కొత్త సంవత్సరం ప్రారంభం
పొద్దున్నే అలారమ్ మోగుతుంది. అలా బద్దకంగా కళ్లు తెరిచి ఠక్కున స్నూజ్ బట్‌న్ నొక్కేసి.. దుప్పటి ముసుగేసేస్తాం. ఐదు పది నిమిషాలకు మళ్లీ సౌండ్... చెవుల్లో రింగ్‌మంటుంది. సీన్ రిపీట్! బెడ్‌పై అటూ ఇటూ దొర్లుతుండగానే.. మళ్లీ ట్రింగ్... ట్రింగ్! షెడ్యూల్ టైమ్ దాటిపోతుంది. బలవంతంగా బెడ్ దిగింది మొదలు... ఒకటే హడావుడి. ఓ చేత్తో బ్రష్ చేసుకుంటూనే... మరో చేతులో పేపర్! కాఫీ సిప్ చేస్తూనే... బాత్‌కు పరుగులు. నాలుగైదు చేతులుంటే బాగుండనిపిస్తుంది. బ్రేక్‘ఫాస్ట్’అయిపోయి... ఆఫీసు టైమ్ దాటిపోయి... టెన్షన్ టెన్షన్.
ఇదీ సగటు సిటీజనుడి రొటీన్ లైఫ్. కానీ ఒక్క రోజు తప్ప! అదే జనవరి ఫస్ట్! ఎందుకంటే కొత్త సంవత్సరం కదా..! ఆ రోజు ఏవేవో చేసేయాలని... ఎన్నెన్నో ప్రారంభించేయాలని తలపోస్తాం. అలారమ్ మోగకముందే మెలకువ వచ్చేస్తుంది. ఆ రోజంతా నయా జోష్ ఆస్వాదనంలో గడిచిపోతుంది. తీసుకున్న నిర్ణయాలు ఆ తరువాత ఎటుపోతాయో... ఏమౌతాయో తెలియదు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పినంత ఉత్సాహం ఆనక కనిపించదు.
ఇది కాదు మనం కోరుకునేది. ఆ సంతోషం... ఉత్సాహం... ఉల్లాసం ఏడాదంతా కొనసాగాలని... ఆహ్లాదకర గమనంలో ఆరోగ్యకర జీవితం గడపాలని. అందుకు శ్రీకారం చుట్టేందుకు న్యూ ఇయర్ అకేషన్‌కు మించిన సందర్భం మరోటి రాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని... పట్టుదలతో దీక్షగా వాటిని పాటిస్తే, ఈ ఒక్క రోజే కాదు... ఏడాదంతా ఆనందకరంగా ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట. సో.. ఈ జనవరి ఫస్ట్‌కు లైఫ్ స్టైల్‌ను రైట్ ట్రాక్ పైకి తెచ్చే నిపుణుల సూచనలు కొన్ని మీ కోసం...
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యం సహకరిస్తేనే ఏ పనైనా నిరాటంకంగా చేయగలం. ముందుకు పోగలం. అంటే తొలి ప్రాధాన్యం పుష్టికరమైన ఆహారానిది. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్‌ను తగ్గించి ఇంటి వంటలు తినండి. దీనివల్ల పోషకాలే కాదు... శుచి, శుభ్రత, నాణ్యత ఉన్న ఆహారం శరీరానికి చేరుతుంది. ఫాస్ట్ ఫుడ్స్‌ను పాలు, పండ్లు వాటితో రిప్లేస్ చేయండి. వీటితో పాటు మరో ముఖ్యమైన అంశం... సమయ పాలన. మీకున్న వెసులుబాటును బట్టి ఓ షెడ్యూల్ తయారు చేసుకోండి. దాని ప్రకారం నిద్ర లేవడం... తినడం... పడుకోవడం అలవాటు చేసుకోండి.
శ్రమయేవ జయతే
ఫుడ్ తరువాత శరీరానికి కావల్సింది వ్యాయామం. గజిబిజీ లైఫ్‌లో ఒత్తిడిని దూరం చేసేది ఇదొక్కటే. అందుకే ఈ రోజే వెళ్లి జిమ్‌లో చేరండి. అది కూడా ఏడాదంతా కొనసాగించాలన్న దృఢ సంకల్పంతోనే! కుదరని పక్షంలో కనీసం రోజుకు ఓ గంట వాకింగ్, వార్మప్స్ చేయండి. ఇది మీ బాడీని ఫిట్‌గా ఉంచడమే కాదు... లేజీనెస్ పోయి మీలో ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది. ఒక్కళ్లకే బోర్ కొడితే... ఫ్రెండ్స్‌తో కలసి ఏదో ఒక గేమ్ మొదలెట్టండి. మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. వీటన్నింటితో పాటు తప్పకుండా మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ప్రేమైక జీవనం...
భారతదేశంలో అద్భుతమైంది కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో మరెక్కడా కనిపించని బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మన కుటుంబాల్లోనే ఉంటాయి. ఎంత ఎడతెరిపి లేని పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా కనీసం వారంలో ఒక రోజు కుటుంబంతో స్పెండ్ చేయండి. ఆ రోజు అంతా కలుసుకొనేలా ప్లాన్ చేసుకోండి. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనురాగ బంధం మరింత బలపడుతుంది. అలాగే కొత్త ఫ్రెండ్‌షిప్‌నకూ బాటలు వేయండి.
రేపటి కోసం...
హెల్త్ ఎంత ముఖ్యమో జీవితంలో వెల్త్ కూడా అంతే ముఖ్యం. సరైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది. సో... చేతులో ఉన్నది ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేయకుండా రేపటి గురించి ఆలోచించండి. ప్రతి నెలా మీ జీతంలో నుంచో... పాకెట్ మనీలో నుంచో ఎంతో కొంత సేవింగ్ చేయండి. ఉద్యోగస్తులైతే... ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్ మంత్లీ ట్రాన్స్‌ఫర్ ఎంచుకోండి. తద్వారా నెలనెలా మీ జీతం అకౌంట్‌లో పడగానే సేవింగ్స్‌కు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంటుంది. మిగిలిన దాన్లోనే మంత్లీ ఎక్స్‌పెన్సెసెస్ ప్లాన్ చేసుకుంటారు.
సమాజ హితం...
ఎప్పుడూ మనం, మన కుటుంబమే కాదు... కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి. ఎలాంటి ఆలనాపాలనా లేని అనాథలు, స్థోమత లేక పూట గడవని అభాగ్యులు ఎందరో ఉన్నారు ఈ మహానగరంలో. అలాంటి వారి కోసం ఎవరికి చేతనైన సాయం వారు చేస్తే వారి జీవితాల్లో వెలుగు నింపినవారమవుతాము. సామాజిక హితం కోసం చేసే ఇలాంటి పనుల వల్ల మనకూ ఎంతో ఆత్మ సంతృప్తి మిగులుతుంది. అలాగే సోషల్ వర్క్ యాక్టివిటీస్‌కూ చేయూతనివ్వండి. సో... థింక్ పాజిటివ్... లెట్స్ గివ్ ఏ స్టార్ట్ ఫర్ చేంజ్ టు యువర్ లైఫ్! హ్యాపీ న్యూ ఇయర్!