Routine Life
-
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్స్టైల్లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్ తప్ప మరో ఎక్సైట్మెంట్ కరువైంది జీవితానికి. ఈ బోర్డమ్ను బ్రేక్ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్ జలపాతం. జలజల... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్.. అంటూ నేచర్ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి. ఇలా వెళ్లొచ్చు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. - వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి - రాయిల్కల్ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు - చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు. కొండల నడుమ వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది . ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు. ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 170 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: - జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది. - కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు - మద్యం తాగివెళ్లొద్దు. - ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. - జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. - కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. - ఫుడ్, వాటర్ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. టి. కృష్ణ గోవింద్, సాక్షి, వెబ్‌డెస్క్. -
‘జీవ గడియారం’ రివర్సు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ లాక్డౌన్ కొనసాగింపు కారణంగా.. నెలరోజులకు పైగా ఇళ్లకే పరిమితం కావడం, గతంలో మాదిరిగా రోజువారీ ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో వివిధ వర్గాల ప్రజల ఆహారం, నిద్ర, ఇతర అలవాట్ల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏది పడితే అది ఎక్కువగా తినేయడం, వ్యాయామం లేకపోవడం, ఉదయమే లేచి ఆఫీసుకు వెళ్లాలన్న అవసరం లేకపోవడం, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, టీవీలతోనే ఎక్కువ సమయం గడపడం వంటి వాటితో రాత్రిపూట నిద్రపై ప్రభావం చూపుతోంది. పై వ్యాపకాల్లో మునిగి తేలడం, ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమాల్లోనే గడపటం, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ఫోన్లలో చాటింగ్‌లతో గంటల కొద్దీ గడుపుతుండటంతో యువతతో పాటు మధ్య వయస్కులు కూడా అర్ధరాత్రి దాటాక ఏ ఒంటి గంటకో, రెండింటికో నిద్రపోవడం మధ్యాహ్నం ఏ 11, 12 గంటలకో నిద్ర లేవడం వంటివి చేస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం వల్ల ‘జీవ గడియారం’లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని డాక్టర్లు, సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఈ విధంగా అపసవ్య వేళ్లలో వల్ల బద్ధకం ఆవరించి రోజంతా అన్యమనస్కంగా ఉండేలా చేస్తోందన్నారు. దీనిని అధిగమించేందుకు కాఫీలు, టీలు ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్‌కు దారితీస్తుందం టున్నారు. నిద్రకు 