గ్రేట్ డేన్స్... | danes breed dogs is so great | Sakshi
Sakshi News home page

గ్రేట్ డేన్స్...

Published Wed, Feb 25 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

గ్రేట్ డేన్స్...

గ్రేట్ డేన్స్...

జంతువులు... మనిషి జీవితంలో భాగం. అందులోనూ కుక్క విశ్వాసానికి మారుపేరు. ఒకప్పటి గ్రామ సింహం ఇప్పుడు స్టేటస్ సింబల్. అయితే ఎన్నో రకాల జాతులున్నా... ఇప్పుడు సంపన్న వర్గాలు మాత్రం గ్రేట్ డేన్స్‌ను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నాయి. సున్నిత స్వభావం, భారీ శరీరం, నిశిత పరిశీలన, ధైర్యం కలగలిసిన జంతువు గ్రేట్ డేన్స్. వీటికి అపోలో ఆఫ్ ఆల్ డాగ్స్ అని పేరు. ఆదేశాలను వెంటనే అర్థం చేసుకునే డేన్స్‌కు శిక్షణ ఇవ్వడం చాలా సులువు. జర్మన్ షెపర్డ్‌కంటే అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని ఇట్టే పసిగడుతుంది. అందుకే వీటిని ఇళ్లలో పెంచుకోవడమే కాక పోలీసులు కూడా నిందితులను పట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. తక్కువ జూలు, ఎక్కువ ఎత్తు ఉండే... ఈ డేన్స్‌ను పెంచుకోవడానికే కాదు, సెక్యూరిటీ, సినిమా షూటింగ్స్‌కు కూడా ఎంచుకుంటున్నారు. ముప్పైవేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పలుకుతున్న గ్రేట్ డేన్స్ హైదరాబాద్‌లో కెన్నెల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
 

అద్దెకు లభిస్తాయి...
 ఇటీవల పెద్దపెద్ద కంపెనీలు, ఫామ్ హౌస్‌లు, ఇళ్లకు సెక్యూరిటీగా అత్యంత అప్రమత్తంగా ఉండే డేన్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే లక్షల విలువైన వీటిని కొనలేనివారికోసం... నగర శివార్లలో ఉన్న ఎస్‌ఎస్ కెన్నెల్స్ అద్దెకి ఇస్తోంది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన డేన్‌ను అవసరమున్నన్ని రోజులు సెక్యూరిటీగా తెచ్చుకోవచ్చు. డేన్స్ కొత్తవాళ్ల ఆదేశాలను వెంటనే స్వీకరించడం కష్టం కనుక వాటితో పాటు ట్రైనీని కూడా పంపుతారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు అవసరమనుకుంటే నాలుగైదు కుక్కల్ని కూడా సెక్యూరిటీగా తెప్పించుకుంటున్నారు. కేవలం ఇలా సంస్థలు, ఇళ్లకే కాక సినిమా షూటింగ్స్‌కు కూడా కెన్నెల్స్ నుంచి కుక్కల్ని తీసుకెళ్తున్నారు.
 
 కొనాలనుకుంటే...
 ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా రకాల డేన్స్ అందుబాటులో ఉన్నాయి. కుక్కల రంగు, ఎత్తు, స్వభావం, ఇతర లక్షణాల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు. డేన్స్‌ను పెంచుకోవాలనుకునేవారు డేన్ కొనుగోలు చేసే కెన్నెల్ క్లబ్ ఇండియాలో నమోదు అయిందో, లేదో కనుక్కోవాలి. డేన్స్ ఏ దేశానికి చెందినవి, వాటికి ఏమైనా వ్యాధులున్నాయేమో తెలుసుకోవాలి. బ్రీడర్స్ వద్దే కొనాలి.
 
 శునకంతోనే స్నేహం...
 ‘నాగోల్, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఉన్న మా కెన్నెల్ సౌత్ ఇండియాలోనే పెద్దది. చిన్నప్పటి నుంచే జంతువులపై ఉన్న మక్కువతో కెన్నెల్‌ను ప్రారంభించాను. గ్రేట్‌ఫాన్, హార్లీక్వీన్, బ్లాక్ డెన్, గ్రేడ్‌డెన్ బ్రిండిల్, బ్లూ మోల్, ఫానీ క్వీన్‌తోపాటు 70కి పైగా గ్రేట్ డేన్స్ మా దగ్గర ఉన్నాయి. చిన్న పిల్లల్ని తెచ్చి బ్రీడ్ చేసి పెంచుతున్నాం. వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మా దగ్గర నుంచి ఎక్కువగా సినిమాలకోసం అద్దెకు తీసుకెళ్తుంటారు. సెక్యూరిటీ కోసం తీసుకెళ్లేవారి సంఖ్య ఈ మధ్యే పెరిగింది. బ్రీడ్‌ని బట్టి అద్దె ఉంటుంది’ అని చెబుతున్నాడు ఎస్‌ఎస్ కెన్నెల్స్ నిర్వాహకుడు ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి దగ్గర శిక్షణ పొందుతున్న డేన్స్ అనేక డాగ్‌షోలలో బహుమతులు పొందాయి.

గ్రేట్ డేన్... అతి ఎత్తై జర్మన్ జాతి కుక్క. చిరుత చూపులు, మెరుపు వేగంతో రాయల్‌గా కనిపించే వీటి రూపంలో ఎంత గాంభీర్యం ఉందో... అంతే సున్నితమైనవి కూడా. మనుషులతో ఇట్టే కలిసిపోయి, చిన్నపిల్లలతో ఈజీగా స్నేహం చేయగలిగిన గ్రేట్‌డేన్స్ డాగ్స్‌ను పెంచుకునేందుకు సిటీవాసులు ఆసక్తి చూపుతున్నారు. వీటిని అద్దెకు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది...:: వాంకె శ్రీనివాస్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement