినప్పుడు వాటి పట్ల ఆయా యజమానులకు ఉన్న ‘ప్రేమ’ కళ్లకు కట్టింది. తాము తిని వదిలేసిన, మిగిలిపోయిన ఆహారాన్ని తమ పెంపుడు శునకాలకు పెట్టడం చూశాను. శునక ప్రేమికులకు నేను చెప్పేది ఒక్కటే.. ‘వాటిని పోషించే స్థోమత లేకుంటే, వాటికి సరైన తాజా ఆహారాన్ని పెట్టలేకుంటే వాటిని పెంచుకోకండి. పెంచుకునేటట్టయితే వాటికి సంబంధించిన ఆహార నియమాలను పాటించండి’. నేను ఒకసారి చందానగర్ గంగారంలోని సరస్వతి కర్రీ పాయింట్లో మధ్యాహ్నం భోజనం చేసి.. నేను తిన్న విస్తరిని బయట వేశాను. అంతలో ఒక శునకం అక్కడకు వచ్చి ఆ విస్తరిలో ఆత్రుతగా తలదూర్చింది. వెంటనే ఒక భోజనం పార్శిల్ కొని దాని ఎదుట ఉంచాను. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. శునకం విశ్వాసపాత్రమైన జంతువు. దానిని తక్కువగా చూడొద్దు. - ఏరువ ఆరోగ్యరెడ్డి ఆగపేట గ్రామం, నర్మెట్ట, వరంగల్ జిల్లా -
భారత కుబేరుల జేబులో స్పోర్ట్స్ టీమ్‌లు..!
న్యూయార్క్: స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకోవడం భారత సంపన్నుల సరికొత్త స్టేటస్ సింబల్‌గా మారిం దని ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకునే రేసులో భారత కుబేరులు ఇప్పుడు తలమునకలై ఉన్నారని వివరించింది. సంపన్న భారతీయుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ ఈ రేసులో కూడా దూసుకుపోతున్నారని వివరించింది. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ ముకేశ్ అంబానీదే. 2008లో 11 కోట్ల డాలర్లకు కొన్న ఈ టీమ్ ప్రస్తుత విలువ 20 కోట్ల డాలర్లని అంచనా. ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 38వ స్థానంలో ఉన్న కళానిధి మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను, 98వ స్థానంలో ఉన్న జీఎంఆర్ జి.ఎం. రావు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సాకర్‌కు సంబంధించి వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్‌లో టీమ్‌లను సొంతం చేసుకోవడంపై అంబానీలు కన్నేశారు. వీడియోకాన్ వేణు గోపాల్ ధూత్, సంజీవ్ గోయెంకాలు కూడా ఈ సాకర్ టీమ్‌లను కొనుగోలుదారుల్లో ఉన్నారు. భారత పురాతన క్రీడ కబడ్డీకి సంబంధించి మార్చిలో ప్రొ కబడ్డి లీగ్ ప్రారంభమైంది. 37 రోజుల పాటు జరిగిన ఈ కబడ్డీ పోటీలను 43.5 కోట్ల మంది టీవీ ప్రేక్షకులు చూశారని అంచనా. ఎక్కువ మంది వీక్షకులు చూసిన రెండో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఇదే. ఉదయ్ కోటక్, కిశోర్ బియానీలు కబడ్డీ టీమ్‌లను సొంతంచేసుకున్నారు. -
లాస్ట్ రిసార్ట్
రొటీన్ లైఫ్‌లో ఇష్టాలను చంపుకుని బతికిన వారికి పోయిన తర్వాత మోడ్రన్ సమాధుల రూపంలో శాశ్వత ఆనందం దొరుకుతోంది. పోయే వరకు పొందలేని దాన్ని.. సమాధితో అందిస్తున్నారు వారి కుటుంబసభ్యులు. కన్నుమూసిన వారు కలకాలం గుర్తుండిపోయేలా వారి సమాధులను ప్లాన్ చేస్తున్నారు. పోయినోళ్ల అభిరుచులను వారి వారసులు తీపి గురుతులుగా మలచుకుంటున్నారు. సమాధులే కాదు శవపేటికలు సైతం పోయినవారి కలలకు ప్రతిబింబించేలా చూసుకుంటున్నారు. తరలిరాని లోకాలకు తరలిపోయిన ఆత్మీయులకు ఘనమైన ఫేర్వెల్ ఇస్తున్నారు సిటీవాసులు. పుట్టెడు బాధను దిగమింగి, పోయిన మనిషి జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోయేలా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజ్‌మహల్ స్థాయిలో కాకున్నా, తమకు ఉన్నదాంట్లోనే కాస్తంత క్రియేటివిటీ జోడించి.. విలక్షణమైన సమాధులను కట్టిస్తున్నారు. పరమపదం చేరుకున్న మనిషి బలమైన కోరిక ఆ సమాధిలో కనిపించేలా చూస్తున్నారు. గ్రానైట్, మార్బుల్ ఇలా డిఫరెంట్ స్టోన్స్‌తో సమాధులు నిర్మించడం చాలాకాలంగా ఉన్నదే. మోడ్రన్ సమాధులు కన్నుమూసిన వారికి శాశ్వత నెలవుగా మారుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నవారు తమ సొంత స్థలాల్లోనే సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంహౌస్‌లు, పొలాల్లో సమాధులు కట్టిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని సమాధుల్లో చూపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు.. ఒకే రూఫ్ కిందకు వచ్చేలా నిర్మించే సమాధులను ఫ్యామిలీ సిమెట్రీలుగా పిలుస్తున్నారు. మాన్యుమెంటల్ సిమెట్రీలో సమాధిపై శిల్పం ఏర్పాటు చేస్తారు. ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉన్న మోడ్రన్ సమాధులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. క్లాస్ కఫిన్స్.. మతమేదైనా మృతదేహాన్ని ఖననం చేసే పద్ధతి ఉన్నవారు శవపేటికలు ప్రిఫర్ చేస్తున్నారు. ఆర్థిక స్తోమతను బట్టి శవపేటికలకు హంగులద్దుతున్నారు. కఫిన్ లోపల మెత్తగా ఉండేలా కుషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లికాని వారు, చిన్నపిల్లల మృతదేహాలకు తెలుపు రంగు శవపేటికలు వాడుతుంటారు. పెళ్లయినవారికి, పెద్దవారి భౌతికకాయాలకు బ్రౌన్, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ కఫిన్స్ వాడుతున్నారు. పైభాగంలో కూడా డిజైనింగ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించి ఖననం చేస్తున్నారు. స్టేటస్ సింబల్ ఈ తరం సమాధిని కూడా ఒక స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారని చెబుతున్నారు తిరుమలగిరిలోని హెవెన్ బౌండ్ ఫినరల్ సర్వీస్ నిర్వాహకుడు ఐవర్ ఫెర్నాండెజ్. ‘ఈ మధ్య శవపేటికలు కూడా అందంగా ఉండాలనుకునేవారు ఎక్కువ అవుతున్నారు. పోయినవారి టేస్ట్‌కు దగ్గరగా కఫిన్స్ ఆర్డర్ ఇస్తున్నారు. భూమిలో తేలికగా కలసిపోయే ఎకో ఫ్రెండ్లీ కఫిన్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్లైవుడ్, ఎమ్జీఎఫ్ (మల్డ్ డెన్సిటీ ఫోమింగ్) మెటీరియల్‌తో శవపేటికలు తయారు చేస్తుంటాం. పత్తి తీసిన తర్వాత మిగిలిన పల్ప్ నుంచి తయారైన ఎమ్జీఎఫ్తో తయారు చేసిన శవపేటికలు 5 నెలల్లోనే భూమిలో కలసిపోతాయి. పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తులు వీటిని కోరుకుంటున్నార’ని ఆయన చెప్పారు. అభిమానానికి ఆనవాళ్లు.. * లాస్ట్ జర్నీ.. రిచ్ఫుల్గా ఉండాలని కఫిన్స్ (శవపేటికలు), సమాధులకు క్లాస్ లుక్ ఇస్తున్నారు. * ఓ ప్రకృతి ప్రేమికుడి సమాధిని గ్రానైట్‌తో నిర్మించి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేశారు. * రెక్కల కష్టంతో పైస్థాయికి వచ్చిన ఓ సాధారణ రైతు భౌతికకాయాన్ని ఎకో ఫ్రెండ్లీ శవపేటికలో ఉంచి పొలాల మధ్య సమాధి చేశారు. * ట్రక్కు కొనాలన్న కోరిక తీరకుండానే కన్నుమూసిన ఓ పెద్దయనకు ట్రక్కు రూపంలోనే శవపేటిక అందించారు వారసులు. * చనిపోయిన వారి ఆత్మాభిమానాన్ని, వారిపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుతున్నారు.