2 గంటల ముందు వరకు మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించొద్దని, సోషల్ మీడియాలో గడపటం తగ్గించాలని, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం వినాలని సూచిస్తున్నారు. ‘సాక్షి’ ఇంటర్వూ్యల్లో వివిధ అంశాలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... బరువు పెరుగుదలతోనూ సమస్యలే.. ‘నిద్రలేమి, స్లీపింగ్ డిజార్డర్ల వంటివి ఎక్కువగా అధిక బరువు, ఊబకాయమున్న వారిలో కనిపిస్తుంటాయి. లాక్డౌన్ సందర్భంగా తినే ఆహారం అధికం కావడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో తాత్కాలికంగా బరువు పెరుగుదల సంభవిస్తోంది. ఇది కూడా నిద్ర సరిగా రాకపోవడానికి దారితీస్తుంది. సరిగ్గా నిద్రపోనందున చురుగ్గా లేకపోవడం, దేనిపైనా దృష్టి కేంద్రీకరించక పోవడం, నిరాసక్తంగా ఉండడం వంటివి అనుభవంలోకి వస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మితాహారంతో పాటు ప్రాణాయామం, యోగా, తేలికపాటి వ్యాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఆదివారాలు ఎలా ఐతే రిలాక్స్డ్గా ఉంటామో, ప్రతీరోజూ అలానే అనిపిస్తుంటుంది. ఉదయం పూట ఎక్కువగా నిద్ర రావడం, రాత్రి పడుకున్నా నిద్ర రాకపోవడం వంటి సమస్యలొస్తాయి. 30 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవాళ్లు కచ్చితంగా ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. ఆక్సిజన్ శాతాలు తగ్గినా, శ్వాస సరిగ్గా అందకపోయినా ఇబ్బందులు వస్తాయి. మెదడుకు సరిగ్గా రక్తప్రసారం కాక ఎప్పటికప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఈ కారణంగా ఏర్పడే మైక్రో అరౌజల్స్ వల్ల గాఢ నిద్రలోకి వెళ్లినా డిస్టర్బ్ అవుతారు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం లేదా వేళా పాళా లేకుండా ఏ అర్ధరాత్రి దాటాకో నిద్రపోతే ఉదయం పూట ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. పగటి పూట నిద్రను ఆపుకునేందుకు సిగరెట్లు, కాఫీ, టీలు తాగడం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.’ – స్లీపింగ్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ విశ్వనాథ్ గెల్లా వారం పాటు అలా ఉంటే డాక్టర్లను సంప్రదించాలి.. ‘స్లీపింగ్ ప్యాట్రన్లలో మార్పులు ఆదుర్దా, ఆందోళనలు, కుంగుబాటుకు దారితీస్తాయి. నిద్రకు అంతరాయం ఏర్పడితే లేదా అతి నిద్ర వల్ల జీవన విధానం కొంత డిస్టర్బ్ అవుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న వాతావరణం, భయం గొలిపేలా ఆలోచనలు, పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్ల నుంచి కరోనా వస్తుందా? బయటకు వెళితే ఎవరి నుంచైనా ఈ వైరస్ సోకుతుందా అనే భయాలు తీవ్రమై ఏదైనా ఎక్కువగా తినేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపించడం ఇది పెద్ద ఎత్తున ఒత్తిడికి కారణమవుతుంది. ఉద్యోగాలుం టాయా లేదా, ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుందా లేదా భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయాలు తీసుకునే ఆహారం, నిద్రపై ప్రభావం చూపుతాయి. ఇష్టం వచ్చినట్టు తినడం, నిద్రలేకపోవడం వంటి వాటితో స్లీపింగ్ ప్యాట్రన్లు మారుతున్నాయి. వారం