లాస్ట్ రిసార్ట్
రొటీన్ లైఫ్‌లో ఇష్టాలను చంపుకుని బతికిన వారికి పోయిన తర్వాత మోడ్రన్ సమాధుల రూపంలో శాశ్వత ఆనందం దొరుకుతోంది. పోయే వరకు పొందలేని దాన్ని.. సమాధితో అందిస్తున్నారు వారి కుటుంబసభ్యులు. కన్నుమూసిన వారు కలకాలం గుర్తుండిపోయేలా వారి సమాధులను ప్లాన్ చేస్తున్నారు. పోయినోళ్ల అభిరుచులను వారి వారసులు తీపి గురుతులుగా మలచుకుంటున్నారు. సమాధులే కాదు శవపేటికలు సైతం పోయినవారి కలలకు ప్రతిబింబించేలా చూసుకుంటున్నారు.
తరలిరాని లోకాలకు తరలిపోయిన ఆత్మీయులకు ఘనమైన ఫేర్‌వెల్ ఇస్తున్నారు సిటీవాసులు. పుట్టెడు బాధను దిగమింగి, పోయిన మనిషి జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోయేలా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజ్‌మహల్ స్థాయిలో కాకున్నా, తమకు ఉన్నదాంట్లోనే కాస్తంత క్రియేటివిటీ జోడించి.. విలక్షణమైన సమాధులను కట్టిస్తున్నారు. పరమపదం చేరుకున్న మనిషి బలమైన కోరిక ఆ సమాధిలో కనిపించేలా చూస్తున్నారు.
గ్రానైట్, మార్బుల్ ఇలా డిఫరెంట్ స్టోన్స్‌తో సమాధులు నిర్మించడం చాలాకాలంగా ఉన్నదే. మోడ్రన్ సమాధులు కన్నుమూసిన వారికి శాశ్వత నెలవుగా మారుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నవారు తమ సొంత స్థలాల్లోనే సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంహౌస్‌లు, పొలాల్లో సమాధులు కట్టిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని సమాధుల్లో చూపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు.. ఒకే రూఫ్ కిందకు వచ్చేలా నిర్మించే సమాధులను ఫ్యామిలీ సిమెట్రీలుగా పిలుస్తున్నారు. మాన్యుమెంటల్ సిమెట్రీలో సమాధిపై శిల్పం ఏర్పాటు చేస్తారు. ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉన్న మోడ్రన్ సమాధులు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
క్లాస్ కఫిన్స్..
మతమేదైనా మృతదేహాన్ని ఖననం చేసే పద్ధతి ఉన్నవారు శవపేటికలు ప్రిఫర్ చేస్తున్నారు. ఆర్థిక స్తోమతను బట్టి శవపేటికలకు హంగులద్దుతున్నారు. కఫిన్ లోపల మెత్తగా ఉండేలా కుషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లికాని వారు, చిన్నపిల్లల మృతదేహాలకు తెలుపు రంగు శవపేటికలు వాడుతుంటారు. పెళ్లయినవారికి, పెద్దవారి భౌతికకాయాలకు బ్రౌన్, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ కఫిన్స్ వాడుతున్నారు. పైభాగంలో కూడా డిజైనింగ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించి ఖననం చేస్తున్నారు.
స్టేటస్ సింబల్
ఈ తరం సమాధిని కూడా ఒక స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారని చెబుతున్నారు తిరుమలగిరిలోని హెవెన్ బౌండ్ ఫినరల్ సర్వీస్ నిర్వాహకుడు ఐవర్ ఫెర్నాండెజ్. ‘ఈ మధ్య శవపేటికలు కూడా అందంగా ఉండాలనుకునేవారు ఎక్కువ అవుతున్నారు. పోయినవారి టేస్ట్‌కు దగ్గరగా కఫిన్స్ ఆర్డర్ ఇస్తున్నారు. భూమిలో తేలికగా కలసిపోయే ఎకో ఫ్రెండ్లీ కఫిన్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్లైవుడ్, ఎమ్‌జీఎఫ్ (మల్డ్ డెన్సిటీ ఫోమింగ్) మెటీరియల్‌తో శవపేటికలు తయారు చేస్తుంటాం. పత్తి తీసిన తర్వాత మిగిలిన పల్ప్ నుంచి తయారైన ఎమ్‌జీఎఫ్‌తో తయారు చేసిన శవపేటికలు 5 నెలల్లోనే భూమిలో కలసిపోతాయి. పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తులు వీటిని కోరుకుంటున్నార’ని ఆయన చెప్పారు.
అభిమానానికి ఆనవాళ్లు..
* లాస్ట్ జర్నీ.. రిచ్‌ఫుల్‌గా ఉండాలని కఫిన్స్ (శవపేటికలు), సమాధులకు క్లాస్ లుక్ ఇస్తున్నారు.
* ఓ ప్రకృతి ప్రేమికుడి సమాధిని గ్రానైట్‌తో నిర్మించి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేశారు.
* రెక్కల కష్టంతో పైస్థాయికి వచ్చిన ఓ సాధారణ రైతు భౌతికకాయాన్ని ఎకో ఫ్రెండ్లీ శవపేటికలో ఉంచి పొలాల మధ్య సమాధి చేశారు.
* ట్రక్కు కొనాలన్న కోరిక తీరకుండానే కన్నుమూసిన ఓ పెద్దయనకు ట్రక్కు రూపంలోనే శవపేటిక అందించారు వారసులు.
* చనిపోయిన వారి ఆత్మాభిమానాన్ని, వారిపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుతున్నారు.