భారత కుబేరుల జేబులో స్పోర్ట్స్ టీమ్‌లు..!
న్యూయార్క్: స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకోవడం భారత సంపన్నుల సరికొత్త స్టేటస్ సింబల్‌గా మారిం దని ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకునే రేసులో భారత కుబేరులు ఇప్పుడు తలమునకలై ఉన్నారని వివరించింది. సంపన్న భారతీయుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ ఈ రేసులో కూడా దూసుకుపోతున్నారని వివరించింది. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ ముకేశ్ అంబానీదే. 2008లో 11 కోట్ల డాలర్లకు కొన్న ఈ టీమ్ ప్రస్తుత విలువ 20 కోట్ల డాలర్లని అంచనా.
ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 38వ స్థానంలో ఉన్న కళానిధి మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను, 98వ స్థానంలో ఉన్న జీఎంఆర్ జి.ఎం. రావు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సాకర్‌కు సంబంధించి వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్‌లో టీమ్‌లను సొంతం చేసుకోవడంపై అంబానీలు కన్నేశారు. వీడియోకాన్ వేణు గోపాల్ ధూత్, సంజీవ్ గోయెంకాలు కూడా ఈ సాకర్ టీమ్‌లను కొనుగోలుదారుల్లో ఉన్నారు.
భారత పురాతన క్రీడ కబడ్డీకి సంబంధించి మార్చిలో ప్రొ కబడ్డి లీగ్ ప్రారంభమైంది. 37 రోజుల పాటు జరిగిన ఈ కబడ్డీ పోటీలను 43.5 కోట్ల మంది టీవీ ప్రేక్షకులు చూశారని అంచనా. ఎక్కువ మంది వీక్షకులు చూసిన రెండో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఇదే. ఉదయ్ కోటక్, కిశోర్ బియానీలు కబడ్డీ టీమ్‌లను సొంతంచేసుకున్నారు.