రోజుల పాటు ఎవరైనా ఎక్కువగా ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం, భవిష్యత్‌పై భయాందో ళనలు వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తే వెంటనే తప్పనిసరిగా ఆన్లైన్లోనైనా సైకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. చిన్న చిన్న వ్యాయామాలు, నడక, యోగా వంటివి చేయడం, గార్డెనింగ్, ఇంటిపనులు చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఒత్తిళ్లను అధిగమించొచ్చు..’ – సైకాలజిస్ట్, సి.వీరేందర్ -
కొత్త సంవత్సరం ప్రారంభం
పొద్దున్నే అలారమ్ మోగుతుంది. అలా బద్దకంగా కళ్లు తెరిచి ఠక్కున స్నూజ్ బట్న్ నొక్కేసి.. దుప్పటి ముసుగేసేస్తాం. ఐదు పది నిమిషాలకు మళ్లీ సౌండ్... చెవుల్లో రింగ్మంటుంది. సీన్ రిపీట్! బెడ్‌పై అటూ ఇటూ దొర్లుతుండగానే.. మళ్లీ ట్రింగ్... ట్రింగ్! షెడ్యూల్ టైమ్ దాటిపోతుంది. బలవంతంగా బెడ్ దిగింది మొదలు... ఒకటే హడావుడి. ఓ చేత్తో బ్రష్ చేసుకుంటూనే... మరో చేతులో పేపర్! కాఫీ సిప్ చేస్తూనే... బాత్కు పరుగులు. నాలుగైదు చేతులుంటే బాగుండనిపిస్తుంది. బ్రేక్‘ఫాస్ట్’అయిపోయి... ఆఫీసు టైమ్ దాటిపోయి... టెన్షన్ టెన్షన్. ఇదీ సగటు సిటీజనుడి రొటీన్ లైఫ్. కానీ ఒక్క రోజు తప్ప! అదే జనవరి ఫస్ట్! ఎందుకంటే కొత్త సంవత్సరం కదా..! ఆ రోజు ఏవేవో చేసేయాలని... ఎన్నెన్నో ప్రారంభించేయాలని తలపోస్తాం. అలారమ్ మోగకముందే మెలకువ వచ్చేస్తుంది. ఆ రోజంతా నయా జోష్ ఆస్వాదనంలో గడిచిపోతుంది. తీసుకున్న నిర్ణయాలు ఆ తరువాత ఎటుపోతాయో... ఏమౌతాయో తెలియదు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పినంత ఉత్సాహం ఆనక కనిపించదు. ఇది కాదు మనం కోరుకునేది. ఆ సంతోషం... ఉత్సాహం... ఉల్లాసం ఏడాదంతా కొనసాగాలని... ఆహ్లాదకర గమనంలో ఆరోగ్యకర జీవితం గడపాలని. అందుకు శ్రీకారం చుట్టేందుకు న్యూ ఇయర్ అకేషన్‌కు మించిన సందర్భం మరోటి రాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని... పట్టుదలతో దీక్షగా వాటిని పాటిస్తే, ఈ ఒక్క రోజే కాదు... ఏడాదంతా ఆనందకరంగా ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట. సో.. ఈ జనవరి ఫస్ట్‌కు లైఫ్ స్టైల్‌ను రైట్ ట్రాక్ పైకి తెచ్చే నిపుణుల సూచనలు కొన్ని మీ కోసం... ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం సహకరిస్తేనే ఏ పనైనా నిరాటంకంగా చేయగలం. ముందుకు పోగలం. అంటే తొలి ప్రాధాన్యం పుష్టికరమైన ఆహారానిది. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్‌ను తగ్గించి ఇంటి వంటలు తినండి. దీనివల్ల పోషకాలే కాదు... శుచి, శుభ్రత, నాణ్యత ఉన్న ఆహారం శరీరానికి చేరుతుంది. ఫాస్ట్ ఫుడ్స్‌ను పాలు, పండ్లు వాటితో రిప్లేస్ చేయండి. వీటితో పాటు మరో ముఖ్యమైన అంశం... సమయ పాలన. మీకున్న వెసులుబాటును బట్టి ఓ షెడ్యూల్ తయారు చేసుకోండి. దాని ప్రకారం నిద్ర లేవడం... తినడం... పడుకోవడం అలవాటు చేసుకోండి. శ్రమయేవ జయతే ఫుడ్ తరువాత శరీరానికి కావల్సింది వ్యాయామం. గజిబిజీ లైఫ్‌లో ఒత్తిడిని దూరం చేసేది ఇదొక్కటే. అందుకే ఈ రోజే వెళ్లి జిమ్‌లో చేరండి. అది కూడా ఏడాదంతా కొనసాగించాలన్న దృఢ సంకల్పంతోనే! కుదరని పక్షంలో కనీసం రోజుకు ఓ గంట వాకింగ్, వార్మప్స్ చేయండి. ఇది మీ బాడీని ఫిట్‌గా ఉంచడమే కాదు... లేజీనెస్ పోయి మీలో ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది. ఒక్కళ్లకే బోర్ కొడితే... ఫ్రెండ్స్‌తో కలసి ఏదో ఒక గేమ్ మొదలెట్టండి. మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. వీటన్నింటితో పాటు తప్పకుండా మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రేమైక జీవనం... భారతదేశంలో అద్భుతమైంది కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో మరెక్కడా కనిపించని బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మన కుటుంబాల్లోనే ఉంటాయి. ఎంత ఎడతెరిపి లేని పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా కనీసం వారంలో ఒక రోజు కుటుంబంతో స్పెండ్ చేయండి. ఆ రోజు అంతా కలుసుకొనేలా ప్లాన్ చేసుకోండి. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనురాగ బంధం మరింత బలపడుతుంది. అలాగే కొత్త ఫ్రెండ్షిప్నకూ బాటలు వేయండి. రేపటి కోసం... హెల్త్ ఎంత ముఖ్యమో జీవితంలో వెల్త్ కూడా అంతే ముఖ్యం. సరైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది. సో... చేతులో ఉన్నది ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేయకుండా రేపటి గురించి ఆలోచించండి. ప్రతి నెలా మీ జీతంలో నుంచో... పాకెట్ మనీలో నుంచో ఎంతో కొంత సేవింగ్ చేయండి. ఉద్యోగస్తులైతే... ఆన్లైన్లో ఆటోమేటిక్ మంత్లీ ట్రాన్స్ఫర్ ఎంచుకోండి. తద్వారా నెలనెలా మీ జీతం అకౌంట్లో పడగానే సేవింగ్స్‌కు ఆటోమేటిక్‌గా ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. మిగిలిన దాన్లోనే మంత్లీ ఎక్స్పెన్సెసెస్ ప్లాన్ చేసుకుంటారు. సమాజ హితం... ఎప్పుడూ మనం, మన కుటుంబమే కాదు... కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి. ఎలాంటి ఆలనాపాలనా లేని అనాథలు, స్థోమత లేక పూట గడవని అభాగ్యులు ఎందరో ఉన్నారు ఈ మహానగరంలో. అలాంటి వారి కోసం ఎవరికి చేతనైన సాయం వారు చేస్తే వారి జీవితాల్లో వెలుగు నింపినవారమవుతాము. సామాజిక హితం కోసం చేసే ఇలాంటి పనుల వల్ల మనకూ ఎంతో ఆత్మ సంతృప్తి మిగులుతుంది. అలాగే సోషల్ వర్క్ యాక్టివిటీస్కూ చేయూతనివ్వండి. సో... థింక్ పాజిటివ్... లెట్స్ గివ్ ఏ స్టార్ట్ ఫర్ చేంజ్ టు యువర్ లైఫ్! హ్యాపీ న్యూ ఇయర్! -
లాస్ట్ రిసార్ట్
రొటీన్ లైఫ్‌లో ఇష్టాలను చంపుకుని బతికిన వారికి పోయిన తర్వాత మోడ్రన్ సమాధుల రూపంలో శాశ్వత ఆనందం దొరుకుతోంది. పోయే వరకు పొందలేని దాన్ని.. సమాధితో అందిస్తున్నారు వారి కుటుంబసభ్యులు. కన్నుమూసిన వారు కలకాలం గుర్తుండిపోయేలా వారి సమాధులను ప్లాన్ చేస్తున్నారు. పోయినోళ్ల అభిరుచులను వారి వారసులు తీపి గురుతులుగా మలచుకుంటున్నారు. సమాధులే కాదు శవపేటికలు సైతం పోయినవారి కలలకు ప్రతిబింబించేలా చూసుకుంటున్నారు. తరలిరాని లోకాలకు తరలిపోయిన ఆత్మీయులకు ఘనమైన ఫేర్వెల్ ఇస్తున్నారు సిటీవాసులు. పుట్టెడు బాధను దిగమింగి, పోయిన మనిషి జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోయేలా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజ్‌మహల్ స్థాయిలో కాకున్నా, తమకు ఉన్నదాంట్లోనే కాస్తంత క్రియేటివిటీ జోడించి.. విలక్షణమైన సమాధులను కట్టిస్తున్నారు. పరమపదం చేరుకున్న మనిషి బలమైన కోరిక ఆ సమాధిలో కనిపించేలా చూస్తున్నారు. గ్రానైట్, మార్బుల్ ఇలా డిఫరెంట్ స్టోన్స్‌తో సమాధులు నిర్మించడం చాలాకాలంగా ఉన్నదే. మోడ్రన్ సమాధులు కన్నుమూసిన వారికి శాశ్వత నెలవుగా మారుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నవారు తమ సొంత స్థలాల్లోనే సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంహౌస్‌లు, పొలాల్లో సమాధులు కట్టిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని సమాధుల్లో చూపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు.. ఒకే రూఫ్ కిందకు వచ్చేలా నిర్మించే సమాధులను ఫ్యామిలీ సిమెట్రీలుగా పిలుస్తున్నారు. మాన్యుమెంటల్ సిమెట్రీలో సమాధిపై శిల్పం ఏర్పాటు చేస్తారు. ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉన్న మోడ్రన్ సమాధులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. క్లాస్ కఫిన్స్.. మతమేదైనా మృతదేహాన్ని ఖననం చేసే పద్ధతి ఉన్నవారు శవపేటికలు ప్రిఫర్ చేస్తున్నారు. ఆర్థిక స్తోమతను బట్టి శవపేటికలకు హంగులద్దుతున్నారు. కఫిన్ లోపల మెత్తగా ఉండేలా కుషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లికాని వారు, చిన్నపిల్లల మృతదేహాలకు తెలుపు రంగు శవపేటికలు వాడుతుంటారు. పెళ్లయినవారికి, పెద్దవారి భౌతికకాయాలకు బ్రౌన్, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ కఫిన్స్ వాడుతున్నారు. పైభాగంలో కూడా డిజైనింగ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించి ఖననం చేస్తున్నారు. స్టేటస్ సింబల్ ఈ తరం సమాధిని కూడా ఒక స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారని చెబుతున్నారు తిరుమలగిరిలోని హెవెన్ బౌండ్ ఫినరల్ సర్వీస్ నిర్వాహకుడు ఐవర్ ఫెర్నాండెజ్. ‘ఈ మధ్య శవపేటికలు కూడా అందంగా ఉండాలనుకునేవారు ఎక్కువ అవుతున్నారు. పోయినవారి టేస్ట్‌కు దగ్గరగా కఫిన్స్ ఆర్డర్ ఇస్తున్నారు. భూమిలో తేలికగా కలసిపోయే ఎకో ఫ్రెండ్లీ కఫిన్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్లైవుడ్, ఎమ్జీఎఫ్ (మల్డ్ డెన్సిటీ ఫోమింగ్) మెటీరియల్‌తో శవపేటికలు తయారు చేస్తుంటాం. పత్తి తీసిన తర్వాత మిగిలిన పల్ప్ నుంచి తయారైన ఎమ్జీఎఫ్తో తయారు చేసిన శవపేటికలు 5 నెలల్లోనే భూమిలో కలసిపోతాయి. పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తులు వీటిని కోరుకుంటున్నార’ని ఆయన చెప్పారు. అభిమానానికి ఆనవాళ్లు.. * లాస్ట్ జర్నీ.. రిచ్ఫుల్గా ఉండాలని కఫిన్స్ (శవపేటికలు), సమాధులకు క్లాస్ లుక్ ఇస్తున్నారు. * ఓ ప్రకృతి ప్రేమికుడి సమాధిని గ్రానైట్‌తో నిర్మించి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేశారు. * రెక్కల కష్టంతో పైస్థాయికి వచ్చిన ఓ సాధారణ రైతు భౌతికకాయాన్ని ఎకో ఫ్రెండ్లీ శవపేటికలో ఉంచి పొలాల మధ్య సమాధి చేశారు. * ట్రక్కు కొనాలన్న కోరిక తీరకుండానే కన్నుమూసిన ఓ పెద్దయనకు ట్రక్కు రూపంలోనే శవపేటిక అందించారు వారసులు. * చనిపోయిన వారి ఆత్మాభిమానాన్ని, వారిపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుతున్నారు.